రవాణా వ్యవస్థకు కొత్త మెరుగులు
మంత్రి మహేందర్‌రెడ్డి
మంచాల:రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుట్లలో విలేకర్లతో మాట్లాడుతూ రవాణా వ్యవస్థలో నూతన పద్ధతులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తామన్నారు. తెలంగాణలో 1300 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. రూ.150 కోట్లతో 500 బస్సులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి బస్టాండ్‌లో తాగు నీటి వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలపారు. హైదరాబాద్ నుండి తె లంగాణలోఅన్ని జిల్లాలకు ప్రత్యేకంగా ఏసీ బస్సులను ఏర్పాటు చే స్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేస్తామని తెలిపారు.
కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని వివరించారు. విద్యరంగం అభివృద్ధికి రూ. 50కోట్లతో రాష్ట్రంలో 142 పాఠశాలల భవనాలు నిర్మిస్తామని తెలిపారు. గ్రామాల్లో చెరువుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కృష్ణా జలాలను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు భూపతి గళ్ల మహిపాల్, ఎంపీపీ జయమ్మ, వైస్ ఎంపీపీ దన్నె భాషయ్య, మంచాల సహాకార సంఘం చైర్మన్ సికిందర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు,ఎంపీటీసీ సభ్యులు,మండల కోఆ ప్షన్ సభ్యుడు సలాం, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవే అభివృద్ధి కార్యక్రమాలు....
మంత్రి మహేందర్‌రెడ్డి శనివారం వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంచాలలో రూ.7.4 లక్షలతో నిర్మించిన బాలుర పాఠశాల భవ నాలు, దాద్‌పల్లిలో రూ.4.20 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే మంచాలలో రూ.11లక్షలతో చేపట్టిన బాలికల ఉన్నత పాఠశాల భవనాలు, కోటి70లక్షల రూపాయలతో రోడ్డు వెడల్పు పనులు, ఆరుట్లలో రూ.84లక్షలతో ఆరుట్ల -బండలేమూర్ రోడ్డు పనులు, రూ.7.4 లక్షలతో బాలుర పాఠశాల భవన నిర్మాణం పనులు, రూ.42లక్షలతో బాలికల ఉన్నత పాఠశాల భవనాల పనులను ఆయన ప్రారంభించారు. ఇంకా రంగాపూర్‌లో రూ.7.5 లక్షలతో గోపాల మిత్ర కార్యాలయం, రూ.5లక్షలతో అంగన్ వాడీ కేంద్రం నిర్మాణం పనులు, దాద్‌పల్లిలో రూ.7.44 లక్షలతో నీటి సరఫరా ట్యాంకు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.
అర్హత సర్వేపై ఆందోళన వద్దు
యాచారం: సంక్షేమ పథకాల అర్హత సర్వేతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులెన పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు తప్పకుండా అందుతాయని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన రూ. కోటికి పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గడ్డమల్లయ్యగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్తులో నీటి ఎద్దడి తల్లెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి వనరులపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.
ప్రతి గ్రామంలో చెరువులు నిర్మించడానికి, పాత చెరువులు, కుంటలు మరమ్మతుకు ఎన్ని రూ. కోట్ల నిధులైన ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. త్వరలో మరో 75 శాతం నగదును కూడ బ్యాంకుల్లో జమ చేస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు రూ. 3.50 లక్షల నిధులతో ఇంటిని నిర్మించడానికి సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో 500 జనాభా దాటి న గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నట్లు తెలిపారు. తాం డూరు, పరిగి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొత్త గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటవుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.