ఎందర్ని బలిగొంటడో..! | physician performance has been disputed. The other hand, continue to pay to the government | Sakshi
Sakshi News home page

ఎందర్ని బలిగొంటడో..!

Published Fri, Dec 27 2013 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

physician performance has been disputed. The other hand, continue to pay to the government

జమ్మికుంట టౌన్, న్యూస్‌లైన్: జమ్మికుంట ప్రభుత్వాస్పత్రి  వైద్యుడు సుధాకర్‌రావు తీరు వివాదాస్పదంగా మారింది. ఓవైపు సర్కారు నుంచి జీతభత్యాలు తీసుకుంటూ.. మరోవైపు పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులను దొంగచాటుగా తన ఆస్పత్రికి తరలించడం, ఆపై వారి ప్రాణాలతో చెలగాటమాడడంపై విమర్శలు వస్తున్నాయి.
 
 పట్టణంలో తాను నిర్వహిస్తున్న మమత నర్సింగ్‌హోంలో బుధవారం మండలంలోని వాగొడ్డురామన్నపల్లికి చెందిన కారట్లపల్లి శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ చనిపోయినా వైద్యం చేస్తున్నట్లు నటించి డబ్బులు లాగేందుకు యత్నించి.. పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చాడని పలువురు విమర్శిస్తున్నారు. కారట్లపల్లి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం విషం తాగగా, కుటుంబసభ్యులు అతడిని మొదట జమ్మికుంట ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. అక్కడ ఉన్న సిబ్బంది డ్యూటీ డాక్టరైన సుధాకర్‌రావు కు సమాచారం అందించారు. ఆస్పత్రికి వచ్చిన సుధాకర్‌రావు అతడికి కడుపును శుభ్రంగా కడిగి ఓపీ నంబర్ 4,447 అని రిజిస్టర్‌లో రాసుకున్న తర్వాత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేసినట్టు రికార్డుల్లో నమోదు చేశాడు.

 ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు లేవని తన సొంత ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందిస్తానని బంధువులతో చెప్పాడు. ఎంజీఎంకు వెళ్లాల్సిన శ్రీనివాస్‌ను పట్టణంలో తాను నిర్వహిస్తున్న మమత నర్సింగ్ హోమ్‌కు తరలించాడు. ఈ క్రమంలో సరైన వైద్యం అందక శ్రీనివాస్ ప్రాణాలు గాల్లో కలిశాయి. గతంలో ఇదే ఆస్పత్రిలో ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల బంధువులు ఆందోళన చేస్తే రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల దాకా చెల్లించి తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులకు సైతం భారీ మొత్తంలో ముడుపులు అందజేయడం వల్లనే సుధాకర్‌రావును ఎవరూ ఏమీ అనడం లేదని పలువురు బహిరంగం గా చర్చించుకుంటున్నారు. సుధాకర్‌రావు ఇల్లందకుంట ఆస్పత్రిలో పనిచేసిన సమయంలోనూ విధులకు సక్రమంగా హాజరుకాకుండా తన సొంత ఆస్పత్రికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవాడు. క్రిమిసంహారక మందు తాగిన కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తే.. వారికి మాయమాటలు చెప్పి పట్టణంలోని తన ఆస్పత్రికి తరలించేవాడని పలువురు పేర్కొం టున్నారు.
 
 గతంలో హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో విధులకు సక్రమంగా హాజరుకాకపోగా మత్తు ఇంజక్షన్ ఇచ్చేం దుకు లేటుగా వెళ్లడంతో అక్కడ ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అప్పటి జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ సుధాకర్‌రావు జమ్మికుంటలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని తనిఖీ చేసి అవాక్కయ్యా రు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించగా, అప్పుడు సుధాకర్‌రావు సస్పెండయ్యాడు. తర్వాత ఉన్నతాధికారులు మారడంతో తన పలుకుబడిఉపయోగించి తిరిగి జమ్మికుంట ప్రభుత్వాస్పత్రిలోనే పోస్టింగ్ తెచ్చుకున్నాడు. దీన్ని బట్టి ఉన్నతాధికారుల వద్ద అతడికి ఏమేరకు పలుకుబడి ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్య వృత్తికి కళంకం తెస్తున్న డాక్టర్ సుధాకర్‌రావుపై కొరడా ఝులిపించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement