సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసింగ్ మొత్తం ఒకేలా ఉండేలా చూడటమే తన ప్రధాన కర్తవ్యమని నూతన డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీగా ఆదివారం పదవీవిరమణ చేసిన అనురాగ్‌శర్మ నుంచి పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం మహేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసుశాఖ అధిపతిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
హైదరాబాద్‌లో అయినా లేక ఆదిలాబాద్‌లో అయినా పోలీసుల పనితీరు ఒకేలా ఉండేలా చూస్తానని, హైదరాబాద్ కమిషనరేట్‌లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో అమలు చేయడంతోపాటు నేరాల నియంత్రణ, మహిళల భద్రత తన లక్ష్యాలన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిదిలో 1.5 లక్షల సీసీటీవీలు ఏర్పాటు చేశామని, మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 10 లక్షల కమ్యూనిటీ సీసీటీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. తొలి దశలో మూడు కమిషనరేట్లలో, రెండో దశలో కొత్తగా ఏర్పడ్డ కమిషనరేట్లలో టెక్నాలజీ, సీసీటీవీలు, సైబర్ ల్యాబ్‌లు, షీటీమ్స్‌లు ఏర్పాటు చేస్తామ న్నారు. మూడో దశలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారిస్తామన్నారు.
ప్రజా భాగస్వామ్యంతో ముందుకు...
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో సర్వీసు డెలివరీ సమయం 4–5 నిమిషాలుగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. నిరంతర పెట్రోలింగ్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సేవల ద్వారా సర్వీసు డెలివరీలో మరింత ముందుకు వెళ్లొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సహకారం లేనిదే ఎంతటి కార్యక్రమమైనా విజయవంతం కాదని, ప్రతి కార్యక్రమంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేర నియంత్రణ చేయవచ్చన్నారు. రాష్ట్రంలో నేరం చేస్తే పోలీసులు క్షణాల్లో పట్టుకుంటారన్న భయం నేరస్తుల్లో ఏర్పడే స్థాయిలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తామన్నారు.
అనురాగ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు
డీజీపీగా పదవీ విరమణ చేసిన అనురాగ్‌శర్మకు రాష్ట్ర పోలీస్ కేంద్ర కార్యాలయంలో అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు ఆనవాయితీ ప్రకారం రిటైర్డ్ డీజీపీ వాహనాన్ని ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులంతా తాళ్లతో లాగుతూ గేటు వరకు తీసుకువచ్చారు. అనంతరం గౌరవ వందనం చేసి అనురాగ్‌శర్మకు వీడ్కోలు పలికారు.
సిబ్బంది పనితీరు మదింపు...
పోలీసు సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు గుర్తించేందుకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ విధానాన్ని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ప్రవేశపెడతామని డీజీపీ చెప్పారు. దీనివల్ల ప్రతి జిల్లా, సబ్ డివిజన్, పోలీసు స్టేషన్ పరిధిలో హోంగార్డులు మొదలు ఐపీఎస్‌ల వరకు వారి పనితీరు సులభంగా తెలుస్తుందని, దాని ఆధారంగా ప్రతిభగల సిబ్బందికి గుర్తింపునిచ్చి తోడ్పాటు అందిస్తామన్నారు. హోంగార్డులు, కానిస్టేబుళ్లకు ఆఫీసర్లుగా గుర్తింపు లభించేలా చూస్తానని డీజీపీ హామీ ఇచ్చారు. ఈ మేరకు వారి రీ డెసిగ్నేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 18 వేలకుపైగా పోలీసు పోస్టులు మంజూరయ్యాయని, ప్రస్తుతం 10 వేల మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్నారని వివరించారు.
గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీ
నూతన డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎం. మహేందర్‌రెడ్డి, డీజీపీగా పదవీవిరమణ సందర్భంగా అనురాగ్‌శర్మ ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment