బదిలీలకు తెర
- 25 మంది ఎంపీడీఓలకు స్థానచలనం
- పదోన్నతులు పొందిన 10 మందికి పోస్టింగ్‌లు
- అయిష్టంగానే జెడ్పీ చైర్‌పర్సన్ ఆమోదం
- ఎంపీడీఓల అసంతృప్తి.. మంత్రి హరీశ్‌ను కలిసే యత్నం
సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్‌లో ఎంపీడీఓల బదిలీల వ్యవహారానికి తెరపడింది. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న 25 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే పదోన్నతులపై జిల్లాకు వచ్చిన పది మంది ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీల ఫైల్‌పై జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ అయిష్టంగానే సంతకం చేసినట్లు తెలుస్తోంది. బదిలీల విషయమై జెడ్పీ చైర్‌పర్సన్, సీఈఓ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
మొత్తానికి ఒత్తిడి రావటంతో బదిలీల జాబితాపై ఆమె సంతకం చేసినట్టు తెలుస్తోంది. శివ్వంపేట, జిన్నారం, రామచంద్రాపురం, కొండాపూర్, జిన్నారం మండలాల్లో బదిలీలపై ఆమె కొన్ని సూచనలు చేయగా.. ఆ మార్పులు చేయకుండానే అధికారులు బదిలీ జాబితాను ఆమోదం కోసం బుధవారం సాయంత్రం పంపినట్లు సమాచారం. ఆపై బదిలీ ఉత్తర్వులు వెలువరించారు. మరోపక్క బదిలీలపై ఎంపీడీఓలు సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గురువారం ఉదయం పలువురు ఎంపీడీఓలు నవాబ్‌పేటకు వచ్చిన మంత్రి హరీష్‌రావుకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో శుక్రవారం కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
25 మంది బదిలీ.. పదిమందికి పోస్టింగ్‌లు
దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న 25 మంది ఎంపీడీఓలను బదిలీ చేశారు. పదోన్నతి పొందిన 10 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఫిర్దోస్ అలి-మనూరు, జితేందర్‌రావు-పాపన్నపేట, బి.శ్రీరాములు-కౌడిపల్లి, ఆర్.మల్లేశం-టేక్మాల్, ఎం.ఎ.ముజీబ్-కల్హేర్, పి.బాల-చిన్నశంకరంపేట, రహ్మతుల్లాఖాన్-దుబ్బాక, ఎం.డి.జాఫర్-చిన్నకోడూరు ఎంపీడీఓగా పోస్టింగ్‌లు పొందారు. పదోన్నతి పొందిన జయలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె డీఆర్‌డీఏ ఏపీఓగా ఉన్నారు. బదిలీలు, పోస్టింగ్‌లు ముగిసినా.. ఇంకా రామాయంపేట, చేగుంట, నంగునూరు, తొగుట, అందోలు, చిన్నకోడూరు, రామచంద్రాపురం మండలాల్లో ఎంపీడీఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పారదర్శకంగా బదిలీలు చేపట్టామని సీఈఓ మధు తెలిపారు.