సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ రాజకీయం సరికొత్త సమీకరణకు తెరలేపింది. ఏ పార్టీకీ స్పష్టమైన అధిక్యత రాకపోవడంతో రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపేందుకు దారితీస్తోంది. చిరకాల ప్రత్యర్థి టీడీపీతో జతకట్టడం ద్వారా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతుండగా.. అధికార టీఆర్‌ఎస్‌కు స్నేహహస్తం అందించేందుకు టీడీపీ మొగ్గు చూపుతోంది. వేగంగా మారిపోతున్న సమీకరణలు జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
జెడ్పీలో 33 జెడ్పీటీసీలకు గాను 14 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌లో హుషారు కనిపించడంలేదు. అధిష్టానం ప్రకటించిన చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి అనూహ్యంగా ప్లేటు ఫిరాయించడంతో చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ పార్టీ సంకటస్థితిని ఎదుర్కొంటోంది. అధ్యక్ష పదవికి యాదవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఖరారు చేసిన నాయకత్వం.. క్యాంపు బాధ్యతను కూడా అప్పగించింది. ఈ క్రమంలోనే కొద్దిరోజులు శిబిరాన్ని నిర్వహించిన యాదవరెడ్డి.. ఆర్థికభారాన్ని భరించలేనని క్యాంపు ఎత్తేశారు.
ఇది కాంగ్రెస్‌లో కల్లోలానికి దారితీసింది. 12 జెడ్పీటీసీలు గెలుచుకొని జెడ్పీ కుర్చీకోసం కాచుకుకూర్చున్న టీఆర్‌ఎస్, నిర్విరామంగా తమ పార్టీ సభ్యులతో క్యాంపు నిర్వహిస్తుండగా, ఖర్చుకు భయపడి యాదవరెడ్డి శిబిరాలకు గుడ్‌బై చెప్పడం కాంగ్రెస్ నేతలను ఆత్మరక్షణలో పడేసింది. మరోవైపు క్యాంపు రాజకీయాలకు కాంగ్రెస్ రాంరాం చెప్పడమే తరువాయి.. ఆ పార్టీ సభ్యులతో గులాబీ దళం రాయబేరాలు సాగించింది. ఇందులో దాదాపుగా ఆ పార్టీ సక్సెస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను గమనించిన టీపీసీసీ.. అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ యాదవరెడ్డి నిష్క్రియాపరత్వంతో జిల్లా పరిషత్ చేజారుతుందనే అంచనాకొచ్చింది. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ సభ్యులను సంతృప్తిపరచడం.. ఇతర పార్టీల మద్దతు సమీకరించేందుకు కొంత వ్యయాన్ని సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది.
‘కారె’క్కనున్న యాదవ..
టీఆర్‌ఎస్‌లో చేరడానికి యాదవరెడ్డి రంగం సిద్ధంచేసుకుంటున్న సంకేతాలు రావడంతో అప్రమత్తమైన హైకమాండ్.. జెడ్పీ పీఠం కావాలంటే రూ.ఏడు కోట్లు సమకూర్చుకోవాలని తేల్చిచెప్పింది. డబ్బులు వెదజల్లితేగానీ పదవి దక్కదని, కానీపక్షంలో మరొకరి పేరును పరిశీలిస్తామని తెగేసి చెప్పడమేకాకుండా.. కొత్త అభ్యర్థి అన్వేషణలో పడింది. యాదవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమని దాదాపుగా నిర్ణయించుకున్న కాంగ్రెస్ పెద్దలు.. ఈ విషయంలో ఆయనపై ఒత్తిడి పెంచారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చివరి నిమిషంలో తన స్థానంలో మరొకరిని తెరమీదకు తేవడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లేఖ రాయడం.. రాత్రి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలతో విందు రాజకీయం నెరపడంతో ఆయన గులాబీ గూటికి చేరుతారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇదిలావుండగా, బుధవారం మండలి చైర్మన్ ఎన్నికల్లో ఆయన వ్యవహరించే తీరును బట్టి ఆయన పార్టీలోనే ఉంటారా? కారెక్కుతారా అనే అంశం స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జోడు పదవుల్లో ఉన్న యాదవరెడ్డి ఇంకా జెడ్పీటీసీగా ప్రమాణం చేయనందున ఎమ్మెల్సీ పదవికి ఎలాంటి ఢోకాలేదని, జెడ్పీటీసీగా ప్రమాణంచేస్తే మాత్రం 14 రోజుల్లో ఒక పదవికి రాజీనామా చేయాల్సివుంటుందని చెప్పారు.
టీఆర్‌ఎస్‌లో లొల్లి!
జెడ్పీ సారథ్య బాధ్యతలను మరోసారి తన సతీమణి సునీతకు దక్కేలా జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వ్యూహారచన చేశారు. ఫలితాలు వెలువడిందే తరువాయి.. జెడ్పీటీసీలను క్యాంపులకు తరలించారు. అయితే, ఒకే కుటుంబంలో ఇద్దరికీ పదవులు అనే అంశంపై పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా ఒకింత అసంతృప్తిగానే ఉన్నప్పటికీ, మొదట్నుంచి క్యాంపులను నిర్వహిస్తున్న మహేందర్‌ను కాదనడం భావ్యంకాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహేందర్ ఫ్యామిలీకే జెడ్పీ పీఠం కట్టబెట్టే అంశంపై ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి శిబిరం వ్యతిరేకిస్తున్నప్పటికీ, మరొక నేత లేకపోవడంతో అనివార్యంగా సునీత వైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఒక దశలో టీఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్న యాదవరెడ్డికి మద్దతు పలుకుదామని భావించినా.. ఆర్థిక వనరులను సర్దుబాటుచేసే స్థితిలో లేకపోవడంతో మిన్నకుండినట్లు పార్టీవ ర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తమ్ముళ్ల కిరికిరి!
జిల్లా పరిషత్ కైవసంలో కీలకంగా మారిన టీడీపీ (7 జెడ్పీటీసీలు) వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులను తమకుఇస్తే మద్దతు పలుకుతామని సంకేతాలిస్తునే.. ఏ నిర్ణయమైనా అధినేత చంద్రబాబుతో చర్చించిన తర్వాతే ప్రకటిస్తామని సెలవిస్తోంది. తొలుత కాంగ్రెస్‌తో జతకట్టేందుకు తమ్ముళ్లు ఆసక్తి చూపినా.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల పదవీకాలంలో మొదటి మూడేళ్లు మేం.. ఆ తర్వాత రెండేళ్లు మీరు పదవుల్లో ఉండేలా పరస్పరం అంగీకారం చేసుకుందామని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. అయితే, తొలుత మాకే కుర్చీ ఇవ్వాలని టీడీపీ మడత పేచీ పెడుతోంది.
అధికారపార్టీకి మద్దతు ఇస్తే కనీసం సొంత పనులయినా అవుతాయని నమ్మకంతో ఉన్న పచ్చ సోదరులు.. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
షి‘కారు’!
Published Wed, Jul 2 2014 12:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement