సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ నేతలు అంతర్గత సమీక్షలు జరుపుతున్నారు. జిల్లాలో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో ఎందుకు
నష్టపోయామా అనేది వారికి ఒక పట్టాన అంతుచిక్కడం లేదు. తెలంగాణ సెంటిమెంట్ గాలి వీచినా కొత్త రాష్ట్రం ఇచ్చిన సానుభూతి తమకెందుకు దక్కలేదనేది సీనియర్ల మెదళ్లను తొలుస్తోంది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఘోర పరాభవం ఎదురవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామేనని విస్తృత ప్రచారం చేసినా ఓటర్లు విశ్వసించకుండా టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలపై సీనియర్ నేతలు మేధోమధనం చేస్తున్నారు.
జిల్లాలో కనీసం ఐదారు సీట్లన్నా గెలుస్తామని పార్టీ భావిస్తూ వచ్చింది. రాజధాని చుట్టూ విస్తరించిన జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ అంతగా ప్రభావం చూపబోదని, ఒకవేళ సెంటిమెంట్ పనిచేసినా తెలంగాణ ఇచ్చింది తామేనని ప్రచారం చేయడం తమకు అనుకూలిస్తుందని హస్తం నేతలు ఆశించారు. కానీ వారి అంచనాలు తారుమార య్యాయి. తెలంగాణ ఛాంపియన్‌గా టీఎర్‌ఎస్ పార్టీనే గుర్తించిన ఓటర్లు కాంగ్రెస్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. 14 స్థానాల్లో రెండంటే రెండే చోట్ల ఆ పార్టీని గెలిపించారు. ఆ రెండు స్థానాల్లోనూ బొటాబొటీ మెజార్టీతో బయటపడడం గమనార్హం. కచ్చితంగా గెలుస్తామని భావించిన సిట్టింగ్‌లు, తెలంగాణ సెంటిమెంట్ ఏ మాత్రం లేదని అంచనా వేసిన నగర శివారు స్థానాల్లో సైతం హస్త రేఖలు చెదిరిపోయాయి.
ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎంతగా వీచినా.. పార్టీ నిర్మాణం బలంగా ఉన్న మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, శేరిలింగంపల్లి, వికారాబాద్ స్థానాల్లోనైనా బయటపడతామనే పార్టీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. అభ్యర్థులు తమ ఓటమికి టీపీసీసీ అధ్యక్షుడినే దోషిగా చూపిస్తున్నారు. సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ తెచ్చామన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతే ముంచింది..
తమ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన కారణమని కొందరు నేతలు అంగీకరిస్తున్నారు. తెలంగాణ ఇచ్చామన్న సానుభూతిని ప్రభుత్వ వ్యతిరేకత అధిగమించినందునే తమను ఓటర్లు ఆదరించలేదని చెబుతున్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ సెంటిమెంట్ అంతగా లేదనేది విశ్లేషకుల భావన. రాష్ట్ర విభజన అంశంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిన టీడీపీ అధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌కు క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ కూడా లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ప్రాథమిక నిర్మాణం కూడా లేకపోయినా అనూహ్య ఫలితాలు సాధించింది.
పదేళ్లుగా తీవ్ర స్థాయిలో గూడుకట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు లాభించిందని పార్టీ నేతలు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడరే తమ స్టార్ క్యాంపెయినర్లని, తమకు మరే ఇతర ప్రచారకులు అవసరం లేదని గొప్పలు పోయిన అభ్యర్థులు స్థానికంగా పెల్లుబికిన వ్యతిరేకతను గుర్తించలేకపోయారు. తెలంగాణ ఇచ్చామన్న సానుకూలతతో ఎలాగైనా గెలుస్తామని అతిగా భావించడం వల్లే ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయంటున్నారు.
‘హస్త’విధీ!
Published Mon, May 19 2014 12:09 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement