మా సంగతేంది!
టీఆర్‌ఎస్ సీనియర్ నేతల ఆవేదన
ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు
గులాబీల ఆత్మీయ విందు భేటీ
హన్మకొండ : ‘అధికారంలోకి వచ్చి రెండేళ్లయ్యింది. తెలంగాణ ఉద్యమంలో వ్యవస్థాపకులుగా పనిచేసిన ముఖ్యులను పట్టించుకోవడంలేదు. నామినేటెడ్ పదవులను ఇప్పటికైనా భర్తీ చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో స్వయంగా మాట్లాడే అవకాశం మాకు రావడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలే చొరవ తీసుకోవాలి. టీఆర్‌ఎస్‌లో కీలక నేతలుగా ఉన్నా ఏ పదవులు రాని వారు ఉన్నారు. ఎవరికీ ఏ పని కావడంలేదు. అందరిలోనూ అసహనం ఉంది. ఈ పరిస్థితి మారాలి’ అని టీఆర్‌ఎస్ కీలక నేతలు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల సమన్వయం కోసం ‘ఆత్మీయ విందు సమావేశం’ సోమవారం రాత్రి వరంగల్ నగరంలోని అభిరామ్ గార్డెన్స్‌లో జరిగింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఈ విందు సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఆజ్మీరా చందులాల్‌తోపాటు కీలక నేతలు హాజరయ్యారు. ఏడాదిగా ఆత్మీయ విందు సమావేశాలు జరగకపోవడంతో పలువురు పార్టీ నేతలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలుగా ఉన్నా తమకు గుర్తింపు దక్కడం లేదని అన్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలే చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర స్థాయి పోస్టుల పరిస్థితి ఎలా ఉన్నా... జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి పోస్టుల భర్తీకి ఎమ్మెల్యేలు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ వ్యవస్థాపక నేతలు పలువురు తమ ఆవేదనను ఒకింత ఆవేశంగానే చెప్పినట్లు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమను ఖాతరు చేయడంలేదని, పనుల కోసం వస్తే పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నట్లు తెలిసింది. ఆత్మీయ విందు సమావేశంలో కొత్త, పాత నేతలు కలిసి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందులాల్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావులు పక్కపక్కనే కూర్చోవడంపై సమావేశంలో పాల్గొన్న నేతలు చర్చించుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దాస్యం వినయభాస్కర్, డీఎస్.రెడ్యానాయక్ హాజరుకాలేదు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతల సమన్వయం కోసం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల జరగాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. వచ్చే నెల ఆత్మీయ విందు సమావేశం నిర్వహిస్తానని ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కోసం ప్రతి నెల జిల్లా స్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏడాది క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2015 మే 15న చింతగట్టులోని గెస్ట్‌హౌస్‌లో ఆత్మీయ విందు సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. కడియం శ్రీహరి ఆత్మీయ విందు సమావేశం తర్వాత నెలకు మరో మంత్రి ఆజ్మీరా చందులాల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతటితో ఆత్మీయ విందు సమావేశాలు ఆగిపోయాయి.