‘సాక్షి’ ఎక్సలెన్స్ విజేతల ఎంపిక పూర్తి
♦ ఎనిమిది కేటగిరీల్లో అవార్డులకు విజేతల ఎంపిక
♦ త్వరలో ఎంపికైన విజేతలకు అవార్డుల ప్రదానం
♦ ఎంట్రీలకు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో అద్భుత సేవలందించిన ప్రతిభావంతులకు ఏటా అందజేసే ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల విజేతల ఎంపిక సోమవారం ముగిసింది. సామాజిక సేవ, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం తదితర రంగాల్లో ‘సాక్షి ఎక్సలెన్స్-2015’ అవార్డులకు విజేతలను ఎంపిక చేశారు. త్వరలో నిర్వహించనున్న కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులకు ఈ ఏడాది కూడా అనూహ్య స్పందన లభించింది. ఆయా రంగాల్లో ఉత్తమ సేవలు అందజేసిన వ్యక్తులు, సంస్థల నుంచి విజేతలను ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా కొనసాగింది. వివిధ రంగాల్లో అపార అనుభ వజ్ఞులైన ప్రముఖులు జ్యూరీగా వ్యవహరించారు. వివిధ దశల్లో జరిగిన ఎంపిక ప్రక్రియ సోమవారం ఫైనల్‌కు చేరుకుంది.
ఎనిమిది కేటగిరీల్లో...
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కోసం ఎనిమిది కేటగిరీలను గుర్తించారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఫార్మింగ్(వ్యవసాయం), బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ స్మాల్ అండ్ మీడియం స్కేల్, సోషల్ డెవలప్‌మెంట్(ఎన్జీవోస్), యంగ్ ఎచీవర్ ఇన్ ఎడ్యుకేషన్, యంగ్ ఎచీవర్ ఇన్ సోషల్ సర్వీస్ రంగాల్లో అవార్డులను అందజేసేందుకు ఎంట్రీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాక్షికి అందిన ఎంట్రీలను వివిధ స్థాయిల్లో న్యాయనిర్ణేతలు వడపోశారు. చివరకు సోమవారం విజేతలుగా నిలిచిన ఉత్తమ వ్యక్తులు, సంస్థల ఎంపిక పూర్తయ్యింది.
ఎంవీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా, మాజీ అడ్వొకేట్ జనరల్ ఏ సత్యప్రసాద్, కిమ్స్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.కృష్ణయ్య, సీనియర్ సంపాదకులు డాక్టర్ ఏబీకే ప్రసాద్, డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ డీఎన్ రెడ్డి, ఎలికో ఫార్మా సీఎఫ్‌ఓ, మేనేజింగ్ డెరైక్టర్ వనితా దాట్ల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశమైన జ్యూరీ విస్తృతంగా చర్చించిన అనంతరం తుది విజేతలను ఖరారు చేసింది.
తమకు అందిన ప్రతి ఎంట్రీని న్యాయనిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిదీ ఒకదానితో మరొకటి పోటీపడుతున్నట్లుగా ఉందని జ్యూరీ సభ్యులు అభిప్రాయపడ్డారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల జ్యూరీకి సభ్యులుగా వ్యవహరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జ్యూరీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, కార్పొరేట్ కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి పాల్గొన్నారు.