ప్రయాణికులు మెచ్చే విమానాశ్రయాలు | The most popular airports for travelers | Sakshi
Sakshi News home page

ప్రయాణికులు మెచ్చే విమానాశ్రయాలు

Published Thu, Oct 30 2014 11:59 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

ప్రయాణికులు మెచ్చే విమానాశ్రయాలు - Sakshi

ప్రయాణికులు మెచ్చే విమానాశ్రయాలు

1. సేవలలో ఫస్ట్.. షాంఘై
 
ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌గా ఇప్పటికే నాలుగుసార్లు బహుమతులను కైవసం చేసుకున్న షాంఘై ఎయిర్‌పోర్ట్ ఈ ఏడాదీ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్‌లో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ కిందటేడాది 50 మిలియన్ల మంది ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ప్రయాణికులు ఈ ఏడాది కూడా ఈ విమానాశ్రయానికి అగ్రతాంబూలం ఇచ్చారు. ఆసియా ఖండం నుంచి ఎంపికైన ఈ ఎయిర్‌పోర్ట్ 3,200 ఎకరాల స్థలంలో, ఏడాదికి 66 మిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలిగే సామర్థ్యం కలిగి ఉంది.
 
2. అత్యంత వేగం... ఇంచియాన్

ఆసియా ఖండంలో రెండవ అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్ అవార్డును ఇంచియాన్ విమానాశ్రయం సొంతం చేసుకుంది. సౌత్ కొరియాలోని సియోల్‌లో ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కొన్నేళ్లుగా బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లలో రెండవస్థానాన్ని కొట్టేస్తూ వచ్చిన ఇంచియాన్ ఈ యేడాది కూడా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక్కడి సిబ్బంది సేవలు అత్యుత్తమంగా ఉంటాయని ప్రజలు కొనియాడారు. 2005 సంవత్సరంలో ప్రారంభించిన ఈ విమానాశ్రయంలో ఇతర సేవలతో పాటు గోల్ఫ్ కోర్స్, స్పా, వ్యక్తిగత గదులు, ఐస్ స్కేటింగ్ రింక్, క్యాసినో, ఇండోర్ గార్డెన్స్, కొరియా సంస్కృతికి సంబంధించిన మ్యూజియమ్.. మొదలైనవన్నీ ఉన్నాయి. ప్రయాణికులను అత్యంత వేగంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చగలదనే ప్రపంచవ్యాప్తంగా పేరుంది. దీంతో వ్యాపారవేత్తలు ఈ విమానాశ్రయం నుండి అత్యధికంగా ప్రయాణిస్తుంటారు.
 
3. సెల్ఫ్ సర్వీస్... ఆమ్‌స్టర్ డ్యామ్ చిపోల్

మొదటిసారి స్కైట్రాక్స్ అవార్డును సొంతం చేసుకున్న ఈ విమానాశ్రయం నెదర్‌ల్యాండ్స్, అమ్‌స్టర్ డ్యామ్ ప్రాంతంలో ఉంది. అతి పెద్దదైన ఈ విమానాశ్రయంలో స్వీయ సేవా బదిలీ ప్రక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. యూరప్ దేశాలలో రద్దీ గల విమానాశ్రయంగా దీనికి పేరుం ది. 1916లో ప్రారంభించిన ఈ విమానాశ్రయం కిందటేడాది 52 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించింది.
 
4. వాణిజ్య సేవలలో మేటి..  హాంగ్ కాంగ్
 
2012లో మూడవస్థానంలో ఉన్న హాంగ్‌కాంగ్ విమానాశ్రయం ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. 1988 నుంచి ఈ విమానాశ్రయం వాణిజ్యపరమైన సేవలు అందిస్తోంది. 65,000 మంది సిబ్బంది పనిచేస్తున్న ఈ విమానాశ్రయంలో నుంచి ప్రపంచంలోని 180 ముఖ్య పట్టణాలకు వాయుమార్గం ఉంది.
 
