girvani
-
మాఫీ కాకుండానే రుణమాఫీ పత్రాలు
ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఓ రైతుకు షాకిచ్చింది. రుణమాఫీ కాకుండానే.. పూర్తిగా వ్యవసాయ రుణం మాఫీ అయినట్లు ఇంటికి పత్రాలు వచ్చాయి. ఈ ఘటన చంద్రగిరి మండలం కల్ రోడ్డు పంచాయతీ లోని మిట్టూరు గ్రామానికి చెందిన కొమ్మినేని దామోదరం నాయుడు రుణమాఫీ పత్రాలు అందుకున్నాడు. కల్ రోడ్డు పంచాయతీ లో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ గిర్వానీ హాజరయ్యారు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న దామోదరం నాయుడు జడ్ పీ చైర్మన్ ను రుణమాఫీ పై నిలదీశారు. ఎలాంటి రుణమాఫీ జరగ కుండానే.. తనకు ఉన్న రూ.39 వేల రుణం మాఫీ అయినట్లు పత్రాలు వచ్చాయని తెలిపారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం రుణమాఫీ చేశామని చెప్పుకోవడమే.. రైతులకు ఒక్క పైసా కూడా రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీ విషయంలో అధికార పార్టీకి చెందిన వారిని నిలదీయడంతో.. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక.. నీళ్లు నమిలారు. -
అధికారులూ పద్ధతి తప్పితే కష్టాలే
సాక్షి, చిత్తూరు: అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నిబంధనలు అతిక్రమించి తప్పులుచేస్తే కష్టాలు ఎదుర్కోక తప్పదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. తప్పులు చేసిన అధికారులు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఇప్పటికే చాలామంది అధికారులు బలిపశువులయ్యారని భాస్కర్‌రెడ్డి ఉదహరించారు. ఎన్ని తప్పులు చేసినా అధికారపార్టీ అండగా ఉంటుందనుకుంటే తమకేమీ అభ్యంతరంలేదన్నారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ గీర్వాణి అధ్యక్షతన 1వ, 7వ స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి హాజరైన చెవిరెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్‌లో రిసీట్స్, డిస్ట్రిబ్యూషన్, బడ్జెట్లకు సంబంధించి పాజిటివ్ చర్చను స్వాగతించాలన్నారు. ఈ సమావేశానికి ఎటువంటి వివరాలు లేకుండా అధికారులు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. డెవలప్మెంటు పాలసీ, ప్రొసీజర్ ప్రకారం చేయాలన్నారు. ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఘర్షణ వాతావరణం తప్పదన్నారు. జిల్లా పరిషత్ పరిధిలో కమర్షియల్ టాక్స్, సీన రీసెస్, జనరల్‌ఫండ్స్, మినరల్సెస్, పంచాయతీరాజ్ తదితర శాఖల నుంచేగాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు వస్తాయన్నారు. మొత్తం ఎన్ని నిధులు వస్తున్నాయి? వీటిని ఎలా పంపిణీ చేస్తున్నారు? ఏ సిస్టమ్ అమలు చేస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధా?, జనాభా నిష్పత్తి ప్రకారమా ?, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికా? అంటూ చెవిరెడ్ది ప్రశ్నల వర్షం కురి పించారు. నిధుల కేటాయింపునకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎప్పటి లోగా బడ్జెట్ ఫార్మెట్ పంపబోతున్నారు? అంటూ చెవిరెడ్డి ప్రశ్నిం చారు. ప్రధానంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో కేటాయింపులకు సంబంధించి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. మరి దీనికి చివరి గడువు ప్రకటిం చారా? వీటి అనుమతుల కోసం పంచాయతీరాజ్ కమిషనరుకు ఎప్పుడు పంపుతున్నారు? అంటూ ఆయన అధికారులను నిలదీశారు. ఈ వివరాలు సకాలంలో పంపకపోవడంతో ఖమ్మం, వరంగల్ జెడ్పీసీఈవోల చెక్ పవర్‌ను ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పనులకు సంబంధించిన లిస్ట్‌ను సకాలంలో తయారు చేయనందుకు నెల్లూరు సీఈవో కైలాస్గిరిని ప్రభుత్వం టెర్మినేట్ చేసిందన్నారు. ఆ తరువాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారని చెవిరెడ్డి గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ నిధులను వారికే ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. లేకపోతే కమిషనర్ చూస్తూ ఊరుకోదని చెవిరెడ్డి హెచ్చరించారు. జిల్లాకు సంబంధించిన వివరాలు లేవు, తాగునీటికి ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పలేకున్నారు? అసలు ఏ విషయం లేకుండా సమావేశాలు ఎందుకని నిలదీశారు. మొదటిసారి అని వదులుతున్నా, పదేపదే తప్పులు జరిగితే సీఈవోనే దోషిగా నిలవాల్సి వస్తుందని చెవిరెడ్డి హెచ్చరించారు. తప్పుచేసిన అధికారులను వదిలేది లేదన్నారు. జెడ్పీ విధివిదానాలు, అధికారుల విధులు, నిబంధనలతోపాటు తప్పుచేసి బలిపశువులైన అధికారుల వివరాలు సైతం ఉదాహరణలతోసహా ఉటంకించడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు. చెవిరెడ్డి అన్ని విషయాలు తెలివిగా తెలియజెప్పి పరోక్ష హెచ్చరికలకు దిగి అధికారులను బ్లాక్మైల్ చేస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. తప్పుచేసినా అధికార పార్టీ నేతలు కాపాడుతారని భరోసా ఉంటే అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిం చినా తమకేమీ అభ్యంతరం లేదని చెవిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, మిగిలిన అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
మా అత్తమ్మ
సినిమాల్లో గయ్యాళిగా కనిపించే అత్త పాత్రలను చూసి సమాజంలో అత్తలు అందరూ గయ్యాళులుగా ఉంటారని అనుకోవడం అవివేకమే. సినిమా వేరు, నిజ జీవితం వేరు. కోడళ్లను కన్న కూతుళ్లలా చూసుకుంటూ అత్తా ఒకింటి కోడలే అన్న నానుడిని నిజం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వయసు పైబడినా కోడళ్లకు చిన్న పని కూడా చెప్పకుండా వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ అమ్మను మరిపించే అత్తలు ఎందరో. ‘అత్త’ల దినోత్సవం సందర్భంగా కొందరు కోడళ్ల అనుభవాలు ఇవీ! -సాక్షి నెట్వర్క్ పెళ్లికి ముందు ఫ్రెండ్.. తరువాత ఫ్యాన్ మా అత్త షన్భగం పెళ్లికి ముందు ఫ్రెండ్‌గా ఉండేవారు. సినిమా షూటింగ్ సమయాల్లో మా అమ్మతోపాటు అత్తయ్య కూడా పాల్గొనేవారు. ఫ్రెండ్‌లా వ్యవహరిస్తూ సలహాలిచ్చేవారు. సెల్వమణితో ప్రేమ వివాహం తరువాత అత్తయ్య నాకు పెద్ద ఫ్యాన్‌గా మారిపోయారు. నేను నటించిన సినిమాలు, ఇతర ప్రోగ్రామ్స్‌ను తప్పకుండా చూస్తుంటారు. నా నటన అంటే అత్తకు అభిమానం. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. అయితే ప్రేమ వివాహం తరువాత నన్ను ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయలేదు. నా పిల్లలిద్దర్నీ అత్తతో పాటు వదిన సరస్వతీ ఎంతో చక్కగా చూసుకుంటారు. నేను సినిమారంగం, రాజకీయ రంగం పట్ల బిజీగా ఉంటున్న విషయాల్ని అత్త బాగా అర్థం చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినపుడు అత్తయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సంఘటన మరువలేను. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్యపరమైన సమస్య ఉండడంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారరానికి రాలేకపోయారు. అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ నేను గెలవాలని ప్రత్యేక పూజలు చేయించేవారు. గెలుపు అనంతరం ఆమె ఎంతో ఆనందంతో మొక్కు తీర్చుకున్నారు. అత్తగారితో ఉండే అన్యోన్యత, అనుబంధం, ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. - ఆర్కే.రోజా, నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూతురుకన్నా మిన్నగా చూస్తోంది నా భర్త పేరు చంద్రప్రకాష్. మా అత్త పేరు పద్మావతి. ఆమెకు 76 ఏళ్లు. నాకు 1990లో పెళ్లయింది. మా మామ నాకు పెళ్లికాకముందే చనిపోయారు. నాకు పెళ్లయినప్పటి నుంచీ అత్తతో ఎలాంటి సమస్యా లేదు. ఇప్పటి వరకు అత్తతో చిన్నపాటి గొడవా రాలేదు. మామూలుగా అందరూ భర్త తల్లిని అత్త అనే పిలుస్తుంటారు. కానీ నేను మాత్రం అమ్మ అనే పిలుస్తున్నాను. ఆమె కూడా నన్ను అమ్మా అనే సంబోధిస్తుందే తప్ప పేరుపెట్టి పిలవడం కానీ, ఏకవచనంతో పిలవడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. నాకు నాన్నలేడు. అమ్మ ఉన్నా పుత్తూరు మండలం వేపగుంట గ్రామంలో ఉంటోంది. ఎక్కడో దూరంగా పల్లెలో ఉన్నా పెళ్లయిన తర్వాత అమ్మను మరిచిపోయే విధంగా మా అత్త నన్ను చూసుకుంటోంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉంది. మేము కూడా వీలుదొరికినప్పుడల్లా బెంగళూరుకు వెళ్లి వస్తుంటాం. భవిష్యత్తులో కూడా ఎలాంటి మనస్పర్థలూ ఏర్పడకుండా ప్రస్తుతమున్న తల్లీకూతుళ్ల బంధం కడదాకా ఉండేటట్లు ఆశీర్వదించమని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. - గీర్వాణి, జెడ్పీ చైర్పర్సన్ నా ఉన్నతికి కారణం పలమనేరు రూరల్: ‘మా అత్త నాకు అమ్మలాంటిది. నేను అత్తారింట్లో ఉన్నా పుట్టింట్లో ఉన్నట్టే ఉంటుంది. నేనీవాళ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానంటే మా అత్తయ్య ప్రోత్సాహమే కారణం’ అంటోంది పలమనేరు మండలం రామాపురానికి చెందిన వాసవి. రామచంద్రనాయుడు కుమార్తె వాసవితో పెనుమూరు మండలం కంబాలమిట్టకు చెందిన సరస్వతి, సుబ్రమణ్యం కుమారుడు నాదేళ్ల కుమార్‌తో గతేడాది పెళ్లైంది. భర్త కుమార్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నారు. వాసవి అత్తమామలది ఉమ్మడి కుటుంబం. పెళ్లయిన తర్వాత అప్పగింతల సమయంలో వాసవి కన్నీళ్లు తుడిచి అత్త అక్కున చేర్చుకోవడంతో ఆమెకు ధైర్యం వచ్చింది. కోడలికి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగానే ప్రోత్సాహమిచ్చి ఉద్యోగం చేసేలా చూసింది. తన కొడుకును సైతం కోడలితో పాటు పంపి అక్కడే కాపురం పెట్టించింది. ప్రతిరోజూ అత్తాకోడళ్లిద్దరూ ఫోన్లో బాగోగులు తెలుసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అత్తారింటికి కోడలు వచ్చినపుడు అన్నీ పనులు అత్తే చేస్తూ కోడలిని బాధపెట్టనివ్వకుండా చూసుకుంటోంది. కోడలు సైతం అత్త మనసును నొప్పించకుండా ఆమెకు సాయంగా ఉంటూ ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. తనకు అత్త తల్లిలాగే అనిపిస్తుందని వాసవి చెబుతోంది. - వాసవి ఆమె ఓపికకు హ్యాట్సాఫ్ మా అత్త సరోజమ్మ నన్ను కన్న కూతురిలా చూసుకుంటోంది. అత్త, అమ్మ రెండూ ఆవిడే. వాస్తవానికి నన్ను కోడలిని చేసుకోవడం మా అత్తకు ఇష్టం లేదు. తన తమ్ముడి కూతురిని ఇంటి కోడలు చేసుకోవాలనేది ఆమె ఆలోచన. ఈ నేపథ్యంలో నా పెళ్లి జరిగినందున మొదట్లో అత్త ఎలాంటి ఇబ్బందులు పెడుతుందోన ని భయపడేదాన్ని. నేను ఊహించినట్లే కొన్నాళ్లు ఆమె మాటలు నా మనసును బాధించాయి. నేను కర్నూలులో పీజీ చేస్తున్నపుడు నా ఏడాది వయసు తొలి బిడ్డను తిరుపతిలో తనవద్ద ఉంచుకొని అక్కరగా చూసుకుంది. నా ఉన్నత చదువులకు, ఉద్యోగానికి ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. ఇప్పటికీ మా పిల్లలకు కావాల్సినవి అన్నీ ఆమే చూస్తుంది. వయసు పైబడినా నోములు, వ్రతాలు పండుగలు నిష్టగా చేస్తుంది. సంప్రదాయాలను బాగా గౌరవిస్తుంది. పండుగల పద్ధతులు, వంటలు ఎలా చేయాలో ఆమె దగ్గరే నేర్చుకున్నాను. మాది ఉమ్మడి కుటుంబం. కుటుంబంలో అందరినీ సమానంగా ఆదరిస్తుంది. మానసిక స్ధితి సరిగా లేని తన కూతురికి ఓపికగా ఆమె చేస్తున్న సేవలు నిరుపమానమైనవి. ఆమె ఓపికకు హ్యాట్సాఫ్. - డాక్టర్ కృష్ణప్రశాంతి, జనరల్ ఫిజీషియన్ -
నీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు
నిధులెంతైనా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు 20 రోజుల్లో రూ. 6 కోట్లు మంజూరు చేశాం ఏఈ, ఎమ్మార్వో, ఎంపీడీవోలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి చిత్తూరు(టౌన్): జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గీర్వాణి సంబంధిత అధికారులను కోరారు. గురువారం ఆమె జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలోని తన చాంబరులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తాగునీటి సమస్య రోజురోజుకూ ఎక్కువవుతోందన్నారు. వర్షాలు కురవని కారణంగా భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లన్నీ ఎండిపోతున్నాయని చెప్పారు. కొత్తగా వేసే బోర్లలో కూడా నీరు రావడం లేదన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 918 గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉందన్నారు. 866 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, 52 గ్రామాల్లో సమీపంలో ఉన్న బోర్లను టైఅప్ చేస్తూ నీటిని అందిస్తున్నామని చెప్పారు. వర్షాలు ఇలాగే ఉంటే రానున్న రెండు నెలల్లో సమస్య మరింత తీవ్రంకానున్నందున మండలాల్లోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు ప్రజలకు తాగునీరిచ్చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడ సమస్య తలెత్తినా మండలాల్లోని సంబంధిత అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడచిన 20 రోజుల్లో జిల్లా ప్రజాపరిషత్ నుంచి రూ.6 కోట్లు మండలాలకు మంజూరు చేశామన్నారు. ఇంకనూ అవసరమైతే ఎంతైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కూడా హామీ ఇచ్చారని చెప్పారు. సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మండలాల్లోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు కూడా అధికారులకు సహకరించాలని ఆమె కోరారు. అవసరమైతే జెడ్పీ నుంచి మరిన్ని నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. -
నేడే జెడ్పీ అధ్యక్ష ఎన్నిక
మధ్యాహ్నం వరకు నామినేషన్ల ప్రక్రియ 3 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక.. ప్రమాణ స్వీకారం చైర్‌పర్సన్‌గా గీర్వాణీ ఎన్నిక లాంఛనమే ఏర్పాట్లన్నీ పూర్తిచేసిన అధికార యంత్రాంగం రెండు నెలల నిరీక్షణకు ఫలితం మరి కొన్ని గంటల్లో వెలువడనుంది. జిల్లాలోని 65 మంది జెడ్పీటీసీ సభ్యుల నుంచి ఒకరిని జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులుగా ఎన్నుకునే ప్రక్రియకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌గా చిత్తూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యురాలు గీర్వాణీ పేరు లాంఛనంగా ప్రకటించడమే తరువాయి. చిత్తూరు (అర్బన్) : జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికకు అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు చేసింది. జెడ్పీ సమావేశ హాలులో శనివారం జరగనున్న చైర్పర్సన్ ఎన్నికకు జిల్లా కలెక్టర్ కే.రాంగోపాల్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. జిల్లాలోని 65 జెడ్పీటీసీలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం జెడ్పీటీసీ స్థానాలకు 266 మంది పోటీపడ్డారు. విజయం సాధించిన 65 మంది జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పలు కారణాల రీత్యా వాయిదాపడుతూ వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడంతో శనివారం జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా యంత్రాగం సమాయత్తమయింది. మెజారిటీ జెడ్పీటీసీలు టీడీపీవే ... జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 37 చోట్ల విజయం సాధించింది. బుచ్చినాయుడుకండ్రిగ, బంగారుపాళెం, చిన్నగొట్టిగల్లు, చిత్తూరు, గుడిపాల, గుడుపల్లె, ఐరాల, కలకడ, కార్వేటినగరం, కుప్పం, కురబలకోట, కేవీబీ.పురం, ములకలచెరువు, నాగలాపురం, నగరి, నిండ్ర, పెద్దతిప్పసముద్రం, పాకాల, పలమనేరు, పాలసముద్రం, పెనుమూరు, పిచ్చాటూరు, పూతలపట్టు, రామచంద్రాపురం, రామకుప్పం, రేణిగుంట, శాంతిపురం, సత్యవేడు, సోమల, శ్రీకాళహస్తి, తవణంపల్లె, తొట్టంబేడు, తిరుపతి, వీ.కోట, వరదయ్యపాళెం, విజయపురం, ఎర్రావారిపాళెం జెడ్పీటీసీలను టీడీపీ గెలుచుకుంది. 27 చోట్ల వైఎస్సార్సీపీ విజయం బీ కొత్తకోట, బెరైడ్డిపల్లె, చంద్రగిరి, చౌడేపల్లె, గంగాధరనెల్లూరు, గంగవరం, గుర్రంకొండ, కేవీ పల్లె, మదనపల్లె, నారాయణవనం, నిమ్మనపల్లె, పెద్దమండ్యం, పెద్దపంజాణి, పీలేరు, పులిచెర్ల, పుంగనూరు, పుత్తూరు, రామసముద్రం, రొంపిచెర్ల, ఎస్ఆర్ పురం, సదుం, తంబళ్లపల్లె, వడమాలపేట, వాల్మీకీపురం, వెదురుకుప్పం, యాదమరి, ఏర్పేడు జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. కలికిరిలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మద్దతుదారు, స్వతంత్ర అభ్యర్థి జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందారు. గీర్వాణీ ఎన్నిక లాంఛనమే... జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా తొలి నుంచి చిత్తూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యురాలు గీర్వాణీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈమె అభ్యర్థిత్వానికి ఒక దశలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అభ్యంతరం వ్యక్తంచేసినా, ఈమె పేరునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. దీంతో జెడ్పీ అధ్యక్షురాలిగా గీర్వాణీ ఎన్నిక లాంఛనమేనని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల షెడ్యుల్ ఇదీ చైర్పర్సన్ పదవికి పోటీ చేసే జెడ్పీటీసీ అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలలోపు చిత్తూరులోని జెడ్పీ హాలులో నామినేషన్లు అందజేయాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 12 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఒంటి గంటకు జెడ్పీటీసీ సభ్యుల్ని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ హాలులోకి అనుమతిస్తారు. తొలుత ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. 3 గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహిస్తారు. వెనువెంటనే వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.