
టీడీపీ కోటకు బీటలు
పూలమ్మిన చోటే.. కట్టెలమ్మినట్లు తయారైంది.. జిల్లా పరిషత్ విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి..
- పాతికేళ్లుగా జెడ్పీని ఏలిన టీడీపీ..
- నేడు తుడిచిపెట్టుకుపోయింది..
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : పూలమ్మిన చోటే.. కట్టెలమ్మినట్లు తయారైంది.. జిల్లా పరిషత్ విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. వరుస గా ఆరు సార్లు జెడ్పీ చైర్మన్ పీఠాలను దక్కించుకుని.. పాతికేళ్లుగా జిల్లా పరిషత్‌లో తిరుగులేని పాలన కొనసాగించిన టీడీపీకి ఇప్పుడు కేవలం ఇద్దరంటే ఇద్దరు జెడ్పీటీసీలు మాత్రమే మిగిలారంటే జిల్లాలో ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.
కొత్తగా శనివారం కొలువుదీరిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో ఆ పార్టీ జెడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్‌రావు (వాంకిడి), అబ్దుల్‌కలాంలు (కెరమెరి) మాత్రమే ఉన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో ఘెర పరాజయం పాలైన ఆ పార్టీ కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే గెలిచారు. ఇన్నాళ్లు పచ్చకండువాలు ధరించిన టీడీపీ సభ్యులతో నిండిపోయిన జెడ్పీ సమావేశాల్లో ఇప్పుడు ఆ పార్టీ సభ్యులతో కోసం వెతుక్కుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
27 ఏళ్లుగా టీడీపీ పాలనలోనే..
1987 ఫిబ్రవరిలో జెడ్పీ చైర్మన్‌గా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (అప్పట్లో టీడీపీలో ఉన్నారు.) ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009 వరకు సుమారు 27 ఏళ్లు పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్‌లో పాగా వేసింది. మధ్యలో 1992 నుంచి 1995 వరకు మూడేళ్లు, 2000 నుంచి 2001 వరకు మరో ఏడాది మొత్తం నాలుగేళ్ల పాట ప్రత్యేక అధికారి (కలెక్టర్) పాలన కొనసాగింది.
ఆ తర్వాత మళ్లీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ 2009 సెప్టెంబర్ వరకు టీడీపీ కొనసాగింది. తర్వాత జెడ్పీ పీఠం కాంగ్రెస్‌కు దక్కింది. 2009 నుంచి 2011 వరకు కాంగ్రెస్ జెడ్పీటీసీ సిడాం గణపతి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో మళ్లీ మూడేళ్లుగా జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఏప్రిల్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం.. ఇప్పుడు పాలక మండలి కొలువుదీరడం జరిగిపోయింది. సుమారు 27 ఏళ్లుగా జిల్లా పరిషత్‌ను పాలించిన టీడీపికి ఇప్పుడు ఉనికిని చాటుకునే పరిస్థితి ఏర్పడింది.
అధినేత తీరుతో..
తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ఆ పార్టీ జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అధినేత తీరును నిరసిస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలు వలసలు పోగా, ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో ఆ పార్టీ ఖాళీ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా పార్టీకి దక్కకపోగా, ప్రాదేశిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఘెర పరాజయం పాలైంది. దీంతో జిల్లాలో ఆ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.
జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసిన నేతల వివరాలు ఇలా ఉన్నాయి..