* పురపాలక ఎన్నికల్లో టీడీపీ అరాచకం
* ప్రజా సమస్యలు పక్కనపెట్టి మున్సిపాలిటీలపైనే గురి
* పలువురు ప్రతినిధులతో నేరుగా మాట్లాడిన ఏపీ సీఎం
* ప్రలోభాలు, బెదిరింపులు, బలవంతంగా ఓటింగ్
* టీడీపీకి మెజారిటీ ఉన్నవి 55 కాగా నెగ్గినవి 73
* 15 మున్సిపాలిటీలు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ
* జమ్మలమడుగు, మార్కాపురం ఎన్నికలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రలోభాలు... దౌర్జన్యాలు... అక్రమాలు... అన్యాయాలు... రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం వ్యవహరించిన తీరిది. సీఎం చంద్రబాబు స్వయంగా ఆయా జిల్లాల్లోని మంత్రులకు, సీనియర్ నేతలకు ఫోన్లు చేసి వ్యవహారాలను నడిపించారు. ఫిరాయించడానికి ఇష్టపడని ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రతినిధులతో నేరుగా చంద్రబాబే ఫోన్‌లో మాట్లాడి తనవైపునకు తిప్పుకున్నారు.
ఇతర పార్టీల సభ్యులను ప్రలోభాలకు గురిచేసో, బెదిరించో బలవంతగా ఓట్లు వేయించుకొని చివరకు మెజారిటీ లేని పలు మున్సిపాలిటీలను సైతం టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 మున్సిపాల్టీలకు గాను 90 స్థానాల్లో చైర్మన్ ఎన్నికలు జరగ్గా కడప జిల్లా జమ్మలమడుగు, ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాల్టీల్లో వాయిదా పడ్డాయి. ఎన్నికలు పూర్తయిన వాటిలో 73 స్థానాలు టీడీపీ, ఆ పార్టీ మద్దతుతో ఒకటి సీపీఐ, 15 వైఎస్సార్ కాంగ్రెస్, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అధికార పక్షం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ తట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ 15 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఏడు కార్పొరేషన్లలో అయిదు టీడీపీ కైవసం కాగా రెండింటిని వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకుంది.
అధికార పార్టీ అరాచకాలు సాగాయి ఇలా....
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీకి చెరి 11 స్థానాలు ఉన్నాయి. వైసీపీ కొంత స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ ఆ పార్టీ గెలుస్తుందన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు చివరి నిమిషంలో గందరగోళాన్ని సృష్టించి ఎన్నిక వాయిదా వేయించారు. ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రణరంగంగా మారింది. మార్కాపురంలో వైస్ చైర్మన్ అభ్యర్థిపై వివాదం నెలకొనడంతో టిడిపి సభ్యులు హాజరు కాక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
చీరాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం.. చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించింది. అయితే టీడీపీలోకి ఆమంచి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పోతుల సురేష్‌వర్గం వారితో ఘర్షణకు దిగడంతో ఎస్సై రామిరెడ్డి గాయపడ్డారు. విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా బొబ్బిలి మున్సిపాల్టీని టీడీపీ దక్కించుకుంది.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను,స్వతంత్రులను టీడీపీ ప్రలోభాలకు గురిచేసి తమ క్యాంపునకు తరలించింది. ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కాగా ఇక్కడ టీడీపీకి అధిక స్థానాలు లభించినా చైర్మన్ కేటగిరీ అభ్యర్థి ఎవరూ గెలవలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మాత్రం నలుగురు ఎస్సీ మహిళలు గెలుపొందారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యురాలు కొప్ప న పార్వతిని తమవైపు తిప్పుకొని చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
టీడీపీ గెలిచిన మున్సిపాల్టీలు
పలాస, ఆమదాలవలస, పాలకొండ, విజయనగరం, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, యలమంచిలి, నర్సీపట్నం, అమలాపురం, తుని, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం, మండపేట, పిఠాపురం, ఏలేశ్వరం నగర పంచాయతీ(న.పం), గొల్లప్రోలు (న.పం), ముమ్మిడివరం (న.పం), భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం (న.పం), పెడన, మచిలీపట్నం, నందిగామ, ఉయ్యూరు, తిరువూరు (న.పం), తెనాలి, నరసరావుపేట, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, చీరాల, కనిగిరి (న.పం), చీమకుర్తి (న.పం), అద్దంకి (న.పం), కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట(న.పం), గూడూరు, వెంకటగిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, ధర్మవరం, కదిరి, హిందూపురం, పామిడి, గుత్తి, పుట్టపర్తి, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్.
వైఎస్సార్‌సీపీ గెలిచిన మున్సిపాల్టీలు
ఇచ్ఛాపురం, జగ్గయ్యపేట, గుడివాడ, నూజివీడు, తాడేపల్లి, గిద్దలూరు (న.పం), పుంగనూరు, పలమనేరు, నగరి, పులివెందుల, ఎర్రగుంట్ల, రాయచోటి, ఆదోని, నందికొట్కూరు, ఆళ్లగడ్డ (న.పం).
సీపీఐ గెలిచిన మున్సిపాల్టీ: గుంటూరు జిల్లా వినుకొండ
కాంగ్రెస్ గెలిచిన మున్సిపాల్టీ: నెల్లూరు జిల్లా ఆత్మకూరు (న.పం) (టీడీపీ మద్దతుతో)
ప్రకాశం జిల్లా మార్కాపురం, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది
కర్నూలు జిల్లా ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలు ఏ పార్టీకి దక్కుతాయో ఇంకా తేలలేదు.
మున్సిపల్ కార్పొరేషన్లు...
టీడీపీ గెలిచినవి: రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు
వైఎస్సార్‌సీపీ గెలిచినవి: కడప, నెల్లూరు
ప్రజాస్వామ్యం ఖూనీ
Published Fri, Jul 4 2014 1:25 AM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM
Advertisement
Advertisement