ఉత్తమ సేవలు అందిస్తాం -డీజీపీ అనురాగ్ శర్మ
♦ సంగారెడ్డిలో సెంట్రల్ కమాండ్, కంట్రోల్ ప్రారంభం
♦ మహిళల కోసం రిసెప్షన్ సెంటర్ జిల్లాలలోనూ చలానాలు
సంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తామని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ప్రజలకు దగ్గరకు తీసుకెళ్లి వారి భయాందోళనలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు, పోలీసుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నప్పుడే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్‌ను ఆయన ప్రారంభించారు. రూరల్ షీ బస్సును కూడా ప్రారంభించారు. చేతన సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు ప్రజలు ముఖ్యంగా మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు.
మహిళలు తమ సమస్యలను చెప్పుకోడానికి ప్రతేక్యంగా రిసెప్షన్ సెంటర్‌ను ప్రారంభించామని వివరించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రమాదాలు జరిగితే తెలుసుకొని సిసి కెమెరాల ద్వారా నింధితులను పట్టుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్‌లో పాటు జిల్లాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. చలాన పద్ధతిని జిల్లాలో కూడా ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు. సిసి కెమెరాలను సమకూర్చిన మహీంద్రా, అరబిందో పరిశ్రమలను ఆయన అభినందించారు. అనంతరం జిల్లా ఐటి ల్యాబ్‌ను సందర్శించారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కోహీర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైరింగ్ రేంజ్‌కు భూమి పూజ నిర్వహించారు. అనంతరం చిరాక్‌పల్లి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్‌ను సందర్శించారు. జహీరాబాద్ పట్టణంలో నూతన భవనాన్ని ప్రారంభించారు.
ఈ కర్యాక్రమంలో ఐజిపి నవీన్ చంద్, ఎస్పీ బడుగుల సుమతి, అదనపు ఎస్సీ వెంకన్న, ఓయస్‌డి జ్యోతిప్రకాష్, ఎఆర్ అదనపు ఎస్పీ బాపురావు, వివిధ సబ్ డివిజన్ల డిఎస్‌పిలు, చేతన సెంటర్‌లో సేవలందిస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయులు, సిఐలు, ఎస్సైలు, జిల్లా పోలీసు సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రిసెప్షన్ సెంటర్ నూతన భవనం ప్రారంభం
సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ సెంటర్ నూతన భవనాన్ని డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ప్రారంభించారు. ఈ సెంటర్‌ను మహిళా కానిస్టేబుల్‌తో రిబ్బన్ కట్ చేయించడం విశేషం.