సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పద్మావతిపై అనర్హత వేటు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు తలనొప్పి తెచ్చిపెట్టింది. నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు జిల్లా పరిషత్ పీఠం సాక్షిగా మరోసారి తెరమీదకు రావడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌ను కాదని.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడం దుమారానికి దారితీసినట్లు తెలుస్తోంది.
భరత్‌ప్రసాద్‌కు చెక్ పెట్టేలా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు గతంలో లాగే పావులు కదిపి.. తెరవెనుక తతంగం నడిపించినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల్లో వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలొస్తాయని ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా.. తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది.
తొలుత అలా..
2019 జూన్‌లో జరిగిన నాగర్‌కర్నూల్ జెడ్పీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. 20 జెడ్పీటీసీలకు 17 స్థానాలను కైవసం చేసుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్ కాగా.. కల్వకుర్తి నుంచి గెలుపొందిన భరత్‌ప్రసాద్‌ను చేయాలని తొలుత భావించారు. అయితే అనూహ్యంగా తెలకపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి పేరును ఓ ఇద్దరు ముఖ్యనేతలు తెరపైకి తీసుకు రాగా.. ఆమెకే అవకాశం దక్కింది.
రాములు ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉండడం, గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడంతో ఆయన కుమారుడు, విద్యావంతుడైన భరత్‌ప్రసాద్‌ను చైర్మన్ చేస్తే తమకు భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని భావించిన సదరు నేతలు పద్మావతి పేరును తెరమీదికి తెచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు, వారి అనుచరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.
ఎంపీ అనుచరుల్లో అసహనం.. విమర్శలు
జెడ్పీ పీఠానికి సంబంధించి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఎంపీ రాములు, అతడి అనుచరుల్లో అసహనం నెలకొన్నట్లు తెలుస్తోంది. అంతర్గత భేటీలో ఈ విషయం చర్చకు రాగా.. కావాలనే గతంలో తెరచాటు రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారని ఒకరిద్దరు ఆగ్రహావేశాలకు లోనైనట్లు సమాచారం. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నడుచుకోవాలని.. సంయమనం పాటించాలని వారికి ఎంపీ సూచించినట్లు తెలిసింది.
మరోవైపు ఎన్నికలకు సమయం ఇంకా ఏడాదికి పైగా ఉన్నప్పటికీ బాలాజీసింగ్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు కట్టబెట్టడం.. ఎస్సీకి కేటాయించిన స్థానంలో వేరొకరిని నియమించడంపై ఆ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశించినప్పటికీ.. తెలకపల్లి జెడ్పీటీసీగా సుమిత్ర ప్రమాణస్వీకారంలో జాప్యం జరుగుతోంది. పద్మావతి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని.. అందుకే జాప్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ఇలా..
తెలకపల్లి జెడ్పీటీసీ పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్‌లో సంతానానికి సంబంధించి తప్పు డు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 1997లో మొదటి కుమారుడు, 2001లో ఇద్దరు కవలలు జన్మించినట్లు పేర్కొన్నారని.. వాస్తవానికి 1991లో మొదటి కుమారుడు, 1997లో ఒకరు, 2001లో మరొకరు జని్మంచారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ తర్వాత పద్మావతిని జెడ్పీటీసీ సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికైనట్లు ప్రకటించాలని ఆదేశించింది.
దీనిపై పద్మావతి హైకోర్టును ఆశ్రయించగా ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. చివరకు స్టే పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించడంతో పద్మావతిపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజనల్ బెంచీకి వెళ్లినా చుక్కెదురైంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపిక అనివార్యం కాగా.. భరత్‌ప్రసాద్‌తో పాటు ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్‌నే జెడ్పీచైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక సైతం తొలుత అడ్డు పడిన వారే ఉన్నారని.. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అన్నీ తానై పథకం ప్రకారం భరత్‌కు చెక్‌పెట్టేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment