
అన్ని స్థానాల్లో పోటీ: పొన్నాల
హైదరాబాద్: మెదక్ జిల్లాలో అన్ని మండల పరిషత్తులు, మున్సిపాలిటీలకు పోటీ చేయాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం హైదరాబాద్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నందునా అక్కడ ఎన్నికలను టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, అందుకే కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ నేతలను టీఆర్‌ఎస్ ప్రలోభపెట్టే అవకాశం ఉందని, విప్ జారీ చేయాలని, దిక్కరించిన వారిపై అన్హత వేటు వేయాలని వివరించారు.
ఈ సమావేశంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డి, కిష్టారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, సురేష్‌షెట్కర్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్ నేతలతో భేటీ..
కాంగ్రెస్ పార్టీకి చెందిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో గజ్వేల్ కాంగ్రెస్ నాయకులతోనూ పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. నర్సారెడ్డి పార్టీని వీడినా కేడర్ పటిష్టంగా ఉందని, అయితే వారికి ధైర్యం కల్పించాల్సిన అవసనం ఉందని నాయకులు పొన్నాలను కోరారు. ఇందుకోసం గజ్వేల్ కార్యకర్తల సభ నిర్వహించాలని పేర్కొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తరువాత అక్కడ సభ నిర్వహిద్దామని ఈ సందర్భంగా పొన్నాల వారితో పేర్కొన్నారు.