పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్‌కు కరీంనగర్ జిల్లా పరిషత్ ఎంపికైంది.
► 24న లక్నోలో ప్రదానం
► అవార్డు అందుకోనున్న చైర్‌పర్సన్ తుల ఉమ
► కస్బెకట్కూర్, గోపాల్‌రావుపల్లి పంచాయతీలకూ అవార్డులు
కరీంనగర్: పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్‌కు కరీంనగర్ జిల్లా పరిషత్ ఎంపికైంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని రాంమనోహర్ లోహియా విశ్వవిద్యాలయంలో సోమవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ అందుకోనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద చేతుల మీదుగా పురస్కారంతోపాటు నగదు రివార్డు రూ.50 లక్షలు అందుకోనున్నారు.
జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలకు కరీంనగర్ జెడ్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్బెకట్కూర్, తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లి గ్రామ పంచాయతీలు అవార్డుకు ఎంపికయ్యాయి. కస్బెకట్కూర్ గ్రామ సర్పంచ్ పొన్నం మంజుల, తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లి సర్పంచ్ ఏసురెడ్డి రాంరెడ్డి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, అవార్డు అందుకోనున్నారు.
గర్వకారణం : తుల ఉమ, జెడ్పీ చైర్‌పర్సన్
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయిలో కరీంనగర్ జిల్లా పరిషత్ ఎంపిక కావడం గర్వకారణంగా ఉంది. రికార్డుల నిర్వహణ, జిల్లా పరిషత్ పనితీరును కేంద్రం గుర్తించి ఎంపిక చేయడం శ్రమతగ్గ ప్రతిఫలం లభించినట్లైంది. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు అందించిన సహకారం వల్లే అవార్డును అందుకోగలుతున్నాను. అవార్డు స్వీకరించడం ద్వారా కరీంనగర్ జిల్లా పరిషత్ కీర్తి ప్రతిష్టలు పెరగడం ఆనందంగా ఉంది.