
ఒక్క జిల్లానూ ‘చే’జారనీయొద్దు
* అన్ని జెడ్పీలపై గులాబీ జెండా రెపరెపలు..
* జిల్లా, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మంత్రులకే
* జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపిక అధిష్టానానిదే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఏ ఒక్క జిల్లా పరిషత్‌ను కూడా చేజారనీయవద్దని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తన కేబినెట్ సహచరులను ఆదేశించారు. దీనికోసం కాంగ్రెస్, టీడీపీ సహా ఏ పార్టీ నుండి వలసలు వచ్చినా స్వాగతించాలని సూచించారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉన్న నల్లగొండ సహా అన్ని జిల్లా పరిషత్‌లపైనా గులాబీ జెండా రెపరెపలాడాలని ఆయన ఆదేశించారు.
ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ కేబినెట్ మంత్రులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఆయన మంత్రులకు సూచనలు చేశారు. నల్లగొండ జిల్లాపై కొంత దృష్టిని కేంద్రీకరిస్తే ఆ జిల్లా పరిషత్‌ను కూడా టీఆర్‌ఎస్ దక్కించుకుంటుందని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపిద్దామన్నారు. మిగిలిన జిల్లా పరిషత్‌లలో మెజారిటీకి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటికే చైర్మన్ల ఎన్నికకు అవసరమయ్యేంత జెడ్‌పీటీసీలు టీఆర్‌ఎస్‌లోకి వలసలు వచ్చినట్టు సీఎం తెలిపారు. జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో, జిల్లా పరిషత్‌లపై పార్టీ ఆధిపత్యం సాధించే బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకే కేసీఆర్ అప్పగించారు.
జూలై 3, 4, 5 తేదీల్లో మున్సిపాలిటీ, నగరపాలక, మండల, జిల్లా పరిషత్‌ల చైర్మన్ పదవులకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌కు స్పష్టంగా ఆధిక్యత ఉన్న ప్రాంతాలు, కొంచెం అటూఇటుగా ఉన్న స్థానాలు, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహించి గులాబీ కండువాలు కప్పితే వచ్చే స్థానాలేమిటి అనే అంశాలపై ఆయా జిల్లాల మంత్రులు సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నల్లగొండ జిల్లా సహా జిల్లా పరిషత్‌లన్నీ టీఆర్‌ఎస్‌కు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
పార్టీపట్ల నిబద్ధతే కొలమానంగా....
అయితే జిల్లా పరిషత్ చైర్మన్లకు పేర్లను అధిష్టానమే సూచిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపికలో అనేక అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, గతంలో ఇచ్చిన హామీలు వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిషత్తు చైర్మన్లను పార్టీ అధిష్టానమే సూచిస్తుందని, చైర్మన్ల ఎంపిక విషయంలో ఎలాంటి హామీలు స్థానికంగా ఇవ్వవద్దని కేసీఆర్ మంత్రులను హెచ్చరించారు. పార్టీని ఏమాత్రం నిర్ల్యక్షం చేసినా భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయన్నారు. ‘ఆటా’ సభలకు ఆహ్వానం అందిన మంత్రులు అమెరికా పర్యటన రద్దుచేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.
మండలి చైర్మన్ విషయంలో జాగరూకత
స్థానిక ఎన్నికలను, జూలై 2 నుంచి జరిగే శాసనమండలి సమావేశాలను, చైర్మన్ ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, మంత్రులంతా అందుబాటులోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. జిల్లా పరిషత్‌ల బాధ్యతలను ఆయా మంత్రులకు ఆయన అప్పగించారు. మంత్రివర్గంలో స్థానం దక్కని మహబూబ్‌నగర్ జిల్లా బాధ్యతను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి పద్మారావులకు అప్పగించారు.
నల్లగొండ జిల్లా పరిషత్ బాధ్యతను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, జిల్లామంత్రి జి.జగదీశ్ రెడ్డిలకు అప్పగించారు. మెదక్ జిల్లాకు హరీశ్‌రావు, కరీంనగర్‌కు ఈటెల రాజేందర్, కె.తారక రామారావు, వరంగల్ జిల్లా బాధ్యతను ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు అప్పగించారు. నిజామాబాద్ బాధ్యతను పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఆదిలాబాద్‌ను జోగు రామన్నకు అప్పగిస్తూనే ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులను సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అయితే ఖమ్మం జిల్లాలో పార్టీకి ఎక్కువగా స్థానాలు లేనందున అ జిల్లా బాధ్యతను ఎవరికీ అప్పగించలేదు.