
కొలువుదీరిన జడ్పీ పాలకవర్గం
ఇందూరు : సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జడ్పీ పాలకవర్గం కొలువుదీరింది. బాధ్యతలు స్వీకరించడానికి నెలన్నరగా నిరీక్షిస్తున్న జడ్పీటీసీలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం సమావేశమైంది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులను సభ్యులకు పరిచయం చేయించా రు. డీఆర్‌డీఏ పీడీ వెంకటేశంతో పరిచయ కార్యక్రమం ప్రారంభించారు. డీఆర్‌డీఏ, జిల్లా పంచాయతీ, డ్వామా, ట్రాన్స్‌కో, వ్యవసాయ, ఉద్యాన, సంక్షేమ తదితర శాఖల అధికారులు ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాలు, అవి అందించే ఫలాలను జడ్పీటీసీ సభ్యులకు వివరించారు.
ఘనసన్మానం
జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సన్మానిం చారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కవిత, బీబీపాటిల్, కలెక్టర్ వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈఓ రాజారాం, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు తన కుటుంబ సభ్యులను అందరికీ పరిచయం చేశారు. జడ్పీ కార్యాలయం వద్ద జుక్కల్, నిజాంసాగర్ మండలాలకు చెందిన అభిమానులు టపాకాయలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
భారీ బందోబస్తు
పాలక వర్గం ఎన్నిక సందర్భంగా జిల్లా పరిషత్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే జిల్లా పరిషత్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. జడ్పీ పరిసరాల చుట్టూ 144 సెక్షన్ అమలు చేశారు. గుర్తింపు కార్డులు లేనిదే ఎవరినీ లోనికి అనుమతించలేదు. సీఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.