తెలుగు తమ్ముళ్ల మధ్య పింఛన్ల గొడవ
తెలుగు తమ్ముళ్ల మధ్య పింఛన్ల గొడవ
Published Sat, Feb 4 2017 12:24 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
-తమవారికి తక్కువ ఇచ్చారంటూ
ఎమ్మెల్సీ వర్గం ఆరోపణ
-ఆదేం లేదని ఎమ్మెల్యే వర్గం
- మాటామాటా పెరిగి తిట్ల దండకం
అందుకున్న ఇరువురు
ఆత్మకూరు: పింఛన్ల మంజూరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. ఒక దశలో ఇరువర్గాల నాయకుల మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగే పరిస్థితి తలెత్తింది. ఇందుకు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వేదికగా మారింది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం నియోజకవర్గానికి ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో 2000 పింఛన్లు మంజూరయ్యాయి. గొడవ రాకుండా వీటిని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చెరి సగం పంచుకున్నారు. అయితే, ఆత్మకూరు మండలానికి మంజూరైన 469 పింఛన్లలో ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ కేటాయించారని శుక్రవారం ఎమ్మెల్సీ వర్గానికి చెందిన కొందరు తమ్ముళ్లు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన పింఛన్ల జాబితా ఎందుకు అమలు కాలేదని, వాటిలో పేర్లను ఎవరు తొలగించారంటూ టైపిస్ట్ సలీంను నిలదీశారు. తనకు ఈ విషయం తెలియదని, అవకతవకలు జరిగి ఉంటే లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని సూచించారు. అదే వర్గానికి చెందిన
కేశవరెడ్డి వడ్ల రామాపురం గ్రామానికి మంజూరైన పింఛన్లలో తమ వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని, తాను ఇచ్చిన పేర్లు కాకుండా ఇతరుల పేర్లు ఎలా వచ్చాయని గట్టిగ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి చెందిన వర్గీయులు నాగార్జునరెడ్డి మేము ఎందుకు తొలగిస్తాం. శిల్పా భువనేశ్వరరెడ్డి తొలగించారని చెప్పడంతో వారి మధ్య మాటా మాటా పెరిగిపోయింది. నిన్నమొన్న పార్టీలోకి వచ్చి జన్మభూమి కమిటీ ఇచ్చిన పేర్లనే మారుస్తారా అంటూ కేశవరెడ్డి కార్యాలయంలో చిందులేశారు. చివరకు ఇరువర్గాలు వాదులాటకు దిగాయి.
అధికార పార్టీకి చెందిన గోవిందరెడ్డి, గిరిరాజులు కలగజేసుకుని ఘర్షణకు దిగిన వారిని తన్నుకోకుండా విడిపించారు. తరా్వత పార్టీ నేత శిల్పా భువనేశ్వరరెడ్డితో ఫొన్‌లో మాట్లాడించారు. వడ్లరామాపురంలో కొన్ని పేర్లు తానే తొలగించానని చెప్పడంతో వివాదం ముగిసింది. కాగా అధికార పార్టీకి చెందిన వారే తమవారికి కావాలంటే తమవారికి కావాలని కీచులాడుకుంటుంటే అర్హులైన పేదలకు పింఛన్ ఇంకెక్కడ వస్తుందని కార్యాలయం వద్ద కొందరు చర్చించుకోవడం కనిపించింది.
నా సంతకం ఫోర్జరీ చేశారు
వడ్లరామాపురం గ్రామంలో అధికార పార్టీ క్యాడర్ కీచులాట ఇలా ఉంటే ఆత్మకూరు పట్టణానికి చెందిన సంపత్ అనే జన్మభూమి కమిటీ సభ్యుడు నా సంతకం ఎవరో ఫోర్జరీ చేసి ఇచ్చిన జాబితాను అప్‌లోడ్ చేశారని మండల అధికారులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అయితే దీని వెనుకకూడా వర్గాల కుమ్ములాటే ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
Advertisement
Advertisement