జెడ్పీ.. గులాబీ వశం | zp chairperson sunitha reddy | Sakshi
Sakshi News home page

జెడ్పీ.. గులాబీ వశం

Published Mon, Jul 14 2014 2:15 AM | Last Updated on Sat, Aug 11 2018 4:48 PM

జెడ్పీ.. గులాబీ వశం - Sakshi

జెడ్పీ.. గులాబీ వశం

  • చైర్‌పర్సన్‌గా పట్నం సునీతారెడ్డి ఎన్నిక
  • టీడీపీతో సహా 21 మంది సభ్యుల మద్దతు
  • వైస్ చైర్మన్‌గా టీడీపీ జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి
  • ఫలించిన మంత్రి మహేందర్‌రెడ్డి ‘మంత్రాంగం’
  • తుదకంటూ కొనసాగిన ఉత్కంఠ
  •  సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠంపై రెండు నెలల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. ఆదివారం జిల్లా పరిషత్‌లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన యాలాల జడ్పీటీసీ పట్నం సునీతారెడ్డి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె పేరును తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ ప్రతిపాదించగా, యాచారం జెడ్పీటీసీ రమేష్ బలపర్చారు. టీఆర్‌ఎస్ సభ్యులు 12మంది, టీడీపీ సభ్యులు ఏడుగురితోపాటు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇద్దరు సునీతారెడ్డికి మద్దతు పలికారు. మొత్తంగా 21 మంది మద్దతు ఆమెకు లభించింది.

    కుత్భుల్లాపూర్ జెడ్పీటీసీ సభ్యుడు బి.ప్రభాకర్‌రెడ్డి (టీడీపీ) జడ్పీ వైస్ చైర్మన్‌గా గెలుపొందారు. ఈయన పేరును ఘట్‌కేసర్ జెడ్పీటీసీ సంజీవరెడ్డి ప్రతిపాదించగా, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ ఐలయ్య బలపర్చారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం సొంత చేసుకునేంత ఆధిక్యం ఏ పార్టీకి లభించలేదు. 14 స్థానాలు కాంగ్రెస్, 12 స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకోగా టీడీపీ ఏడు స్థానాలను సంపాదించుకుంది. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ లేకపోవడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. రాజకీయ పరిస్థితులను టీఆర్‌ఎస్ అనుకూలంగా మలుచుకుని.. ఆదివారం నాటకీయంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంది. అధ్యక్ష ఎన్నికలో సహకరించిన టీడీపీకి ఉపాధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి జంగారెడ్డికి చైర్మన్ పదవికి పోటీపడగా, 12 మంది మద్దతు తెలిపారు.
     
    టెన్షన్.. టెన్షన్

    జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి జిల్లా పరిషత్‌లో ఉత్కంఠత నెలకొంది. వాస్తవానికి ఈనెల 6న ఎన్నిక జరగాల్సి ఉం డగా.. కోరం లేకపోవడంతో వారం పాటు ఎన్నికను వా యిదా వేశారు. ఈ సమయంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. టీడీపీ సభ్యులకు ఉపాధ్యక్ష పదవిని ఎరవేస్తూ టీఆర్‌ఎస్ నెరిపిన రాజకీయ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్‌కి సహకరించి పదవీ కాలాన్ని పంచుకోవాలని టీడీపీ ఆధినాయకత్వం నిర్ణయించి చర్చలు జరిపినప్పటికీ.. మధ్యలో నెలకొన్న అవాంతరాలతో స్నేహం చిగురించలేదు. అయితే అంతర్గతంలో టీఆర్‌ఎస్, టీడీపీ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. బయటకు పొక్కకుండా ఇరు పార్టీల నేతలు జాగ్రత్త పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన కో-ఆప్షన్ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కి టీడీపీ పూర్తి సహకారం ఇవ్వడంతో అధ్యక్ష పీఠం కూడా టీఆర్‌ఎస్‌కే దక్కనున్నట్లు స్పష్టమైంది.
     
    ఏకపక్షంగా ఎన్నిక
    కో-ఆప్షన్ సభ్యులు ఎన్నికకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. ఖాజామొయినుద్దీన్, నవాజ్ ముంతాజ్, మహ్మద్ రఫీ, మీర్ మహ్మద్ అలీ ఉన్నారు. వీరిలో ఖాజామొయినుద్దీన్, మీర్ మహ్మద్‌అలీ కోఆప్షన్ సభ్యులుగా 21 మంది మద్దతుతో గెలుపొందారు.
     
    రెండోసారి..
    పట్నం సునీతారెడ్డి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే, జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డి సతీమణి అయిన ఈమె 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. తొలిసారి జిల్లా చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా 2014 ఎన్నికల్లో యాలాల మండలం నుంచి టీఆర్‌ఎస్ తరఫున జెడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందారు. భర్త మహేందర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఆమె రెండోసారి చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించారు.  
     

    ప్రొఫైల్ 
    పేరు:    పట్నం సునీతారెడ్డి
    పుట్టిన తేదీ:     25-11-1975
    విద్యార్హత:     బీఎస్సీ మ్యాథ్స్
    సొంతూరు:     మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకూర్
    తల్లిదండ్రులు: రాజమణి, గోపాల్‌రెడ్డి
    భర్త:     మహేందర్‌రెడ్డి (రవాణశాఖ మంత్రి)
    సంతానం:     కూతురు మనీషారెడ్డి, కుమారుడు రినీష్‌రెడ్డి
    చేపట్టిన పదవులు: 2006లో తొలిసారి
    జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక, తాజాగా మరోసారి
    జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement