అనంతపురం టౌన్: సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపికకు రాజకీయ గ్రహణం సోకింది. ఎలాంటి అర్హతలు లేకపోయినా.. లంచమిస్తే కొత్త పింఛన్ల లబ్ధికి చేకూరుస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం జన్మభూమి కమిటీ సభ్యుల కనుసన్నల్లోనే జరుగుతోంది. డబ్బు ముట్టజెపితే పనులు చకచకా జరిగిపోతుంటాయి. కమిటీ సభ్యులు కోరుకున్న మేరకు డబ్బు చెల్లించని నియోజకవర్గాల్లో లబ్దిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టలేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కండువా వేసుకున్న వారిని మాత్రమే పింఛన్ లబ్ధి చేకూరుస్తామంటూ ఆ పార్టీ నాయకులు నూతన అధ్యాయనానికి తెరలేపారు.
నియోజకవర్గానికి రెండు వేల పింఛన్లు
జిల్లా వ్యాప్తంగా 63మండలాల్లో ప్రస్తుతం 4,04,692 పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఐదో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 2వేల పింఛన్లు చొప్పున 28వేల కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వీటితోపాటు గ్రామసభల్లో పింఛన్ కోసం వచ్చే అర్జీలను పరిశీలించి ప్రతి మండలంతోపాటు మున్సిపాలిటీల్లో 100 మందిని చొప్పున అర్హులను గుర్తించాలని నోడల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ లెక్కన 28వేలతోపాటు అదనంగా 7,500పింఛన్లకు అర్హులను గుర్తించి ఉగాది (మార్చి 1)కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉంది. పరిస్థితి చూస్తుంటే మార్చి 1 నాటికి కొత్త పింఛన్ల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నత్తనడకన లబ్ధిదారుల ఎంపిక
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అర్హులను గుర్తించే పనిలో ఎంపీడీఓలు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే దాదాపు రెండు నెలలు పూర్తి కావస్తున్న పింఛన్ లబ్ధిదారుల ఎంపిక నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే దాదాపు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య లక్షకు పైగానే ఉంది. అందులో 35,500 మంది అర్హులను అధికారులు గుర్తించాల్సి ఉంది. నోడల్ అధికారులు సైతం పింఛన్‌కు అర్హులను గుర్తించడంలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మున్సిపాలిటీ పరిధిలో 7,500 మందికి గాను నేటికీ ఏ ఒక్కరినీ గుర్తించలేదు.
ఈ నియోజకవర్గాల్లో అర్హులే లేరా?:
ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో పింఛన్‌కు అర్హులే లేనట్లు ఉన్నారు. ఎంపిక పక్రియ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రెండు నెలల కాలంలో ఒక్కరంటే ఒక్కరిని సైతం అధికారులు గుర్తించలేకపోయారు. కదిరి నియోజకవర్గానికి 2వేల పింఛన్లు మంజూరైతే ఇప్పటి వరకు కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు.
వేగవంతం చేస్తాం
పింఛన్ లబ్ధిదారుల ఎంపిక పక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఇప్పటికే అన్ని మండలాల ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశాం. త్వరతగతిన ఎంపిక చేసి మార్చి1న పంపిణీ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. – కేఎస్ రామారావు, పీడీ, డీఆర్‌డీఏ
Comments
Please login to add a commentAdd a comment