సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా పరిషత్‌లో చాంబర్ లొల్లి కొనసాగుతోంది. పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించి రెండు నెలలు కావస్తున్నా చాంబర్ ఏర్పాటు చేయలేదన్న ఆవేదనలో వైస్ చైర్మన్ వర్గీయులుండగా, రెండు గదులు చూపించినా వాటిని కాదని తాను కోరుకున్న చోటే చాంబర్ ఏర్పాటు చేయాలంటూ వైస్ చైర్మన్ పట్టుబట్టడం సరికాదంటూ చైర్‌పర్సన్ వర్గీయులు వాదిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై రసవత్తర చర్చ జరుగుతోంది.
టీడీపీలోని ఓ వర్గ ఎమ్మెల్యేలు జెడ్పీలో మరో పవర్ సెంటర్ ఉండాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో పావులు కదిపారు. దీనిలో భాగంగా వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును కోరారు. వైఎస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం జరిగిన ఓ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణికి మంత్రి నేరుగా సూచించారు.
ఈ నిర్ణయాన్ని చైర్‌పర్సన్ జెడ్పీలో చాంబర్ లొల్లి వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. ఎప్పుడూ లేని విధంగా వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏంటని డిఫెన్స్‌లో పడ్డారు. ప్రత్యర్థుల ఎత్తుగడగా భావించినప్పటికీ మంత్రి ఆదేశించిన తర్వాత తప్పదని వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. తొలుత జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పాత భవనంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే దాన్ని వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి అంగీకరించలేదు. ప్రస్తుత పరిపాలన భవనంపై ఉన్న ప్రత్యేక రూమ్‌లోనే చాంబర్ ఏర్పాటు చేయాలని పట్టు బట్టారు. చైర్‌పర్సన్ కోసం కేటాయించిన రూమ్‌ను ఆయనకు కేటాయించాలని కోరడమేంటని చైర్‌పర్సన్ వర్గీయులు ఇరకాటంలో పడ్డారు. ఇప్పటికే చైర్‌పర్సన్ వాడుతున్నారని, అందులో వైస్ చైర్మన్‌కు చాంబర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సంకేతాలు పంపారు. సమావేశం హాలు పక్కనే ఉన్న రూమ్‌లో చాంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఆ ప్రతిపాదనను కూడా వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి తిరస్కరించారు.
ప్రస్తుతం పరిపాలన భవనంపైన ఉన్న రూమ్‌లోనే ఏర్పాటు చేయాలని మొండికేసి కూర్చొన్నారు. దీంతో ఏకాభిప్రాయం కుదరక చాంబర్ లొల్లి ఏర్పడింది. మంత్రి ఆదేశించినా పట్టించుకోలేదని వైస్ చైర్మన్, ఆయన అనుకున్న చోటే కేటాయించాలని కోరడం సరికాదని చైర్‌పర్సన వర్గీయుల మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో ఆ రెండు వర్గాల మధ్య అంతరం పెరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం ఇప్పటికే కొనసాగుతున్న పోరాటంలో ఈ చాంబర్ లొల్లి ఏ మేర ప్రభావం చూపుతుందో, ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
జెడ్పీలో చాంబర్ లొల్లి
Published Sat, Nov 8 2014 3:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement