శాసిస్తే... ఖబడ్దార్
ఒంగోలు: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రెండో రోజైన శనివారం కూడా తీవ్ర వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశం హాలులో ప్రారంభమైన ఈ సమావేశంలో బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ పలుమార్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ జడ్పీ చైర్మన్‌ను విమర్శించడంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడ్డగోలు’ అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. సభాధ్యక్షుడ్ని గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి అంటూ హితవు పలికారు.
తాను అడ్డగోలు తనంగా తీర్మానం పెట్టరాదని మాత్రమే చెప్పానని, అలా చేస్తే చట్టవిరుద్ధంగా చేశారంటూ ప్రభుత్వం రద్దుచేస్తుంది...అప్పుడు ఏం చేస్తారంటూ ఎంపీ చెబుతుండగానే జడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వంలో ఉన్నది మీరు...మంచిపనికి ..చెడ్డపనికి తేడా తెలియదా....మంచి పనిని ఫ్రభుత్వం ఎందుకు రద్దుచేస్తుంది....రాజకీయంగా మాట్లా డి జడ్పీని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికే స్టాండింగ్ కమిటీలు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా జిల్లా అభివృద్ధిని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తే జడ్పీటీసీ సభ్యులు, జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
వ్యవసాయంపై చర్చ...
అనంతరం వ్యవసాయశాఖపై చర్చకు జెడ్పీ చైర్మన్ అనుమతించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడుతూ శనగకు ప్రత్యామ్నాయంగా ఏయే పంటలు వేసుకోవాలో రైతులను చైతన్యం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని విమర్శించారు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలలో శనగలు నిల్వ ఉంచుకొని రైతాంగం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయ చర్యలపై మౌనం వహించడం సరికాదంటూ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రుణాలు తదితర అంశాలపైనా ప్రశ్నల పరంపర కొనసాగించారు.
మార్కాపురం ప్రాంతాల్లో ఎరువులు, పురుగు మందుల ధరలు ఎంఆర్‌పీ కంటే దాదాపు వంద రూపాయల తక్కువకు విక్రయిస్తున్నారని, నాసిరకంగా ఉన్నాయేమో పరిశీలించాలని సూచించారు. అద్దంకి నియోజకవర్గంలో కొన్ని సొసైటీలకు ఎరువులు ఇచ్చి, మరికొన్ని సొసైటీలకు నిధులు ఇవ్వకుండా అధికారులు వ్యవహరించడం సరికాదంటూ అద్దంకి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బల్లికురవ ఏవోపై ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లోపం ఎక్కడ జరిగిందో పరిశీలించి చర్యలు తీసుకుంటామని జేడీ మురళీకృష్ణ సమాధానమిచ్చారు.
ఫారెస్ట్ అకాడమీని దోర్నాలలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలి
సమైక్య రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ అదిలాబాద్ జిల్లాలో ఉందని, అయితే నేడు రాష్ట్రం విడిపోయిన తరువాత నల్లమల అటవీప్రాంతం దట్టంగా ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాలలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలంటూ సమావేశంలో డేవిడ్‌రాజు సూచించారు. ప్రతిపాదనను తప్పకుండా ప్రభుత్వానికి పంపుతామంటూ జడ్పీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం అధికారులు తుఫాను ప్రభావ ప్రాంతాలలో సేవలందించేందుకు అం దుబాటులో ఉండాల్సి ఉన్నందున సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు.
కైలాష్ సత్యార్థి....మలాలకు జడ్పీ అభినందనలు...
బాల కార్మికుల నిర్మూలనకు , బాలికా విద్య కోసం ఒంటరి పోరాటం చేస్తూ నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన మధ్యపదేశ్ ఇంజినీర్ కైలాష్ సత్యార్థి, పాక్ బాలిక మలాలాను అభినందించే తీర్మానాన్ని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ ప్రవేశపెట్టగా సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ ప్రతిపాదించారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకే వెంకటరెడ్డి, యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజులు మాట్లాడుతూ మధర్‌థెరెస్సా తరువాత నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన సత్యార్థి మన దేశవాసులందరికీ గర్వకారణమంటూ ప్రశంసించారు. 80 వేలమంది బాల కార్మికులకు విముక్తి కల్పించిన సత్యార్థికు అభినందనలు ప్రకటిస్తూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే అంశంపై కొండేపి శాసన సభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ తీర్మానాన్ని తాము కూడా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.