
అనంతపురం: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి ఎక్కడ అనే చర్చ జోరుగా సాగుతోంది. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆయన మూన్నెళ్లవుతున్నా.. విధుల్లో చేరకపోవడమే ఇందుకు కారణమైంది. కూడేరు ఎంపీడీఓగా పని చేస్తున్న రమణారెడ్డి 2019 ఆగస్టు 1న డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 19న సెలవుపై వెళ్లారు. ముందుగా ఐదు రోజులు సెలవు పెట్టినా తర్వాత పొడిగించుకున్నారు. జిల్లా పరిషత్‌లో ఈ పోస్టు అత్యంత కీలకం. కార్యాలయంలో పది సెక్షన్లు ఉన్నాయి. పరిషత్ పరిధిలో జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరి జీతభత్యాలు, పెన్షన్లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, పదోన్నతులు ఇలా నిత్యం పదుల సంఖ్యలో ఫైళ్లు ఆయా సెక్షన్ల నుంచి వెళ్తుంటాయి. ప్రతి ఫైలూ సీఈఓ చూడడం సాధ్యం కాదు. సీఈఓ క్షేత్రస్థాయిలో పర్యటించి జెడ్పీ ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. పైళ్లకు సంబంధించి ఆయా సెక్షన్ల అడ్మినిస్ట్రేషన్ అధికారుల ద్వారా డిప్యూటీ సీఈఓకు వెళ్తాయి. వచ్చిన ఫైళ్లను డిప్యూటీ డీఈఓ పరిశీలించి పంపితే సీఈఓ ఆమోద ముద్ర వేస్తారు. ఉద్యోగులకు, సీఈఓకు మధ్య కీలకంగా ఉండే ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.