సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, వాటి నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించబోతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై జరిగే ప్రమాదాలపై అధ్యయనం చేసిన పోలీస్ శాఖ.. వాటి నియంత్రణకు ప్రణాళిక తయారు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏయే రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్న పలు కారణాలను విశ్లేషించింది.
రోడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రస్తుతం పోలీస్ శాఖలో రోడ్ సేఫ్టీ వింగ్ పనిచేస్తోంది. అయితే పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతోపాటు చాలీచాలని బడ్జెట్‌తో కునికిపాట్లు పడుతోంది. ప్రమాదాల నివారణకు ప్రత్యేక అధికారాలు, సిబ్బంది, బడ్జెట్.. ఇలా అన్నీ కేటాయిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో డీజీపీ అనురాగ్ శర్మ రోడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల అది పెండింగ్‌లో పడింది. అయితే ప్రస్తుతం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సందర్భంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వీలుగా రోడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఏర్పాటును వేగవంతం చేసేందుకు పోలీస్ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన బ్లాక్‌స్పాట్స్‌ను దృష్టిలో పెట్టుకొని 18 రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో రెండు రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. రోడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఏర్పాటయితే, ఈ విభాగానికి డిప్యుటేషన్‌పై అధికారులు, సిబ్బందిని కేటాయించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం కొత్త కానిస్టేబుళ్ల శిక్షణ ముగియగానే అందులో నుంచి కొందరు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కొందరిని ఈ డిపార్ట్‌మెంట్‌కు డిప్యుటేషన్‌పై పంపించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో పోలీస్ స్టేషన్‌కు ఎస్‌ఐ స్థాయి అధికారితో పాటు 8మంది కానిస్టేబుళ్లు ఉండేలా ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలిసింది.
బ్లాక్ స్పాట్స్‌లో స్టేషన్లు: పదేపదే ఒకేచోట ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా పోలీస్ శాఖ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 23 ప్రాంతాలను గుర్తించారు. 20 ప్రమాదాలు జరిగి, ఇద్దరికన్నా ఎక్కువ మంది మృతులు ఉన్న ప్రమాద ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా అంచనా వేశారు. ఇక్కడ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ప్రమాదాల నివారణకు సేఫ్టీ డిపార్ట్‌మెంట్
Published Wed, Jan 3 2018 3:57 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment