
అధికారులూ పద్ధతి తప్పితే కష్టాలే
సాక్షి, చిత్తూరు: అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నిబంధనలు అతిక్రమించి తప్పులుచేస్తే కష్టాలు ఎదుర్కోక తప్పదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. తప్పులు చేసిన అధికారులు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఇప్పటికే చాలామంది అధికారులు బలిపశువులయ్యారని భాస్కర్‌రెడ్డి ఉదహరించారు. ఎన్ని తప్పులు చేసినా అధికారపార్టీ అండగా ఉంటుందనుకుంటే తమకేమీ అభ్యంతరంలేదన్నారు.
శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ గీర్వాణి అధ్యక్షతన 1వ, 7వ స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి హాజరైన చెవిరెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్‌లో రిసీట్స్, డిస్ట్రిబ్యూషన్, బడ్జెట్‌లకు సంబంధించి పాజిటివ్ చర్చను స్వాగతించాలన్నారు. ఈ సమావేశానికి ఎటువంటి వివరాలు లేకుండా అధికారులు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. డెవలప్‌మెంటు పాలసీ, ప్రొసీజర్ ప్రకారం చేయాలన్నారు. ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఘర్షణ వాతావరణం తప్పదన్నారు. జిల్లా పరిషత్ పరిధిలో కమర్షియల్ టాక్స్, సీన రీసెస్, జనరల్‌ఫండ్స్, మినరల్‌సెస్, పంచాయతీరాజ్ తదితర శాఖల నుంచేగాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు వస్తాయన్నారు.
మొత్తం ఎన్ని నిధులు వస్తున్నాయి? వీటిని ఎలా పంపిణీ చేస్తున్నారు? ఏ సిస్టమ్ అమలు చేస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధా?, జనాభా నిష్పత్తి ప్రకారమా ?, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికా? అంటూ చెవిరెడ్ది ప్రశ్నల వర్షం కురి పించారు. నిధుల కేటాయింపునకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎప్పటి లోగా బడ్జెట్ ఫార్మెట్ పంపబోతున్నారు? అంటూ చెవిరెడ్డి ప్రశ్నిం చారు. ప్రధానంగా పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో కేటాయింపులకు సంబంధించి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. మరి దీనికి చివరి గడువు ప్రకటిం చారా? వీటి అనుమతుల కోసం పంచాయతీరాజ్ కమిషనరుకు ఎప్పుడు పంపుతున్నారు? అంటూ ఆయన అధికారులను నిలదీశారు.
ఈ వివరాలు సకాలంలో పంపకపోవడంతో ఖమ్మం, వరంగల్ జెడ్పీసీఈవోల చెక్ పవర్‌ను ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పనులకు సంబంధించిన లిస్ట్‌ను సకాలంలో తయారు చేయనందుకు నెల్లూరు సీఈవో కైలాస్‌గిరిని ప్రభుత్వం టెర్మినేట్ చేసిందన్నారు. ఆ తరువాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారని చెవిరెడ్డి గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ నిధులను వారికే ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. లేకపోతే కమిషనర్ చూస్తూ ఊరుకోదని చెవిరెడ్డి హెచ్చరించారు. జిల్లాకు సంబంధించిన వివరాలు లేవు, తాగునీటికి ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పలేకున్నారు? అసలు ఏ విషయం లేకుండా సమావేశాలు ఎందుకని నిలదీశారు. మొదటిసారి అని వదులుతున్నా, పదేపదే తప్పులు జరిగితే సీఈవోనే దోషిగా నిలవాల్సి వస్తుందని చెవిరెడ్డి హెచ్చరించారు.
తప్పుచేసిన అధికారులను వదిలేది లేదన్నారు. జెడ్పీ విధివిదానాలు, అధికారుల విధులు, నిబంధనలతోపాటు తప్పుచేసి బలిపశువులైన అధికారుల వివరాలు సైతం ఉదాహరణలతోసహా ఉటంకించడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు. చెవిరెడ్డి అన్ని విషయాలు తెలివిగా తెలియజెప్పి పరోక్ష హెచ్చరికలకు దిగి అధికారులను బ్లాక్‌మైల్ చేస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. తప్పుచేసినా అధికార పార్టీ నేతలు కాపాడుతారని భరోసా ఉంటే అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిం చినా తమకేమీ అభ్యంతరం లేదని చెవిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, మిగిలిన అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.