వెంకటాచలం: ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్లను కొందరు అధికార పార్టీ నేతలు తమ జేబుల్లో నుంచి తీసి ఇచ్చిన సొమ్ముగా భావిస్తున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్లను ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి సోమిరెడ్డి కొందరు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా లబ్ధిదారులకు ఆయా గ్రామాల్లోని పంచా యతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు వద్ద ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయాలని ఎంపీడీఓ మధుసూదనరావు గ్రామ కార్యదర్శులకు సూచించారు. దీంతో గుడ్లూరువారిపాళెం పాఠశాల వద్ద లబ్దిదారులతో పాటు ఎంపీటీసీ సభ్యుడు నడవల రాజా గ్రామ కార్యదర్శి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మంజూరైన పింఛన్లకు సంబంధించి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు లబ్ధిదారులు అందరూ తన ఇంటికి రావాలని ఆదేశించారు.
ఇంటి వద్దకు వచ్చిన వారికే పింఛన్లు పంపిణీ చేస్తామని బెదిరించారు. పాఠశాల వద్ద పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నేత ఇంటి వద్ద పంపిణీ చేయడం ఏమిటని కొందరు లబ్ధిదారులు ప్రశ్నించినా లెక్కచేయలేదు. గ్రామకార్యదర్శి శ్రీనివాసులు టీడీపీ నేత ఒత్తిడి మేరకు ఆయన ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ల నగదు పంపిణీ చేయడంపై గ్రామస్తులు మండి పడుతున్నారు. మొత్తం 59 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు కాగా 40 మంది అక్కడికి వెళ్లి తీసుకున్నారు. మిగతా లబ్దిదారులు తాము పంచాయతి కార్యాలయం వద్దనే తీసుకుంటామని అక్కడకు వెళ్లలేదు. ఈ విషయంపై ఎంపీడీఓ మధుసూదనరావుతో మాట్లాడగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయాలని సూచించామని తెలియజేశారు. గుడ్లూరువారిపాళెం విషయంపై విచారణ జరుపుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment