
మెజారిటీ స్థానాలపై టీఆర్‌ఎస్ కన్ను
* నేడు 53 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల అధ్యక్ష పీఠాలకు ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 53 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు/మేయర్ల పదవులకు గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలను దక్కించుకునే దిశగా అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. పూర్తి స్థాయి మెజారిటీ లేనిచోట ప్రతిపక్షాల సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్న పరిస్థితికి అనుగుణంగా మలుచుకోవడానికి చూస్తోంది.
మొత్తంగా ఉత్తర తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని మున్సిపాలిటీలనూ టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు రామగుండం స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి టీఆర్‌ఎస్ యత్నిస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇదివరకే ఎంపిక చేసుకున్న మున్సిపాలిటీల్లో ఓటు వేయడానికి అర్హులు.
‘ఆకర్ష్’ మంత్రమే..
మున్సిపాలిటీల్లో తమకు మెజారిటీ కోసం అవసరమైన సంఖ్యాబలం లేని చోట టీఆర్‌ఎస్ ‘ఆకర్ష్’ మంత్రం ప్రయోగిస్తోంది. చిన్న పార్టీలు, స్వతంత్ర సభ్యులను తిప్పుకోవడంతో పాటు, కాంగ్రెస్ నుంచి కూడా కౌన్సిలర్లను చేర్చుకుంటోంది. వరంగల్ జిల్లాలోని మొత్తం ఐదు మున్సిపాలిటీలను.. కరీంనగర్ జిల్లాలో ఒక్క జగిత్యాల మినహా అన్ని(8) మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోనుంది. ఖమ్మం జిల్లాలోని నాలుగింటిలో ఒక చోట వైఎస్సార్‌సీపీ, కొత్తగూడెంను (కాంగ్రెస్ సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు సమాచారం) టీఆర్‌ఎస్ దక్కించుకోవచ్చని అంటున్నారు. మిగతా రెండింటిని టీడీపీ కైవసం చేసుకోనుంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క భైంసా ( దీనిని ఎంఐఎం కైవసం చేసుకోనుంది) మినహా మిగిలినవి టీఆర్‌ఎస్ వశం కానున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మూడింటిలో రెండు టీఆర్‌ఎస్, ఒకటి కాంగ్రెస్‌కు, రంగారెడ్డి జిల్లాలో రెండు టీఆర్‌ఎస్‌కు (అనూహ్యంగా వికారాబాద్ వస్తే), ఒకటి కాంగ్రెస్, రెండు టీడీపీకి, నల్లగొండలోని ఏడు మున్సిపాలిటీల్లో ఐదింటిలో కాంగ్రెస్, ఒకటి టీఆర్‌ఎస్, ఒకటి బీజేపీ దక్కించుకునే అవకాశాలున్నాయి.
మెదక్‌లో ఆరు మున్సిపాలిటీలకుగాను కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చెరిమూడు స్థానాలు దక్కించుకుంటాయని అంచనా. ఇక మహబూబ్‌నగర్‌లో ఎనిమిది మున్సిపాలిటీలు ఉంటే.. నాలుగు కాంగ్రెస్, రెండు టీఆర్‌ఎస్, ఒక టి టీడీపీ, బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంది. కాగా రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌కు బలం లేకపోవడంతో.. దానిని ఎంఐఎంకు అప్పగించి, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఆ పార్టీ మద్దతు తీసుకునే అవకాశముంది.