ఆకర్ష్ మంత్రం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్‌ను వశం చేసుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో మైండ్‌గేమ్ ఆడుతూ ప్రత్యర్థుల శిబిరాల్లో గుబులు రేపుతున్నాయి. జెడ్పీ పీఠం దక్కాలంటే ఏ పార్టీకైనా 17 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 14, టీఆర్ ఎస్‌కు 12, టీడీపీకి ఏడుగురు జెడ్పీటీసీలున్నారు. స్పష్టమైన ఆధిక్యత లేకపోవడంతో మరొక పార్టీ మద్దతు అనివార్యంగా మారింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు టీడీపీపై ఆశలు పెట్టుకున్నాయి.
జెడ్పీ కుర్చీకి పోటీపడే స్థాయిలో టీడీపీకి సభ్యులు లేనందున.. తమకు మద్దతు ఇవ్వాలని అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌లు కోరుతున్నాయి. తగినంత బలం లేకపోవడం, ప్రత్యర్థి పార్టీలు అధిక స్థానాలు గెలుచుకోవడంతో మద్దతు విషయంలో టీడీపీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. అయితే, ఇప్పుడిప్పుడే జిల్లాలో బలీయశక్తిగా అవతరించిన టీఆర్‌ఎస్‌ను నిలువరించాలంటే చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు కూడా వెనుకాడకూడదని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా టీడీపీ మద్దతుపైనే భారం వేసింది.
టచ్‌లోకి వచ్చేశారు!
మేజిక్ ఫిగర్‌ను సాధించే క్రమంలో ఇరుపార్టీలు మైండ్‌గేమ్‌ను ఆడుతున్నాయి. సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవడంలో భాగంగా ప్రత్యర్థి పార్టీలోని సభ్యులకు గాలం వేస్తున్నాయి. తటస్థులను ఆకర్షించేందుకు వీలుగా ఆఫర్లు, నజరానాలను ప్రకటిస్తున్న పార్టీలు వారిని తమ శిబిరంలోకి రప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో తన సతీమణి సునీతా మహేందర్‌రెడ్డిని బరిలోకి దించిన ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి.. జెడ్పీ పీఠాన్ని మరోసారి దక్కించుకోవడం ద్వారా సత్తా చాటాలని తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ, కాంగ్రెస్ సభ్యులతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీలు తమతో టచ్‌లో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలనాటికి మరికొంత మంది తమ పక్షాన చేరుతారని, ఇద్దరు టీడీపీ సభ్యులు కూడా తమకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
సభ్యుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించామని, దీంతో వారు తమతో చేతులు కలిపేందుకు సంకేతాలు పంపారని గులాబీ శిబిరం చెబుతోంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో క్యాంపులను నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్.. సొంత పార్టీ సభ్యుల్లో చీలిక రాకుండా జాగ్రత్తపడుతోంది. ఇటీవల ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అసలుకే ఎసరు రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మరోవైపు అత్యధిక జెడ్పీటీసీలు గెలుచుకున్న కాంగ్రెస్.. టీఆర్‌ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. క్యాంపుల నిర్వహణలో దిట్ట అయిన మహేందర్‌రెడ్డి వ్యూహాలకు అడ్డకట్ట వేసే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ చూస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుల క్యాంపును తన కనుసన్నల్లో నిర్వహించడమేకాకుండా... టీడీపీతో సంప్రదింపుల ప్రక్రియను కూడా ఆయనే కొనసాగిస్తున్నారు.
ఒకవైపు టీడీపీ మద్దతు కూడగడుతునే మరోవైపు గులాబీ గూటి నుంచి ఒకరిద్దరు సభ్యులను తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే కొందరు సభ్యులపై ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ప్రయోగించినట్లు ప్రచారం జరుగుతోంది. గులాబీ శిబిరంలో ఉన్న లుకలుకలు తమకు కలిసివస్తాయని అంచనా వేస్తోంది. ఇదిలావుండగా, కింగ్‌మేకర్‌గా మారిన టీడీపీ.. తమ సభ్యులు గోడదూకకుండా అప్రమత్తమైంది. జెడ్పీ పీఠానికి సరిపడా బలం లేకపోవడంతో తటస్థ వైఖరిని అవలంబించాలని అధినేత చంద్రబాబు స్పష్టంచేసినా.. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందించేందుకు సిద్ధమైంది. కాగా, టీడీపీ మద్దతు మాకంటే మాకేనని టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మైండ్‌గేమ్ ఆడుతుండడం.. ఇతర పార్టీల సభ్యులు తమకు టచ్‌లో ఉన్నారని ప్రచారం చేయడం ద్వారా ప్రత్యర్థి శిబిరాల్లో గుబులు రేపుతున్నాయి.