ఎమ్మెల్యే టీఆర్‌ఆర్, కొప్పుల మహేష్‌రెడ్డి
పరిగి: పరిగి నియోజకవర్గం గత కొంతకాలంగా పొలిటికల్ వార్‌కు వేదికవుతోంది. పల్లెలో రాజకీయ వేడి రాజుకుంది. ఆకర్‌ష ఎన్నికల పేరుతో అధికార, ప్రతిపక్షాలు చేపడుతున్న చేరికల కోలాహలం సగటు మనిషికి వెగటు పుట్టిస్తోంది. ఎక్కడైనా కేవలం ఎన్నికల సమయంలోనే చేరికలు కనిపించేవి. కానీ ఇక్కడ మాత్రం నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, అధికార టీఆర్‌ఎస్ తరఫున రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొప్పుల మహేశ్‌రెడ్డి ఒకరితో ఒకరు పోటీ పడుతూ.. గ్రామాల్లో పర్యటిస్తూ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. దీంతో పరిగి ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంటోంది.
చేరిన వారే మళ్లీ మళ్లీ...
గతంలో కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ఆయా పార్టీల నాయకులు చేరికలను ప్రోత్సహించే వారు.. కానీ ఇక్కడ నెలకొన్న పోటీ కారణంగా నిత్యం ఏదో ఒక చోట ఆయా పార్టీల్లో చేరే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం ఆయా గ్రామాల్లో, మండల స్థాయిలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రమే పార్టీలు మారుస్తుండేవారు. కానీ ప్రస్తుతం ఇది కార్యకర్తలు, ఓటర్ల వరకు వచ్చింది. నాయకులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే పార్టీ రంగు పరిమితమయ్యేది. ప్రస్తుతం మాత్రం గడపగడపకూ రాజకీయ రంగు పులుముతున్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటికీ ఏదో ఓ పార్టీ రంగు రుద్దుతున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఏదో ఒక పార్టీ రంగు కనిపిస్తుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాలన్నీ పార్టీల ప్రాతిపదికన చీలిపోతున్నాయి. చాలా సందర్భాల్లో చేరిన వారే మళ్లీ మళ్లీ ఒక పార్టీని విడిచి మరో పార్టీలోకి మారుతున్నారు.
పని కావాలంటే చేరండి..
అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు మొదలుకుని స్థానిక ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీల వరకు తమ నియోజకవర్గ అధి నాయకత్వం మెప్పుకోసం చేరికలను ప్రోత్సహించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లు, ప్రజలు వారి వద్దకు వచ్చి ఏ చిన్న పని కావాలన్నా.. ముందు మా పార్టీలో చేరండి.. అప్పుడే పనులు చేస్తామని మెలిక పెడుతున్నారు. వారికి కావాల్సిన పని చేసి పెట్టడం దేవుడెరుగు కానీ... పని కావాలని వెళ్లిన మరుసటి రోజే వారి మెడలో కండువా వేసి పార్టీ రంగు పులుముతున్నారు. రోజురోజుకు సగటు మనిషి పై.. సాధారణ ఓటరుపై కూడా చేరికల కోసం ఒత్తిడి పెరుగుతోంది. గ్రామాల్లో ఉండే ప్ర తీ యువజన, కుల సంఘాలకు సైతం పార్టీ రం గు పులుముతూ తమ జెండాలకు జై కొట్టిస్తున్నారు.
సంక్షేమం, చట్టాల అమలులోనూ..
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా.. ఏదో ఒక పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సిందే. పార్టీల రంగు మరకలంటకుండా సంక్షేమ పథకాలు, కార్పొరేషన్ రుణాలు అందుతాయని కలలో కూడా ఊహించలేని పరిస్థితి నెలకొంది. చాలా వరకు రాయితీ ట్రాక్టర్ల పంపిణీ, ఇతర యంత్ర పరికరాల అందజేతలో అధికార, ప్రతిపక్షాలు ఫిఫ్టీ అనే తరహాలో తమ నాయకులు, కార్యకర్తలకు వీటిని కట్టబెట్టాయి.. తప్ప ఏ ఒక్క చోట పార్టీతో ప్రమేయం లేకుండా లబ్ధి చేకూరిన దాఖలాలు కనిపించటంలేదు. ఇక చట్టాల అమలు విషయంలోనూ ఇరు పార్టీల ఒత్తిడులు తప్పటంలేదు.. ప్రతీ కేసు విషయంలో చట్టాలను అమలు చేసే వ్యక్తులపై తీవ్ర ఇత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment