అధికార పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచి.. మంత్రివర్గ విస్తరణ కూడా అయిపోయింది. దీంతో నామినేటెడ్ పదవుల పందేరం మొదలవనుందని గు‘లాబీ’ శ్రేణులు ఆశిస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర సంస్థలకు పాలకవర్గాలను నియమిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో వివిధ స్థాయిల్లోని నేతలు ఎవరికి వారుగా లాబీయింగ్ ప్రారంభించారు. ఓ వైపు సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, మరో వైపు మంత్రి హరీష్‌రావు అండదండలతో పదవులు పొందేందుకు పావులు కదుపుతున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నామినేటెడ్ పదవుల భర్తీలో టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారనే దానిపైనే నేతల భవితవ్యం ఆధారపడి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులకు కూడా అవకాశమివ్వాలని కేసీఆర్ నిర్ణయిస్తే నామినేటెడ్ ఆశావహుల జాబితా చాంతాడంత ఉండే అవకాశముంది. వీరిని పక్కనపెట్టాలని భావిస్తే మాత్రం గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, మొదటి నుంచీ పార్టీలో పనిచేస్తున్న వారు, ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నుంచి వచ్చినవారు, వివిధ జేఏసీల్లో క్రియాశీలకం గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వారు రేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం సీనియర్లు, ఉద్యమంలో ఉండి మొదటి నుం చీ పనిచేస్తున్న వారిని పదవుల్లో నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం.
ఎమ్మెల్సీ పదవులను బట్టి...
జిల్లా నుంచి మంత్రి హరీష్‌రావు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇచ్చారు. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో రాములు నాయక్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భూపాల్‌రెడ్డిలు ఉన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది. ఈ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డికే తిరిగి అవకాశం కల్పించవచ్చనే ప్రచారం జరుగుతోంది.
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో జోగిపేట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ గెలుపుకోసం కృషి చేసిన మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కానీ, రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్ ప్రధానంగా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ రాని పక్షంలో రాష్ట్రస్థాయిలో ముఖ్య కార్పొరేషన్ పదవిని కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దివంగత మంత్రి కరణం రాంచందర్‌రావు కుమారుడు కరణం సోమశేఖర్ కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.
పదవుల కోసం ఎదురుచూపులు...
నామినేటెడ్ పదవుల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. సంగారెడ్డికి సంబంధించి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి త్యాగం చేసిన తనకు పార్టీ నామినేటెడ్ ఇవ్వటం ఖాయమని ఆయన భావిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే తూమకుంట నర్సారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, పొన్నాల రఘుపతిరావు, భూమిరెడ్డి, జోగిపేట నియోజకవర్గం నుంచి కిష్టయ్య, నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి భూపాల్‌రెడ్డి, పటాన్‌చెరు నుంచి గాలి అనిల్‌కుమార్ తదితరులు కార్పొరేషన్ పదవులకోసం పోటీపడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో మాజీ ఎంపీ డాకూరు మాణిక్‌రెడ్డికి ఏదో ఒక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి చిలుముల కిషన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కోసం స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతరావు రాష్ట్రస్థాయి పదవి ఆశిస్తున్నారు.
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి లేదా మరేదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కోరుతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన టీఎస్‌ఐఐసీ పదవి కూడా జిల్లాకే దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనికోసం ముగ్గురు కీలక నేతల మధ్య పోటీ నెలకొంది. సిద్దిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు సన్నిహితులు ఉన్నారు. వారు ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో కార్పొరేషన్ పదవుల కోసం పావులు కదుపుతున్నప్పటికీ మంత్రి హరీష్‌రావు ఆశీస్సులు ఉన్నవారికే పదవులు దక్కే అవకాశం ఉంది.
హరీష్‌రావు నిర్ణయమే కీలకం...
జిల్లా స్థాయి పదవులను ఆశిస్తున్నవారి చిట్టా చాంతాడంత ఉంది. అటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు, జిల్లాస్థాయి పదవుల పందేరంలో మంత్రి హరీష్‌రావు నిర్ణయం కీలకం కానుంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కాలం త్వరలో ముగియనుంది. దీంతో ఈ పదవి కోసం జిల్లాస్థాయి నేతల నడుమ తీవ్ర పోటీ ఉంది. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్, మంత్రి నియోజకవర్గమైన సిద్దిపేట ప్రాంతానికి చెందిన నేతలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిపై ప్రధానంగా కన్నేసినట్లు సమాచారం.
ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం కమిటీ, నాచగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పదవులను మెదక్, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆశిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సీడీసీ చైర్మన్ పదవుల కోసం జిల్లా, నియోజకవర్గస్థాయి నేతలు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది వరకు మంత్రి హరీష్‌రావును కలిసి పలువురు నేతలు తమ మనస్సులోని మాటను చెప్పుకున్నారు. అయితే వీరిలో ఎంత మందికి పదవులు దక్కుతాయనేది వేచి చూడాల్సి ఉంది.
నామినేటెడ్ పదవుల పందేరం..
Published Sun, Dec 28 2014 11:20 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement
Advertisement