local election 2014
-
నేడు మండలాధ్యక్షుల ఎన్నిక
-
నేడు మండలాధ్యక్షుల ఎన్నిక
* ఉదయం కో ఆప్షన్ సభ్యులు, మధ్యాహ్నం అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలు సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 396 మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల, ఉపాధ్యక్షుల ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. వీటితో పాటు కో ఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. తెలంగాణలో మొత్తం 443 మండలాలు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని 46 మండలాలు, వరంగల్‌లోని మంగపేట మండలానికి కోర్టు ఆదేశాల కారణంగా ఎన్నికలు జరగడం లేదు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీటిలో సభ్యులైనప్పటికీ వారికి ఓటు వేసే అధికారం ఉండదు. ఈ మండలాల్లో మెజారిటీ స్థానాలను అధికారపార్టీ టీఆర్ఎస్ గెలుచుకొనేందుకు ప్రయత్నిస్తోంది. గురువారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ మెజారిటీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం. -
ప్రజాస్వామ్యం ఖూనీ
* పురపాలక ఎన్నికల్లో టీడీపీ అరాచకం * ప్రజా సమస్యలు పక్కనపెట్టి మున్సిపాలిటీలపైనే గురి * పలువురు ప్రతినిధులతో నేరుగా మాట్లాడిన ఏపీ సీఎం * ప్రలోభాలు, బెదిరింపులు, బలవంతంగా ఓటింగ్ * టీడీపీకి మెజారిటీ ఉన్నవి 55 కాగా నెగ్గినవి 73 * 15 మున్సిపాలిటీలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ * జమ్మలమడుగు, మార్కాపురం ఎన్నికలు వాయిదా సాక్షి, హైదరాబాద్: ప్రలోభాలు... దౌర్జన్యాలు... అక్రమాలు... అన్యాయాలు... రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం వ్యవహరించిన తీరిది. సీఎం చంద్రబాబు స్వయంగా ఆయా జిల్లాల్లోని మంత్రులకు, సీనియర్ నేతలకు ఫోన్లు చేసి వ్యవహారాలను నడిపించారు. ఫిరాయించడానికి ఇష్టపడని ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రతినిధులతో నేరుగా చంద్రబాబే ఫోన్లో మాట్లాడి తనవైపునకు తిప్పుకున్నారు. ఇతర పార్టీల సభ్యులను ప్రలోభాలకు గురిచేసో, బెదిరించో బలవంతగా ఓట్లు వేయించుకొని చివరకు మెజారిటీ లేని పలు మున్సిపాలిటీలను సైతం టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 మున్సిపాల్టీలకు గాను 90 స్థానాల్లో చైర్మన్ ఎన్నికలు జరగ్గా కడప జిల్లా జమ్మలమడుగు, ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాల్టీల్లో వాయిదా పడ్డాయి. ఎన్నికలు పూర్తయిన వాటిలో 73 స్థానాలు టీడీపీ, ఆ పార్టీ మద్దతుతో ఒకటి సీపీఐ, 15 వైఎస్సార్ కాంగ్రెస్, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అధికార పక్షం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ తట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ 15 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఏడు కార్పొరేషన్లలో అయిదు టీడీపీ కైవసం కాగా రెండింటిని వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకుంది. అధికార పార్టీ అరాచకాలు సాగాయి ఇలా.... వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీకి చెరి 11 స్థానాలు ఉన్నాయి. వైసీపీ కొంత స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ ఆ పార్టీ గెలుస్తుందన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు చివరి నిమిషంలో గందరగోళాన్ని సృష్టించి ఎన్నిక వాయిదా వేయించారు. ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రణరంగంగా మారింది. మార్కాపురంలో వైస్ చైర్మన్ అభ్యర్థిపై వివాదం నెలకొనడంతో టిడిపి సభ్యులు హాజరు కాక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. చీరాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం.. చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించింది. అయితే టీడీపీలోకి ఆమంచి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పోతుల సురేష్‌వర్గం వారితో ఘర్షణకు దిగడంతో ఎస్సై రామిరెడ్డి గాయపడ్డారు. విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా బొబ్బిలి మున్సిపాల్టీని టీడీపీ దక్కించుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను,స్వతంత్రులను టీడీపీ ప్రలోభాలకు గురిచేసి తమ క్యాంపునకు తరలించింది. ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కాగా ఇక్కడ టీడీపీకి అధిక స్థానాలు లభించినా చైర్మన్ కేటగిరీ అభ్యర్థి ఎవరూ గెలవలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మాత్రం నలుగురు ఎస్సీ మహిళలు గెలుపొందారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యురాలు కొప్ప న పార్వతిని తమవైపు తిప్పుకొని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. టీడీపీ గెలిచిన మున్సిపాల్టీలు పలాస, ఆమదాలవలస, పాలకొండ, విజయనగరం, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, యలమంచిలి, నర్సీపట్నం, అమలాపురం, తుని, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం, మండపేట, పిఠాపురం, ఏలేశ్వరం నగర పంచాయతీ(న.పం), గొల్లప్రోలు (న.పం), ముమ్మిడివరం (న.పం), భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం (న.పం), పెడన, మచిలీపట్నం, నందిగామ, ఉయ్యూరు, తిరువూరు (న.పం), తెనాలి, నరసరావుపేట, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, చీరాల, కనిగిరి (న.పం), చీమకుర్తి (న.పం), అద్దంకి (న.పం), కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట(న.పం), గూడూరు, వెంకటగిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, ధర్మవరం, కదిరి, హిందూపురం, పామిడి, గుత్తి, పుట్టపర్తి, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్. వైఎస్సార్సీపీ గెలిచిన మున్సిపాల్టీలు ఇచ్ఛాపురం, జగ్గయ్యపేట, గుడివాడ, నూజివీడు, తాడేపల్లి, గిద్దలూరు (న.పం), పుంగనూరు, పలమనేరు, నగరి, పులివెందుల, ఎర్రగుంట్ల, రాయచోటి, ఆదోని, నందికొట్కూరు, ఆళ్లగడ్డ (న.పం). సీపీఐ గెలిచిన మున్సిపాల్టీ: గుంటూరు జిల్లా వినుకొండ కాంగ్రెస్ గెలిచిన మున్సిపాల్టీ: నెల్లూరు జిల్లా ఆత్మకూరు (న.పం) (టీడీపీ మద్దతుతో) ప్రకాశం జిల్లా మార్కాపురం, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది కర్నూలు జిల్లా ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలు ఏ పార్టీకి దక్కుతాయో ఇంకా తేలలేదు. మున్సిపల్ కార్పొరేషన్లు... టీడీపీ గెలిచినవి: రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు వైఎస్సార్సీపీ గెలిచినవి: కడప, నెల్లూరు -
మెజారిటీ స్థానాలపై టీఆర్ఎస్ కన్ను
-
జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ!
* టీడీపీ నేతలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ * రంగారెడ్డి టీడీపీకిస్తే కాంగ్రెస్‌కు రెండు జిల్లాల్లో మద్దతు * టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను ఒప్పించే బాధ్యత ఎర్రబెల్లికి! సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈనెల 5న జరగనున్న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్‌తో స్నేహం చేయాలని దాదాపుగా నిర్ణయించారు. పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కీలకంగా మారిన మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయా జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఈ మూడు జిల్లాల్లో టీడీపీ కీలకమైన దృష్ట్యా రంగారెడ్డి జిల్లా పరిషత్‌లో తమకు మద్దతిస్త్తే, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు ప్రాథమికంగా తేల్చారు. ఇదే తరహాలో వైస్ చైర్మన్లను కూడా కాంగ్రెస్, టీడీపీ పంచుకోవచ్చని భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ పొన్నాలకు జిల్లా జెడ్పీ పీఠం ప్రతిష్టాత్మకమైన దృష్ట్యా రంగారెడ్డి జిల్లాలో టీడీపీకి మద్దతిచ్చేలా ఒప్పించే బాధ్యతను ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించినట్లు సమాచారం. -
మెజారిటీ స్థానాలపై టీఆర్ఎస్ కన్ను
* నేడు 53 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల అధ్యక్ష పీఠాలకు ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 53 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల చైర్పర్సన్లు/మేయర్ల పదవులకు గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలను దక్కించుకునే దిశగా అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. పూర్తి స్థాయి మెజారిటీ లేనిచోట ప్రతిపక్షాల సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్న పరిస్థితికి అనుగుణంగా మలుచుకోవడానికి చూస్తోంది. మొత్తంగా ఉత్తర తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని మున్సిపాలిటీలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు రామగుండం స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ యత్నిస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇదివరకే ఎంపిక చేసుకున్న మున్సిపాలిటీల్లో ఓటు వేయడానికి అర్హులు. ‘ఆకర్ష్’ మంత్రమే.. మున్సిపాలిటీల్లో తమకు మెజారిటీ కోసం అవసరమైన సంఖ్యాబలం లేని చోట టీఆర్ఎస్ ‘ఆకర్ష్’ మంత్రం ప్రయోగిస్తోంది. చిన్న పార్టీలు, స్వతంత్ర సభ్యులను తిప్పుకోవడంతో పాటు, కాంగ్రెస్ నుంచి కూడా కౌన్సిలర్లను చేర్చుకుంటోంది. వరంగల్ జిల్లాలోని మొత్తం ఐదు మున్సిపాలిటీలను.. కరీంనగర్ జిల్లాలో ఒక్క జగిత్యాల మినహా అన్ని(8) మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. ఖమ్మం జిల్లాలోని నాలుగింటిలో ఒక చోట వైఎస్సార్సీపీ, కొత్తగూడెంను (కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్కు మద్దతిస్తున్నట్లు సమాచారం) టీఆర్ఎస్ దక్కించుకోవచ్చని అంటున్నారు. మిగతా రెండింటిని టీడీపీ కైవసం చేసుకోనుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క భైంసా ( దీనిని ఎంఐఎం కైవసం చేసుకోనుంది) మినహా మిగిలినవి టీఆర్ఎస్ వశం కానున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మూడింటిలో రెండు టీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్‌కు, రంగారెడ్డి జిల్లాలో రెండు టీఆర్ఎస్కు (అనూహ్యంగా వికారాబాద్ వస్తే), ఒకటి కాంగ్రెస్, రెండు టీడీపీకి, నల్లగొండలోని ఏడు మున్సిపాలిటీల్లో ఐదింటిలో కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్, ఒకటి బీజేపీ దక్కించుకునే అవకాశాలున్నాయి. మెదక్‌లో ఆరు మున్సిపాలిటీలకుగాను కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరిమూడు స్థానాలు దక్కించుకుంటాయని అంచనా. ఇక మహబూబ్‌నగర్‌లో ఎనిమిది మున్సిపాలిటీలు ఉంటే.. నాలుగు కాంగ్రెస్, రెండు టీఆర్ఎస్, ఒక టి టీడీపీ, బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంది. కాగా రామగుండం కార్పొరేషన్లో టీఆర్ఎస్కు బలం లేకపోవడంతో.. దానిని ఎంఐఎంకు అప్పగించి, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఆ పార్టీ మద్దతు తీసుకునే అవకాశముంది. -
వైఎస్సార్సీపీకి విప్ అధికారం
-
వైఎస్సార్సీపీకి విప్ అధికారం
* రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్ * గుర్తింపు పొందిన రాష్ట్రస్థాయి పార్టీల జాబితాలో వైఎస్సార్ సీపీ * జూలై 3 నుంచి ‘స్థానిక’ పరోక్ష ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల మేయర్, చైర్పర్సన్, అధ్యక్షుడు తదితర పదవులకు జరగనున్న పరోక్ష ఎన్నికల సందర్భంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులకు విప్ జారీ చేసే అధికారం ఆ పార్టీకి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 3వ తేదీ నుంచి మూడురోజుల పాటు స్థానిక సంస్థల సారథుల ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ జారీ చేసిన నోటిఫికేషన్ (నంబరు 1527/ఎస్ఈసీ-ఎల్/2014, తేదీ: 27.06.2014)లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను గుర్తింపు పొందిన రాష్ట్ర స్థాయి పార్టీగా పరిగణిస్తూ.. ఆ మేరకు నోటిఫికేషన్ అనుబంధ జాబితాలో పార్టీ పేరును పొందుపరిచారు. మొత్తం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 16 ఉండగా అందులో ఆరు జాతీయ, రెండు రాష్ట్ర స్థాయి, మరో ఆరు ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర స్థాయి పార్టీలుగా ఈ నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని కొంతకాలం కిందటే పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమిషన్, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం రెండూ ఆదేశాలు జారీ చేశారుు. ఆ ప్రకారమే గుర్తింపు పొందిన రెండు రాష్ట్ర రాజకీయ పార్టీల్లో వైఎస్సార్సీపీని చేర్చుతూ నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లా నేతల్లో ఒకరికి విప్ అధికారం ఆయా జిల్లాల్లో, మండలాల్లో, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఎవరికి ఓటు వేయూలో పేర్కొంటూ విప్‌ను జారీ చేసే అధికారాన్ని ఆయా జిల్లా నేతల్లో ఒకరికి వైఎస్సార్సీపీ ఇవ్వనుంది. -
ఒక్క జిల్లానూ ‘చే’జారనీయొద్దు
* అన్ని జెడ్పీలపై గులాబీ జెండా రెపరెపలు.. * జిల్లా, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మంత్రులకే * జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపిక అధిష్టానానిదే: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఏ ఒక్క జిల్లా పరిషత్‌ను కూడా చేజారనీయవద్దని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తన కేబినెట్ సహచరులను ఆదేశించారు. దీనికోసం కాంగ్రెస్, టీడీపీ సహా ఏ పార్టీ నుండి వలసలు వచ్చినా స్వాగతించాలని సూచించారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉన్న నల్లగొండ సహా అన్ని జిల్లా పరిషత్లపైనా గులాబీ జెండా రెపరెపలాడాలని ఆయన ఆదేశించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ కేబినెట్ మంత్రులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఆయన మంత్రులకు సూచనలు చేశారు. నల్లగొండ జిల్లాపై కొంత దృష్టిని కేంద్రీకరిస్తే ఆ జిల్లా పరిషత్‌ను కూడా టీఆర్ఎస్ దక్కించుకుంటుందని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపిద్దామన్నారు. మిగిలిన జిల్లా పరిషత్‌లలో మెజారిటీకి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటికే చైర్మన్ల ఎన్నికకు అవసరమయ్యేంత జెడ్పీటీసీలు టీఆర్ఎస్లోకి వలసలు వచ్చినట్టు సీఎం తెలిపారు. జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో, జిల్లా పరిషత్‌లపై పార్టీ ఆధిపత్యం సాధించే బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకే కేసీఆర్ అప్పగించారు. జూలై 3, 4, 5 తేదీల్లో మున్సిపాలిటీ, నగరపాలక, మండల, జిల్లా పరిషత్‌ల చైర్మన్ పదవులకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్కు స్పష్టంగా ఆధిక్యత ఉన్న ప్రాంతాలు, కొంచెం అటూఇటుగా ఉన్న స్థానాలు, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహించి గులాబీ కండువాలు కప్పితే వచ్చే స్థానాలేమిటి అనే అంశాలపై ఆయా జిల్లాల మంత్రులు సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నల్లగొండ జిల్లా సహా జిల్లా పరిషత్‌లన్నీ టీఆర్ఎస్కు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీపట్ల నిబద్ధతే కొలమానంగా.... అయితే జిల్లా పరిషత్ చైర్మన్లకు పేర్లను అధిష్టానమే సూచిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపికలో అనేక అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, గతంలో ఇచ్చిన హామీలు వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిషత్తు చైర్మన్లను పార్టీ అధిష్టానమే సూచిస్తుందని, చైర్మన్ల ఎంపిక విషయంలో ఎలాంటి హామీలు స్థానికంగా ఇవ్వవద్దని కేసీఆర్ మంత్రులను హెచ్చరించారు. పార్టీని ఏమాత్రం నిర్ల్యక్షం చేసినా భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయన్నారు. ‘ఆటా’ సభలకు ఆహ్వానం అందిన మంత్రులు అమెరికా పర్యటన రద్దుచేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మండలి చైర్మన్ విషయంలో జాగరూకత స్థానిక ఎన్నికలను, జూలై 2 నుంచి జరిగే శాసనమండలి సమావేశాలను, చైర్మన్ ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, మంత్రులంతా అందుబాటులోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. జిల్లా పరిషత్‌ల బాధ్యతలను ఆయా మంత్రులకు ఆయన అప్పగించారు. మంత్రివర్గంలో స్థానం దక్కని మహబూబ్‌నగర్ జిల్లా బాధ్యతను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి పద్మారావులకు అప్పగించారు. నల్లగొండ జిల్లా పరిషత్ బాధ్యతను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, జిల్లామంత్రి జి.జగదీశ్ రెడ్డిలకు అప్పగించారు. మెదక్ జిల్లాకు హరీశ్‌రావు, కరీంనగర్‌కు ఈటెల రాజేందర్, కె.తారక రామారావు, వరంగల్ జిల్లా బాధ్యతను ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు అప్పగించారు. నిజామాబాద్ బాధ్యతను పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఆదిలాబాద్‌ను జోగు రామన్నకు అప్పగిస్తూనే ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులను సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అయితే ఖమ్మం జిల్లాలో పార్టీకి ఎక్కువగా స్థానాలు లేనందున అ జిల్లా బాధ్యతను ఎవరికీ అప్పగించలేదు. -
అన్ని స్థానాల్లో పోటీ: పొన్నాల
హైదరాబాద్: మెదక్ జిల్లాలో అన్ని మండల పరిషత్తులు, మున్సిపాలిటీలకు పోటీ చేయాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం హైదరాబాద్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నందునా అక్కడ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, అందుకే కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ ప్రలోభపెట్టే అవకాశం ఉందని, విప్ జారీ చేయాలని, దిక్కరించిన వారిపై అన్హత వేటు వేయాలని వివరించారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డి, కిష్టారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, సురేష్‌షెట్కర్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నేతలతో భేటీ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో గజ్వేల్ కాంగ్రెస్ నాయకులతోనూ పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. నర్సారెడ్డి పార్టీని వీడినా కేడర్ పటిష్టంగా ఉందని, అయితే వారికి ధైర్యం కల్పించాల్సిన అవసనం ఉందని నాయకులు పొన్నాలను కోరారు. ఇందుకోసం గజ్వేల్ కార్యకర్తల సభ నిర్వహించాలని పేర్కొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తరువాత అక్కడ సభ నిర్వహిద్దామని ఈ సందర్భంగా పొన్నాల వారితో పేర్కొన్నారు.