సమాజ హితం కోసం ముందుకొస్తున్న యువత
చదువులు, ఉద్యోగాలు కొనసాగిస్తూనే సమాజ సేవ
విభిన్న రంగాల్లో నిస్వార్థ సేవలు అందిస్తున్న పలువురు
నగరంలో వందల కొద్ది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అనాథలు, వయోవృద్ధులు మొదలు.. జంతు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక హక్కులు, మానవ హక్కులు, వికలాంగుల సేవ.. ఇలా విభిన్న అంశాల్లో సమాజ సేవ చేయడానికి ఎన్జీవోలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సామాజిక సేవ ఒక సంస్థతోనో.. ఒక వ్యక్తితోనో సంపూర్ణంగా నిర్వహించలేం.. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నీ వలంటీర్స్‌పై ఆధారపడి సేవలు కొనసాగిస్తున్నాయి. నగరం వేదికగా ఉన్న ఎన్జీవోల్లో సగానికి పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వలంటీర్ల మద్దతుతో కొనసాగుతున్నవే.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా విభిన్న రంగాల్లో సేవలందిస్తున్నారు. నేడు ప్రపంచ వలంటీర్ దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా సేవలందిస్తున్న విభిన్న సామాజిక సేవా విభాగాల్లోని విశేషాలు తెలుసుకుందాం..
కోటిన్నరకుపైగా జనాభా కలిగిన హైదరాబాద్‌లో వేల సంఖ్యలో అనాథలు, నిరాశ్రయులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి సేవలందించడానికి ఎన్నో రకాల స్వచ్ఛంద సేవ సంస్థలు నిత్యం కృషి చేస్తున్నాయి. దాతల సహాయంతో కార్పొరేట్ కంపెనీల సీఎస్‌ఆర్ నిధులతో సామాజిక సేవ చేస్తున్న ఎన్జీవోలకు వలంటీర్ వ్యవస్థ వారధిగా పనిచేస్తుంది. ఇందులో అధిక శాతం యువతనే ఉండటం విశేషం. విద్యార్థులు, ఉద్యోగులుగా వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తున్న యువత హ్యాపీగా జీవితాన్ని అన్ని కోణాల నుంచి చూడాలన్న మంచి హృదయంతో వలంటీర్లుగా మారుతున్నారు. వారంలో ఒక రోజైనా లేదా రెండు, మూడు రోజులకు కాసింత సమయమైనా ఎన్జీవోలకు కేటాయిస్తూ తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా వీధుల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న అనాథలకు, అన్నార్తులను కలిసి వారి పరిస్థితులను తెలుసుకొని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో చేరి్పంచడం లేదా తాత్కాలికంగా వారి ఆకలి తీర్చడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఈ వలంటీర్లు ఏదో ఒక ఎన్జీవోతో కలిసి తమ సేవలను కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా చలికాలంలో దుప్పట్లు పంచడం, వర్షాకాలంలో రెయిన్ కోట్లు పంచడం, ఎండాకాలంలో నీళ్లు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
జంతువులకు బాసటగా..
నగరం వేదికగా జంతు ప్రేమికులకు ప్రత్యేకంగా సమూహాలు సైతం ఉన్నాయి. ఈ జంతువులకు కొన్ని ఎన్జీవోలతో కలిసి లేదా వారే ఒక
సంఘంగా ఏర్పడి నగరంలోని నిరాదరణకు గురైన జంతువులు, సాధుజంతువుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హింస, దాడులకు గురైనప్పుడు వాటికి కారణమైన వ్యక్తులను వ్యవస్థలను న్యాయపరంగా శిక్షించేందుకు కృషి చేస్తున్నారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా వెబ్‌సైట్‌లో పేజీలు క్రియేట్ చేసుకుని తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పెట్స్ వేగన్స్ క్లబ్, బ్లూ క్రాస్ సొసైటీ వంటి పలు సంస్థలు పని చేస్తున్నాయి.
రోగులకు సేవలందిస్తూ..
ప్రస్తుత తరుణంలో వివిధ కారణాలతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్షణ అందించడం చాలా అవసరం. ఈ విషయంలో నగరం వేదికగా ఎంతోమంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ ఆహా్వనం మేరకు పలువురు వలంటీర్లు సదరు హాస్పిటల్స్‌కు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు.
పర్యావరణం.. మన హితం..
పర్యావరణ పరిరక్షణ కోసం పలువురు హౌస్ స్థాయిలో విభిన్న వేదికలుగా విశేష సేవలు అందిస్తున్నారు. వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించడం మొదలు కాలుష్యం పెరగడానికి కారణమైన మొక్కల నరకడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వారు సైతం ఉన్నారు. తప్పనిసరి నరికేయాల్సి వచ్చిన మొక్కలను తిరిగి మళ్లీ పెంచేలా కృషి చేస్తుండటం విశేషం. పర్యావరణ సంరక్షణలో ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి దశాబ్ద కాలంగా కొన్ని సంస్థలు అందులోని వాళ్లు విశేషంగా కృషి చేస్తున్నారు.
మూగజీవుల కోసం..
సాటి మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ప్రత్యేకంగా హక్కులున్నాయి. వాటి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా వంతు సామాజిక బాధ్యతగా జంతు సంరక్షణకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇందులో భాగంగా వీధి కుక్కలకు ఆహారం అందించడం, ఆదరణకు నోచుకొని జంతువులకు అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి చికిత్స అందిస్తాం. ఈ మధ్యకాలంలో జంతువులపై దాడులు పెరిగిపోయాయి. వీటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడమే కాకుండా హింసకు పాల్పడవద్దంటూ అవగాహన కల్పస్తున్నాం.
– గౌతమ్ అభిష్‌క్, అనిమల్ యాక్టివిటీస్
రక్తం అందేందుకు కృషి..
ప్రస్తుత జీవన విధానంలో ప్రమాదాలు కావొచ్చు.. ఇతర అనారోగ్య సమస్యలు కావొచ్చు.. అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలు, లక్షల సంఖ్యలో ఉన్నారు. సరైన సమయంలో సాటి మనుషులు స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదనే లక్ష్యంతో నేను వలంటీర్‌గా రక్తదానం చేస్తున్నాను. నేను రక్తదానం చేస్తూనే నా స్నేహితులను ఏకం చేసి నాలుగేళ్లలో దాదాపు నాలుగు వేల మందికి పైగా రక్తం అందించేలా కృషి చేశాను.
– ముతీ ఉర్ రెహమాన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment