ప్రగతి శూన్యం | no own funds to zilla parishad | Sakshi
Sakshi News home page

ప్రగతి శూన్యం

Published Wed, Jul 23 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

no own funds to zilla parishad

ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువు జిల్లా పరిషత్. అయితే దీని పాత్ర రాజకీయాలకే పరిమితమవుతోంది. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేయాలనే ఆలోచన తప్పితే.. ఉన్నవనరులతో ఎలా నిధులు సమకూర్చాలనే అలోచన కరువైంది. ఫలితంగా అభివృద్దికి బాటలు వేయాల్సిన ఈ కార్యాలయం వెనుకబాటుకు గురవుతోంది. పాలకులు రాజకీయాలపై చూపిన శ్రద్ధ అభివృద్ధిపై చూపడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.

 స్వయం సమృద్ధి సాధించడంలో జిల్లా పరిషత్ ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లపై ఆధారపడడమే తప్ప సొంతగా ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్‌లకు ఆదర్శంగా నిలవాల్సిన జడ్పీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే సాధారణ నిధులతోనే కాలం వెళ్లదీస్తున్నారు తప్ప.. ఆదాయ వనరులపై అధికారులు, పాలకులు దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 ప్రస్తుతం జిల్లా పరిషత్‌కు ఎన్నికలు జరిగినా కోర్టు సమస్య వల్ల పాలకవర్గాలు ఏర్పడలేదు. అధికారులు సైతం తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జడ్పీకి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ సైతం దీనిపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర నిధులు కార్యాలయంలో అవసరమైన సామగ్రి కొనుగోలుకు సరిపోతున్నాయి. ఒక్కోసారి అభివృద్ది నిధులలో కోతల కారణంగా ఇబ్బందులు తప్పడంలేదు.

 జిల్లా పరిషత్ ఆవరణంలోని సమావేశ మందిరాన్ని మినీ అసెంబ్లీగా మార్చాలని గతంలో పాలక వర్గాలు తీర్మానం చేసినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఉన్న సీలింగ్‌ను తరచూ మరమ్మతులు చేయిస్తూ కాలం గడుపుతున్నారు. ఉన్న ఫ్యాన్లలో ఒకటి తిరిగితే మరొకటి తిరిగే పరిస్థితిలేదు.

 ఖమ్మం నగరంలో ఉన్న భక్తరామదాసు కళాక్షేత్రం ఆదాయం శూన్యమనే చెప్పాలి. నగరంలో ఒక్కో ఫంక్షన్ హాలుకు రోజుకు వేలల్లో రుసుము చెల్లిస్తున్నారు. అన్ని వనరులున్నా ఈ కళాక్షేత్రానికి నెలకు వేలల్లో కూడా ఆదాయం రావడంలేదు. దీని నిర్వహణ సక్రమంగా లేక అతి తక్కువ ఆదాయానికే  పరిమితం అవుతోంది.
 
ఏడాదికి కోటిపైనే ఆదాయం....
 జిల్లా పరిషత్‌కు వనరుల ద్వారా ఏడాదికి రూ.1.66 కోట్ల ఆదాయం వస్తోంది. జిల్లా పరిషత్ సముదాయంలో ఉన్న బ్యాంక్ నుంచి ఏడాదికి రూ.లక్ష, మీటింగ్ హాలుకు రూ.2 లక్షలు, కొత్తగూడెంలో షాపింగ్ కాంప్లెక్స్‌కు రూ.80 వేలు, జెడ్పీ వెనుక మామిడి తోటకు రూ.1.50 లక్షలు, రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి రూ.కోటి, ఇసుక వేలం ద్వారా రూ.50 లక్షల ఆదాయం వస్తోంది.

ఈ నిధులను వివిధ ప్రాధాన్యత రంగాలకు కేటాయిస్తారు. వాటిలో 9 శాతం మంచినీరు, 35 శాతం సాధారణ పనులు, 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 15 శాతం మహిళా సంక్షేమానికి, 16 శాతం కార్యాలయ ఖర్చులు, 4 శాతం కాంటిన్‌జెన్స్ ఖర్చు చేస్తారు.

 క్వార్టర్ల ద్వారా...
 జెడ్పీ వెనుక భాగంలో 38 క్వార్టర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.6.25 లక్షలు, కొత్తగూడెంలో ఉన్న 24 క్వార్టర్ల ద్వారా రూ.3.50 లక్షల ఆదాయం వస్తుంది. అయితే వీటి పర్యవేక్షణ సక్రమంగా లేక పోవడంతో ఈ ఆదాయంలోనూ గండిపడుతోందనే వాదనలు ఉన్నాయి. ఇక ఖమ్మం,భద్రాచలం, కొత్తగూడెంలలో జెడ్పీ గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ఆదాయం శూన్యమనే చెప్పాలి. లక్షల రూపాయల వ్య యంతో వీటిని నిర్మించారు. అయితే వచ్చే ఆదా యం నిర్వహణకు కూడా సరిపోవడం లేదు.

 నిరుపయోగంగా ఉన్న వనరులు...
 ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెంలలో స్థలా లు ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి. భద్రాచ లం, ఖమ్మంలో ఉన్న పలు స్థలాలు ఆక్రమణల కు గుైరయ్యాయి. వీటిపై అధికారులు, పాల కులు దృష్టిసారించిన దాఖలాలు లేవు. ప్రభు త్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారు లు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన  రహదాలరు పక్కన ఉన్న  ఈ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే ఏడాదికి లక్షల్లో ఆదాయం వస్తుందని పలువురు అంటున్నారు.

 భక్తరామదాసు కళాక్షేత్రం ప్రధాన వ్యాపార కూడలి మధ్యలో ఉంది. అన్ని వైపులా రహదారి సౌకర్యం ఉంది. దీని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఏడాదికి లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
 జెడ్పీ కార్యాలయం ఎదుట కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే భారీగా ఆదాయం వస్తుంది. నగరంలో అడ్వాన్స్‌లే రూ. లక్షల్లో ఉన్నాయి.

 జెడ్పీ వెనుక బాగంలో ఉన్న పండ్లతోటలో ఎర్రచందనం, టేకు మొక్కల పెంపకం చేపడితే ఆదాయం లక్షల్లో వస్తుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

 జెడ్పీకి చెందిన సుమారు రూ.1.50 కోట్ల విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. అయినా వీటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement