ఒంగోలు : సమస్యలకు ... సవాళ్లకు జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశం వేదిక కానుంది. శుక్రవారం పాత జిల్లా పరిషత్ సమావేశం హాలులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొననున్నారు. మూడేళ్ల జాప్యం అనంతరం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుండడంతోపాటు ప్రస్తుతం రైతులు, పింఛన్‌దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు సమావేశానికి ‘కాక’ పుట్టించనున్నాయి.
ఈ నేపథ్యంలో సభను అర్థవంతంగా...ఆదర్శవంతంగా నిర్వహించేందుకు సభ్యులంతా సహకరించాలని, జిల్లా పరిషత్ సమావేశాలు రాష్ట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేలా ప్రజాప్రతినిధులు కూడా మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పిలుపు ఇవ్వడం తెలిసిందే.
మూడేళ్ల అనంతరం...
జిల్లా పరిషత్ గత పాలకవర్గం గడువు 2011 జూలై 9వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో చివరి సర్వసభ్య సమావేశం 2011 జూలై 7వ తేదీన వాడీవేడీగా జరిగింది. ఆ తరువాత ఎన్నికల నిర్వహణకు పలు కీలకాంశాలు సమస్యగా మారడంతో జిల్లా పరిషత్‌కు ప్రత్యేకాధికారి పాలనే దిక్కయింది. ఈ ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు ఏప్రిల్ నెలలో జడ్పీటీసీ ఎన్నికలు జరగడం ... ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన 31 మంది సభ్యులు, తెలుగుదేశం పార్టీకి చెందిన 25 మంది సభ్యులు గెలుపొందారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వైఎస్సార్ సీపీ సభ్యులను దేశం వర్గీయులు గాలం వేయడంతో కొంత గందరగోళం నెలకుంది.
ఛైర్మన్ ఎంపిక విషయంలో ఉత్కంఠ చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో చైర్మన్ ఎన్నిక సమయంలో టీడీపీ తరుపున గెలిచిన ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా చైర్మన్ బరిలో నిలవడం, అతనికి వైఎస్సార్‌సీపీ సభ్యులు సహకరించి మద్దతు తెలపడంతో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. తరువాత విప్ ధిక్కరణ నేరంపై ఈదర హరిబాబు ఎన్నికను రద్దుచేయడంతో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న నూకసాని బాలాజీ చైర్మన్ హోదాలో నేడు కొనసాగుతున్నారు.
ప్రధాన చర్చనీయాంశాలు ఇవే...: తాజాగా జరగనున్న జెడ్పీ సమావేశంలో ప్రధానంగా పలు అంశాలు చర్చకు రానున్నాయి. శనగల మద్ధతు ధర, కొనుగోలు విషయం, పింఛన్లు అంశాలపై సభ్యులు తమ గళాన్ని విప్పడానికి సమాయత్తమవుతున్నారు.
సెగ పెట్టించనున్న శనగలు, పింఛన్లు:
జిల్లాలో శనగ రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్చూరు జన్మభూమి కార్యక్రమంలో రైతులనుద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు సహజంగానే రైతులకే కాకుండా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. మరో వైపు జన్మభూమిలో పెన్షన్ల విషయంలో పారదర్శకత లోపించిందంటూ వస్తున్న ఆరోపణలపై కూడా సభ్యులు తీవ్రంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.
తమకు కనీసం సెంటు భూమి కూడా లేకున్నా ఐదు ఎకరాల పొలం ఉందంటూ పెన్షన్లు రద్దు చేస్తున్నారనే వాదన ప్రజల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైనా కొంతమంది సభ్యులు పూర్తిస్థాయిలో తమ వాదనలను వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఈదర హరిబాబును అనర్హుడిగా జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించినందున 55 మంది మాత్రమే జడ్పీ పాలకవర్గంలో ఉన్నారు. జిల్లాలో ముగ్గురు ఎంపీలలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఇరువురు, టీడీపీకి చెందిన ఒకరు హాజరుకానున్నారు. ఎంపీ లాడ్స్‌పై సమావేశం ఢిల్లీలో ఉండటంతో ఎంపీలు వచ్చే అవకాశాలు లేవు. వైఎస్సార్‌సీపీ తరుపున రుగురు ఎంఎల్‌ఏలు, టీడీపీ తరుపున ఐదుగురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఈ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. ఎంఎల్‌సీలకు సంబంధించి ఇద్దరు సీపీఎం పార్టీకి చెందిన వారు కాగా, మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు.
క్రీడాకారుల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం...
క్రీడల నిర్వహణకు నిధుల లేమి కారణంగా క్రీడాకారులు నిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల స్కూల్‌గేమ్స్ సెలక్షన్స్ సందర్బంగా కనీసం భోజనం కూడా లేకుండా క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థుల సమస్యను జెడ్పీ చైర్మన్ స్వయంగా చూశారు. నిధుల కొరతే కారణమని తెలియడంతో దానిపై ఆయన అధ్యయనం చేసి జిల్లా పరిషత్‌కు వచ్చే కొన్ని రకాల నిధులలో కొంత శాతాన్ని క్రీడలకు ఇచ్చే అవకాశం ఉందని గుర్తించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావనకు తేనున్నారు. వాటితోపాటు జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం, జడ్పీ ఆస్తుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, పచ్చని ప్రకాశం- పరిశుభ్రత, అక్షర ప్రకాశం తదితర అంశాలపైనా తీర్మానం చేసే అవకాశం ఉంది.
మూడేళ్ల తర్వాత... నేడే
Published Fri, Oct 10 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM
Advertisement
Advertisement