సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది. పరిషత్ పగ్గాలు చేపట్టేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తుండగా, కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు టీడీపీ వ్యూహం రూపొందిస్తోంది. శనివారం జరిగే జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మల్లగుల్లాలు పడుతున్న మూడు పార్టీలు.. మేజిక్ ఫిగర్‌ను సమీకరించేందుకు రాయ‘బేరాలు’ నడుపుతున్నాయి.
అత్యధిక జెడ్పీటీసీలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ ఎన్నికను ప్రతిష్టాత్మంగా భావిస్తోంది. టీఆర్‌ఎస్ ప్రలోభాలకు గురిచేస్తున్నదని భావించిన సీఎల్‌పీ నేత జానారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. సుదీర్ఘవిరామం తర్వాత మెరుగైన ఫలితాలు సాధించినందున ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాన్ని జారవిడుచుకోరాదని భావిస్తున్నారు. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థి టీడీపీ మద్దతు కూడగట్టడం ద్వారా టీఆర్‌ఎస్‌ను నిలువరించే దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్ మాత్రం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలోని ఒక చీలికవర్గం తమకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే ధీమాతో ఉంది.
ఇప్పటికే ఒక ఎమ్మెల్యేలతో బేరం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, తాజాగా తెలంగాణలో పార్టీ కీలక నేతగా వ్యవహరిస్తున్న మరో నాయకుడు.. మంత్రి మహేందర్‌రెడ్డితో సుదీర్ఘ విందు రాజకీయం నెరపడం చూస్తే టీఆర్‌ఎస్‌కే టీడీపీ మద్దతు ఇవ్వవచ్చనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇదే నేత ఒకవైపు జానారెడ్డితో చర్చలు జరుపుతునే ఇంకోవైపు మహేందర్‌తో రాయబేరాలు సాగించడం టీడీపీలోనూ కలకలం సృష్టిస్తోంది.
నేడు నిర్ణయం
నువ్వా- నేనా అన్నట్లు పోటాపోటీ సీట్లు సాధించిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు జెడ్పీ గద్దెక్కాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి. ఏడు జెడ్పీటీసీలు గె లుచుకున్న ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీదే విజయం. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన టీడీపీ తమ నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా నేతలతో చర్చించి తుది నిర్ణయా న్ని ఖరారు చేయనున్నారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించాలని, ఆ పార్టీ జెడ్పీ వశం చేసుకోకుండా ఇతరులతో చేతులు కలపాలని ఇప్పటికే తేల్చిచెప్పారు. తద్వారా పరోక్షంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ పరిణామం టీఆర్‌ఎస్ నేతలతో లోపాయికారిగా మిలాఖ త్ అయిన జిల్లానేతలకు మింగుడు పడడంలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండే టీఆర్‌ఎస్‌తో ఘర్షణ వైఖరి కొనితెచ్చుకోవడంకన్నా, కలిసిసాగడమే మేలనే అభిప్రాయాన్ని ఈ నేతలు వినిపిస్తున్నారు.
వీరి వాదనకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో నేడు తేలనుంది. ఇదిలావుండగా, తమ పార్టీ సభ్యులపై వలవేసిన టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కూడా అదే సూత్రాన్ని పాటిస్తోంది. గులాబీ శిబిరంలో కుంపటి రాజేసేందుకు ప్యాకేజీలను ప్రకటించింది. ఒక్కో సభ్యుడికి అరకోటి ఇస్తామని ప్రకటించడం ద్వారా టీఆర్‌ఎస్‌లో చీలిక తెచ్చే దిశగా పావులు కదిపింది. ఇప్పటికే ఈ ఆఫర్లను ప్రకటించిన కాంగ్రెస్.. ఐదుగురు జెడ్పీటీసీలకు వల వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదీఎమైనా మరో 24 గంటల్లో సస్పెన్స్‌కు తెరపడే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆయా పార్టీలు అనుసరించే వైఖరిపై మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది.
మూడు ముక్కలాట!
Published Thu, Jul 3 2014 11:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement