సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మండల ప్రాదేశిక ఎన్నికల్లో పల్లె ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన పూర్తి మద్దతు ప్రకటించకపోవడంతో అనేక మండలాల్లో హంగ్ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 33 మండల పరిషత్‌లకు 15 చోట్ల త్రిశంకు ఫలితాలే వెలువడ్డాయి. దీంతో జిల్లా రాజకీయాలు మునుపెన్నడూలేనంత రసకందాయంలో పడ్డాయి. పరిషత్‌లలో పాగా వేసేందుకు తీవ్ర స్థాయిలో క్యాంపులు, బేరసారాలు ప్రారంభమయ్యాయి. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్యే నువ్వా-నేనా అన్నట్లు పోటీ సాగగా.. ఈ సారి అనూహ్యంగా టీఆర్‌ఎస్ పుంజుకోవడంతో ప్రాదేశిక సమీకరణలు మారిపోయాయి.
ఈ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బతినగా, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు గణనీయమైన ఫలితాలను నమోదు చేశాయి. తాండూరు, పరిగి, చేవెళ్ల, వికారాబాద్ సెగ్మెంట్లలో గులాబీ గుబాళించగా, జిల్లా తూర్పు మండలాల ను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. అదే సమయంలో శివారు మండలాలపై మరోసారి టీడీపీ పట్టు నిలుపుకుంది. బీజేపీ ఓట్ల చీలిక టీడీపీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. మండల ప్రాదేశిక ఎన్నికల్లో పలు పార్టీల అగ్రనేతలకు చుక్కెదురైంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టినూరు, మెట్టినూరులో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ రెండు చోట్లా టీఆర్‌ఎస్ విజయం సాధించింది. అలాగే మరో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ స్వగ్రామమైన కోట్‌మర్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇదిలాఉంటే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్ మండలాల్లో టీఆర్‌ఎస్ ఖాతా తెరవలేదు.
జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. కౌంటింగ్ ప్రతి రౌండ్‌లోనూ నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ప్రధాన పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడడంతో అభ్యర్థులు నరాలుతెగే ఉత్కంఠకు గురయ్యారు. పలు చోట్ల అనూహ్య ఫలితాలు నమోదు కావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలోనే వెలువడ్డ తొలి ఫలితం జిల్లా నుంచే రాగా.. అది మజ్లిస్ బోణీ కొట్టడం అబ్బురపరిచింది. మంచాల మండలంలో మరోసారి సీపీఎం తన సత్తాను చాటడం ద్వారా ఉనికిని చాటుకోగా, బీజేపీ కూడా మెరుగైన ఫలితాలను నమోదు చేసి మండలాధీశుల ఎన్నికల్లో కీలక భూమిక నిర్వహించేందుకు సిద్ధమైంది. మండల ప్రాదేశిక స్థానాల ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగడంతో జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది.
అగ్రనేతలకు తలనొప్పి
హంగ్ తీర్పు పార్టీ అగ్రనేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఊహించని ఫలితాలతో కంగుతిన్న నేతలు ఎన్నికలనంతరం సర్దుబాటులో తీరికలేకుండా గడుపుతున్నారు. ఫలితాలను తమకు అనుకూలంగా మార్చే బాధ్యతను అగ్రనేతలే తమ నెత్తికెత్తుకోవడంతో జిల్లా పరిస్థితి వారికి కష్టాలు తెచ్చిపెట్టింది. దాదాపు సగం మండల ప్రాదేశికాల్లో త్రిశంకు పరిస్థితి నెలకొనడం చిక్కులు తెచ్చిపెట్టింది. కొన్ని చోట్ల ఒకరిద్దరు సభ్యులే కీలకం కావడంతో వారిని మచ్చిక చేసుకునేందుక పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. మరికొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు గెలుపొందడంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు.
‘ప్రాదేశికం’లో త్రిశంకు ఫలితాలే!
Published Wed, May 14 2014 1:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement