ఏడు నెలలుగా ఎండమావే..!
- ‘నామినేటెడ్’ పోస్టుల కోసం టీఆర్‌ఎస్ నేతల ఎదురుచూపులు
- ఏడు నెలలైనా ముహూర్తం కుదరడం లేదా అంటూ అసంతృప్తి
- రేపటి టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలోనైనా చర్చిస్తారా..?
సాక్షి, హైదరాబాద్: ‘ పద్నాలుగేళ్లు ప్రత్యేక రాష్ర్టం కోసం పోరాడాం... తెలంగాణ సాధించుకున్నాం.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం.. ఒక నామినేటెడ్ పదవితోనైనా ఉద్యమ అలసటను మర్చిపోదాం అనుకున్నాం.. ఏడు నెలలుగా ఎదురుచూసినా పదవి ఎండమావిగానే మారింది... మరోవైపు పార్టీతో కానీ, తెలంగాణ ఉద్యమంతో కానీ సంబంధం లేనివారికి పదవులు దక్కాయి.. మరి నామినేటెడ్ పదవులు పొందేందుకు పార్టీ ఉద్యమకారుల్లో ఒక్కరూ లేరా..’ అంటూ గులాబీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నాయి.
పదవుల పందేరంపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టత ఇవ్వకుండా ఇవాళా, రేపు అంటూ వాయిదా వేయడం వీరిని అసహనానికి గురిచేస్తోంది. పదవుల భర్తీ వ్యవహారం పూర్తిగా సీఎం చేతిలోనే ఉండడంతో ఆయనను నేరుగా ఎలా కలవాలో తెలియక పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఆయా జిల్లాల్లో మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. సంక్రాంతి పండుగ దాకా మంచిరోజులు లేవంటూ సీఎం చెప్పడంతో అప్పటివరకు ఆగిన నాయకులు పండుగ వెళ్లి పక్షం రోజులయిందంటూ లోలోనే గుసగుసలాడుతున్నారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సేవల వినియోగం తదితర సంస్థాగత అంశాలపై ఈ నెల 3న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలోనైనా నామినేటెడ్ పదవుల భర్తీ అంశం చర్చకు రాకపోతుందా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడుగా నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పిడమర్తి రవికి మాత్రమే ఇప్పటివరకు నామినేటెడ్ పదవులు దక్కాయి. వీరిద్దరూ గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినవారే. ఇక, రాష్ట్ర సాంస్కృతిక సారథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అవకాశం దక్కించుకున్నారు. టీఎస్‌పీఎస్‌సీ పదవులు భర్తీ అయినా సభ్యురాలిగా పార్టీకి చెందిన ఒక్కరికే అవకాశం దక్కింది.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో సీఎంను మినహాయించి... 29 మందికి మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు లభించాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మరో ముగ్గురికీ మంత్రి పదవులు దక్కాయి. ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని, అధినేతను అంటిపెట్టుకుని ఉన్నవారికి ఇంకా ఎలాంటి న్యాయం జరగలేదు. తమనూ ఏదో ఒక పదవి వరిస్తుందంటూ ఆశపడుతూ వస్తున్న వారిలో రానురాను నిస్తేజం ఆవహిస్తోంది.
రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లు, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీల పాలక మండళ్లు, దేవాలయాల ధర్మకర్తల మండళ్లు భర్తీ కావాల్సి ఉంది. మహిళా కమిషన్, హుడా, కుడా, శాప్, గ్రంథాలయ సంస్థ, ఆర్టీసీ, కొత్తగా ప్రకటించిన వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్, టీఎస్‌ఐఐసీ, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వంటి ఎన్నో సంస్థల పదవులు భర్తీ చేస్తే చాలామందికి అవకాశాలు దక్కుతాయి. కానీ, పార్టీ నాయకత్వం దీనిని అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
‘ మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుంది. సీఎం కేసీఆర్ తప్పక గుర్తింపు ఇస్తారన్న నమ్మకం ఉంది. ఇప్పటికిప్పుడు 30 పదవులను భర్తీ చేస్తే చాలు. కొంత ఒత్తిడి త గ్గిపోతుంది. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నేతలు 15 మంది దాకా ఉంటారు. కనీసం వీరికి పదవులు లభించినా, మిగతా వారిలో కొంత భరోసా ఏర్పడుతుంది..’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు లోలోన ఉడికి పోతున్నా, చేసేదేమీలేక ఓపికతో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు.