ఏపీ ఫిలిమ్ చాంబర్ నిర్ణయాలు మార్చుకోవాలి..!
ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ చాంబర్‌ను తెలుగు ఫిలిమ్ చాంబర్‌గా మార్చాలన్న ఆలోచనను, ఫిలిమ్ చాంబర్‌కు సంబంధించిన సర్వసభ్య సమావేశాలను విజయవాడ, వైజాగుల్లో పెట్టాలన్న నిర్ణయాలను వెంటనే మార్చుకోవాలని తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈ విషయమై 40 మంది నిర్మాతల సంతకాలతో కూడిన ఓ మెమరాండంను ఏపీ ఫిలిమ్ చాంబర్‌లో సమర్పించింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి మాట్లాడుతూ -‘‘మోసపూరితంగా ఏపీ ఫిలిమ్ చాంబర్ పేరుని తెలుగు ఫిలిమ్ చాంబర్‌గా మార్చడానికి కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తున్నారు.
గతంలో మేం అడ్డుకున్నాం. మళ్లీ అటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలాగే సర్వసభ్య సమావేశాలను వైజాగ్, విజయవాడల్లో పెట్టాలనుకోవడం నిబంధనల ప్రకారం చెల్లవు. కాబట్టి విభేదాలకు వెళ్లకండి. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే మా పోరాటం సమాజంలో ఉన్న అన్ని సంఘాలకు విస్తరిస్తే మీరే నష్టపోతారు. కాబట్టి చాంబర్ పెద్దలు సత్వరమే స్పందించి తగు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు.