ప్రజలను మెప్పించేలా పనిచేయాలి
సుల్తానాబాద్/మంథని రూరల్: అధికారులు మంత్రులు సిఫారసు లేఖలతో కాకుండా ప్రజలను మెప్పించేలా పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం ఆయన సుల్తానాబాద్ మండలం పూసాల, మంథని మండలం అక్కెపల్లిలో ‘మన ఊరు- మన ప్రణాళిక’పై జరిగిన గ్రామ సభలో మాట్లాడారు.
అధికారులు ప్రజలకు సేవకులనే విషయాన్ని మరవరాదన్నారు. ప్రజల డబ్బులతోనే వేతనాలు పొందుతున్నారని, వారి కష్టాలను తొలగించేలా పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకే దక్కాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా పరిపాలన అందించాలన్నారు.
15 రోజుల్లో ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం
జిల్లాలో వర్షాలు లేక పంటల సాగు ప్రశ్నార్థకమైన తరుణంలో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు పదిహేను రోజుల్లో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. పల్లె ప్రజలు ఏడుస్తుంటే తమ పాలన వ్యర్థమే అన్నారు. అందుకే వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తామన్నారు.
అమరవీరుల త్యాగఫలమే రాష్ట్రం
ఢిల్లీలో యాదిరెడ్డి, సిద్దిపేటలో శ్రీకాంతాచారిలాంటి అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని మంత్రి అన్నారు. 1957లో సాయుధ పోరాటంలో 4వేల మందిని రజాకారులు ఊచకోత కోశారని, 1969లో 379 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, 2001నుంచి నేటి వరకు వెయ్యి మందికి పైగా విద్యార్థుల ఆత్మత్యాగాలు చేశారని, వారి ఆత్మ శాంతించాలంటే కష్టాలు, కన్నీళ్లు లేని పరిపాలన కొనసాగించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు.
దసరాకు పింఛన్లు
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పెం చుతామని ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంద ని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. దసరా పండుగకు వికలాంగులకు రూ. 1500, వృద్ధులు, వితంతువులకు రూ.1000 పింఛన్ ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం పనిచేస్తోంది బడాబాబుల కోసం కాదని, పేదల పక్షమే అన్నారు. ఇళ్లు లేనివారికి మూడున్నర లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతామన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు దసరా నుంచే కళ్యాణలక్ష్మి పేరున రూ.50వేలు ఇస్తామన్నారు. 50వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు మంత్రివర్గం తీర్మానించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఆఫ్కాబ్ చైర్మన్ చేతి ధర్మయ్య, ఆర్డీవో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.