5. అధునాతనం.. బీజింగ్ క్యాపిటల్
 
ఉత్తర బీజింగ్‌లో గల బీజింగ్ క్యాపిటల్ విమానాశ్రయం’ 1958లో చిన్న భవనంలో మొదలైంది. 1980లో ఒకేసారి 12 విమానాలు ల్యాండ్ అయ్యే సామర్థ్యంతో 3,700 ఎకరాలలో అధునాతనంగా నిర్మించారు. 1999లో 50వ వార్షికోత్సవం జరుపుకున్న ఈ ఎయిర్‌పోర్ట్ ప్రతియేటా 83 కోట్లకు పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతూ 5వ స్థానంలో నిలిచింది.
 
6. అన్నపూర్ణ... మ్యూనిచ్

విమానాశ్రయాలలో ఆహారపదార్థాలకు అత్యధిక డబ్బు ఖర్చు చేస్తూ విసిగిపోయే ప్రయాణికులు మ్యూనిచ్ ఎయిర్‌పోర్ట్ కు నీరాజనాలు పలికారు. జర్మనీలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ అందించే స్థానిక సదుపాయాలు ప్రయాణికులకు అమితంగా నచ్చుతున్నాయి. మధ్య యూరప్‌లో అత్యుత్తమ భోజన సదుపాయాలు గల ఎయిర్‌పోర్ట్ జాబితాలో బెస్ట్ డైనింగ్ ప్లేస్ అవార్డును కొట్టేసింది.
 
7. లగేజీ సురక్షితం... జోరిచ్

విమానాశ్రయాలలో లగేజీలు పోగొట్టుకునే అనుభవం చాలా మంది ప్రయాణికులకు ఉంటుంది. కానీ, స్విట్జల్యాండ్‌లోని జోరిచ్ ఎయిర్‌పోర్ట్’లో లగేజీ మిస్ అయ్యే అవకాశమే లేదు. అన్ని భద్రతా చర్యలు తీసుకుంటారు ఇక్కడ. ప్రపంచంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ల కన్నా లగేజీ సురక్షితంగా చేర్చడంలో ముందు వరసలో ఉన్నది జ్యూరిచ్ ఒక్కటే. అందుకే ఈ ఏడాది బెస్ట్ బ్యాగేజీ డెలివరీ అవార్డును, అలాగే అత్యుత్తమ సిబ్బంది సేవల అవార్డును ఈ ఎయిర్‌పోర్ట్ సొంతం చేసుకుంది.  
 
8. ప్రతినిధుల ప్రశంసలు... వ్యాన్కూవర్

బ్రిటిష్ కొలింబియాలో గల వ్యాన్కూవర్ ఈ ఏడాది బెస్ట్ ఎయిర్‌పోర్ట్ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ఉత్తర అమెరికా ప్రతినిధుల చేత ప్రశంసలు పొందిన ఈ ఎయిర్‌పోర్ట్ 2012లో తొమ్మిదవస్థానంలో ఉండగా ఈ ఏడాది మరో మెట్టు అధిగమించింది.
 
9. పరిశుభ్రతకు మారు పేరు... టొక్యో
 
పది అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో కొత్తగా చేరింది జపాన్‌లోని ‘టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం. బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ ల జాబితాలో 2012లో మొదటి స్థానంలో ఉన్న ఈ విమానాశ్రయంలోని పరిశుభ్రత సూపర్బ్‌గా ఉంటుందని ప్రయాణికులు కొనియాడారు.
 
10. అత్యుత్తమ టెర్మినల్స్... లండన్ హీత్రో

లండన్‌లో 5 అతి పెద్ద టెర్మినల్స్‌తో 2008లో ప్రారంభించిన హీత్రో ఎయిర్‌పోర్ట్ 2012 వరకు వరుసగా బెస్ట్ టెర్మినల్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్‌ను పదవ స్థానానికి పరిమితం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement