సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రోజురోజుకు సమీకరణలు మారిపోతున్నాయి.. జిల్లా పరిషత్ రాజకీయం తుది అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో సంఖ్యాబలం తారుమారు అవుతోంది. మూడు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుండడంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు కాంగ్రెస్ బలం పడిపోతూ టీఆర్‌ఎస్ బలం పెరుగుతోంది. జిల్లా పరిషత్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న గులాబీ దళం ప్రత్యర్థులను ఆకర్షించడంలో సక్సెస్ అవుతోంది.
చైర్మన్ కుర్చీని చేజిక్కించుకునేందుకు అవసరమైన 17 మంది జెడ్పీటీసీల మద్దతును సమీకరించేందుకు గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను విజయవ ంతంగా పూర్తి చేస్తోంది. కాంగ్రెస్ నేతల్లో అనైక్యతను అసరా చేసుకుని వ్యూహాత్మకంగా పావులు కదిపిన రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి.. ఏకంగా ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డినే తనవైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థి శిబిరాన్ని కకావికలం చేశారు. ఈ పరిణామం నుంచి తేరుకునేలోపు రాజేంద్రనగర్ జెడ్పీటీసీ సభ్యురాలు ముంగి జ్యోతికి కూడా గులాబీ కండువా కప్పేశారు.
ఈ ఇరువురి చేరికతో కాంగ్రెస్ బలం 12కు పడిపోగా, టీఆర్‌ఎస్ బలం 14కు చేరింది. లుకలుకల నేపథ్యంలో కాంగ్రెస్ గతంలో శిబిరాన్ని ఎత్తివేసింది. ఈ తరుణంలో కొంతమంది అసంతుష్టులతో రాయబేరాలు నడిపిన టీఆర్‌ఎస్ నేతలు.. ఆ మేరకు ప్యాకేజీల ద్వారా ఆ సభ్యుల మద్దతు కూడగట్టారు. అయితే, అనూహ్యంగా టీడీపీతో దోస్తీ కుదరడం వీరిని ఆత్మరక్షణలో పడేసింది.
టీఆర్‌ఎస్ తాయిలాలు అందుకున్న తర్వాత జరిగిన పరిణామాలు ఈ సభ్యులకు ఇబ్బందిగా మారాయి. కేవలం కాంగ్రెస్‌కే కాకుండా టీడీపీ సభ్యులను కూడా ఇది ఇరకాటంలో పడేసింది. ఎందుకుంటే పచ్చసోదరులు కూడా కొందరు గులాబీ దం డుకు దగ్గరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుపార్టీలు క్యాంపులపై పట్టుబిగించాయి. టీఆర్‌ఎస్ ఆకర్షణకు చిక్కకుండా.. సభ్యులను రహాస్య ప్రాంతాలకు తరలించాయి.
‘ఓటు వేయకపోతే..’!
బేరం కుదుర్చుకున్న ఓ సభ్యుడు.. సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి తీవ్రతరం కావడంతో పునరాలోచనలో పడ్డారు. గోడదూకడం కష్టం కావడంతో ప్యాకేజీ మొత్తాన్ని వెనక్కి పంపారు. అయితే ప్యాకేజీ ఇచ్చిన నేత ఈ విషయం తెలుసుకుని ‘మాట ఇచ్చినట్లు ఓటు వేయాల్సిందే.. లేని పక్షంలో..’ అంటూ తనదైన శైలిలో కుటుంబ సభ్యులకు సంకేతాలు పంపారట. దీంతో బెదిరిన కుటుంబ సభ్యులు క్యాంపులో ఉన్న తమ జెడ్పీటీసీకి ఈ విషయం చేరవేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో మాట ఇచ్చినందున.. ప్రత్యర్థికే తన మద్దతు అం టూ బహిరంగంగా సెలవిస్తున్నారు. దీంతో అవాక్కయిన కాంగ్రెస్ పార్టీ.. ఇలా ఇంకెంతమంది ప్లేటు ఫిరాయిస్తారోనని బయపడుతోంది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థి ఇప్పటికే కొంత అడ్వాన్స్‌ను సొంత పార్టీ నేతలకు కూడా ముట్ట జెప్పారు. తాజా పరిణామాలను విశ్లేషించుకున్న సదరు నాయకులు ఖర్చు విషయంలో అచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.
అలకపాన్పు!
చైర్మన్‌గిరి వ్యవహారం అత్యధిక స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్‌కే కాదు టీడీపీలోనూ కలకలం రేపుతోంది. పరస్పర అవగాహనలో భాగంగా తొలుత తెలుగుదేశం పార్టీకి జిల్లా పరిషత్‌ను వదిలేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీలో చైర్మన్ స్థానానికి ఇద్దరి పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్న వీరిరువురు.. ఖర్చుకు వెనుకాడబోమని పార్టీకి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడం మరొకరికి కోపం తెప్పించింది.
దీంతో అలకబూనిన ఆయన శిబిరం నుంచి జారుకున్నారు. మూడు రోజులుగా క్యాంపునకు రమ్మని పార్టీ నేతలు పిలుస్తున్నా.. సదరు జెడ్పీటీసీ నుంచి సానుకూల స్పందన రావ డంలేదు. దీంతో ఈ సభ్యుడు కూడా గోడదూకే అవకాశంలేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. ఇలా కాంగ్రెస్, టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు టీఆర్‌ఎస్‌ను జెడ్పీ పీఠం దరికి చేరుస్తున్నాయి. తాజా పరిణామాలను పరిశీలిస్తే ఆదివారం జరిగే ఎన్నికలో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.
గులాబీ శిబిరంవైపు మరో ఇద్దరి చూపు
Published Wed, Jul 9 2014 11:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement