yadi reddy
-
20 ఏళ్లుగా భిక్షాటన.. లక్షలకు పైగా విరాళం
‘ఆయన ఎవరినీ చేయి చాచి అడగడు. కమండలం చేతబట్టి గుడి వద్ద కూర్చుంటాడు. గుడికొచ్చిన భక్తులు తమకు తోచినంత వేస్తారు. ఇలా కూడబెట్టిన సొమ్మును తిరిగి దేవుళ్లూ, దేవాలయాలకే విరాళంగా ఇచ్చేస్తున్నాడు’ అని సాయిబాబా మందిరం కోశాధికారి సత్యశ్రీహరి ‘సాక్షి’తో చెప్పారు. కోట్లు ఉండీ ఏం లాభం...ఇచ్చే మనసుండాలే కానీ...ఉన్న దాంట్లోనే పదిమందికీ ఉపయోగపడే విధంగా దానధర్మాలు చేసే వారే ఉత్తమోత్తములు. అటువంటి వారి కోవలేకే వస్తారు యడ్ల యాదిరెడ్డి. ఆయన చేసేది భిక్షాటనే అయినా...సర్వసంగ పరిత్యాగి అయిన ఆయనకు వాటితో పనేముంది...ఏదో రెండు పూటలా నాలుగువేళ్లు నోట్లోకెళితే చాలు గదా...అందుకే ఈ చేత్తో పుచ్చుకున్న దానాన్ని...ఆ చేత్తో తిరిగిచ్చేస్తూ గొప్ప మనసున్న దానకర్ణుడనిపించుకుంటున్నాడు. సాక్షి, అమరావతి బ్యూరో: ఆయన దేవాలయాల్లో జరిగే అన్నదానాలకు విరాళాలిస్తాడు. లక్షలు వెచ్చించి ఆలయాల్లో దేవుళ్లకు కిరీటాలు పెట్టిస్తాడు. గోశాల నిర్మాణానికి నిధులిస్తాడు.ఇదంతా చూసి ఆయన గొప్ప శ్రీమంతుడు అనుకుంటున్నారా...కాదు.. ఆయన ఆలయం ముందు సాధువు. ఆలయాల వద్ద నలుగురూ వేసిన డబ్బు పైసా పైసా కూడబెట్టి ఆ సొమ్మును తిరిగి దేవుళ్లకే ఇచ్చేస్తుంటాడు. ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉంటున్న ఆయన పేరు యడ్ల యాదిరెడ్డి. స్వగ్రామం తెలంగాణలోని నల్గొండ జిల్లా చింతపల్లి. దేవుళ్లకు దాత అయిన యాదిరెడ్డి కథాకమామీషు ఇదీ..! పదేళ్ల వయసులోనే... తల్లిదండ్రులు లేని యాదిరెడ్డి పదేళ్ల వయసులోనే రైలెక్కి విజయవాడ వచ్చేశాడు. నలభై ఏళ్ల పాటు బెజవాడ రైల్వేస్టేషన్ కేంద్రంగా రిక్షా తొక్కాడు. ప్లాట్‌ఫారాలపై నిద్రించాడు. బ్రహ్మచారిగా ఉండిపోయిన యాదిరెడ్డి ఒంట్లో ఓపిక నశించాక అనారోగ్యం పాలై ఇరవై ఏళ్ల క్రితం భిక్షాటన బాట పట్టాడు. తొలుత విజయవాడ ముత్యాలంపాడు కోదండరామ ఆలయం వద్ద బిచ్చమెత్తేవాడు. ఆ తర్వాత సమీపంలోని షిర్డీ సాయిబాబా మందిరానికి మకాం మార్చాడు. తనకు తిండి, బట్ట కూడా ఆలయం వారే సమకూర్చుతుండటంతో భక్తులిచ్చిన సొమ్మంతా బ్యాంకులో దాచుకునేవాడు. కొన్నాళ్లకు అనారోగ్యం పాలై బతకడం కష్టమని వైద్యులు చెప్పగా, బతికి బట్టకడితే తాను రోజూ యాచన చేసే సాయిబాబా గుడికి రూ.లక్ష ఇస్తానని మొక్కుకున్నాడు. ప్రాణాపాయం తప్పడంతో తాను దాచుకున్న సొమ్ము ఆలయం నిర్వాహకులకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. బిచ్చమెత్తుకునే యాదిరెడ్డి.. ఆలయానికి రూ.లక్ష ఇస్తానంటే వారు నమ్మలేదు. అన్నట్టుగానే రూ.లక్ష ఇవ్వడంతో వారంతా అవాక్కయ్యారు. ఆ సొమ్ముతో ఆలయ ప్రాÆగణంలో దత్తాత్రేయ విగ్రహం ఏర్పాటు చేశారు. దత్తాత్రేయుడి తొడుగులకు రూ.20 వేలు, బాబా ఆలయంలో అన్నదానానికి మరో రూ.20 సమకూర్చాడు. సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమికి లక్షా ఎనిమిది వేల కొబ్బరికాయలతో అభిషేకం నిర్వహించే సందర్భంగా యాదిరెడ్డి ఒక్కో కొబ్బరికాయకు రూపాయి చొప్పున రూ.లక్షా 8 వేలను ఇచ్చాడు. ఈ ఆలయానికి సమీపంలోనే గోశాల నిర్మాణానికి మరో రూ.3 లక్షలు విరాళమిచ్చాడు. ఆ గోశాలకు దాతగా యాదిరెడ్డి పేరు పెట్టారు. కోదండ ఆలయ నిర్వాహకుల కోరిక మేరకు రూ.లక్షన్నర వెచ్చించి సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతులకు వెండి కిరీటాలు చేయించాడు. తనకు కనకదుర్గమ్మే బెజవాడలో భిక్ష పెట్టిందన్న భావనతో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.లక్షా 116లు విరాళంగా ఇచ్చాడు. ఇలా యాదిరెడ్డి ఇప్పటివరకు సుమారు రూ.8 లక్షలకు పైగా దేవుళ్లు, దేవాలయాలకు విరాళంగా సమకూర్చాడు. నాద్వారా భగవంతునికిస్తున్నారు.. భక్తులు భగవంతునికి నా ద్వారా డబ్బులిస్తున్నారన్నది నా భావన. అదంతా భక్తుల గొప్పదనం. నాకు తిండీ, బట్ట అన్నీ ఆలయ నిర్వాహకులు, భక్తులు సమకూరుస్తున్నారు. నాకింకేమి కావాలి? నాకు భిక్షగా వచ్చేదంతా తిరిగి భగవంతునికే ఇచ్చేస్తున్నా. నేను మరణించే ముందు నా దగ్గరున్నదంతా దేవుడికే ఇచ్చేస్తా. –యడ్ల యాదిరెడ్డి, యాచకుడు. -
ఏపీ ఫిలిమ్ చాంబర్ నిర్ణయాలు మార్చుకోవాలి..!
ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ చాంబర్‌ను తెలుగు ఫిలిమ్ చాంబర్‌గా మార్చాలన్న ఆలోచనను, ఫిలిమ్ చాంబర్‌కు సంబంధించిన సర్వసభ్య సమావేశాలను విజయవాడ, వైజాగుల్లో పెట్టాలన్న నిర్ణయాలను వెంటనే మార్చుకోవాలని తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈ విషయమై 40 మంది నిర్మాతల సంతకాలతో కూడిన ఓ మెమరాండంను ఏపీ ఫిలిమ్ చాంబర్లో సమర్పించింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి మాట్లాడుతూ -‘‘మోసపూరితంగా ఏపీ ఫిలిమ్ చాంబర్ పేరుని తెలుగు ఫిలిమ్ చాంబర్‌గా మార్చడానికి కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తున్నారు. గతంలో మేం అడ్డుకున్నాం. మళ్లీ అటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలాగే సర్వసభ్య సమావేశాలను వైజాగ్, విజయవాడల్లో పెట్టాలనుకోవడం నిబంధనల ప్రకారం చెల్లవు. కాబట్టి విభేదాలకు వెళ్లకండి. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే మా పోరాటం సమాజంలో ఉన్న అన్ని సంఘాలకు విస్తరిస్తే మీరే నష్టపోతారు. కాబట్టి చాంబర్ పెద్దలు సత్వరమే స్పందించి తగు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. -
ప్రజలను మెప్పించేలా పనిచేయాలి
సుల్తానాబాద్/మంథని రూరల్: అధికారులు మంత్రులు సిఫారసు లేఖలతో కాకుండా ప్రజలను మెప్పించేలా పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం ఆయన సుల్తానాబాద్ మండలం పూసాల, మంథని మండలం అక్కెపల్లిలో ‘మన ఊరు- మన ప్రణాళిక’పై జరిగిన గ్రామ సభలో మాట్లాడారు. అధికారులు ప్రజలకు సేవకులనే విషయాన్ని మరవరాదన్నారు. ప్రజల డబ్బులతోనే వేతనాలు పొందుతున్నారని, వారి కష్టాలను తొలగించేలా పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకే దక్కాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా పరిపాలన అందించాలన్నారు. 15 రోజుల్లో ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం జిల్లాలో వర్షాలు లేక పంటల సాగు ప్రశ్నార్థకమైన తరుణంలో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు పదిహేను రోజుల్లో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. పల్లె ప్రజలు ఏడుస్తుంటే తమ పాలన వ్యర్థమే అన్నారు. అందుకే వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తామన్నారు. అమరవీరుల త్యాగఫలమే రాష్ట్రం ఢిల్లీలో యాదిరెడ్డి, సిద్దిపేటలో శ్రీకాంతాచారిలాంటి అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని మంత్రి అన్నారు. 1957లో సాయుధ పోరాటంలో 4వేల మందిని రజాకారులు ఊచకోత కోశారని, 1969లో 379 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, 2001నుంచి నేటి వరకు వెయ్యి మందికి పైగా విద్యార్థుల ఆత్మత్యాగాలు చేశారని, వారి ఆత్మ శాంతించాలంటే కష్టాలు, కన్నీళ్లు లేని పరిపాలన కొనసాగించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. దసరాకు పింఛన్లు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పెం చుతామని ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంద ని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. దసరా పండుగకు వికలాంగులకు రూ. 1500, వృద్ధులు, వితంతువులకు రూ.1000 పింఛన్ ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం పనిచేస్తోంది బడాబాబుల కోసం కాదని, పేదల పక్షమే అన్నారు. ఇళ్లు లేనివారికి మూడున్నర లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు దసరా నుంచే కళ్యాణలక్ష్మి పేరున రూ.50వేలు ఇస్తామన్నారు. 50వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు మంత్రివర్గం తీర్మానించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఆఫ్కాబ్ చైర్మన్ చేతి ధర్మయ్య, ఆర్డీవో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.