సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లా పరిషత్‌లో అధికారులకు భారీ స్థాయిలో బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పుడున్న వారికి దాదాపు స్థానచలనం కలగనుంది. కాంగ్రెస్ హయాంలో ఉన్న అధికారులందర్నీ మార్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఆ మేరకు జిల్లా పరిషత్‌కు సిఫారసు లేఖలు వెల్లువెత్తుతున్నాయి. ఆశావహులు కూడా అందుకు తగ్గట్టుగా పైరవీలు ప్రారంభించారు. కావల్సినపోస్టింగ్ కోసం ముడుపులు ముట్టజెప్పడానికి సిద్ధమవుతున్నారు.
రంగంలోకి నేతలు: బదిలీలపై నిషేధం ఎత్తివేయడమే తరువాయి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. తమకు కావల్సిన వారిని అనుకూలమైన పోస్టుల్లో నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా పరిషత్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వారినే కాకుండా మండల స్థాయిలో ఉన్న ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీలు, సూపరింటెండెంట్లను బదిలీ చేసే యోచనలో ఉన్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను కూడా కదపాలని నిర్ణయానికొచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారిలో ఎక్కువ మంది షాడో నేతకు అనుకూలంగా వ్యవహరించారని, ఆయన చెప్పినట్టే నడుచుకున్నారని టీడీపీ నాయకులు అనుమానిస్తున్నారు. దీంతో ఎలాగైనా వారిని కదపాలని భావిస్తున్నారు.
జాబితాలు సిద్ధం: ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బదిలీలు చేయవలసిన సిబ్బంది జాబితాలను టీడీపీ నేతలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న జెడ్పీ ఉద్యోగులు, అధికారులు తాము కోరుకున్న పోస్టుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వేర్వేరు మార్గాల ద్వారా టీడీపీ నేతలను ఆశ్రయించి కావలసిన సీటు కోసం పైరవీలు చేసుకుంటున్నారు. కొందరు టీడీపీ నాయకులు కూడా ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు కాసులొచ్చే అవకాశం దొరికిందని ఆనందపడుతున్నారు.
రూ.లక్షల్లో రేటు!: కొంతమందైతే బదిలీల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. ఉద్యోగులు, అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. కోరినంత ఇస్తే మంచి పోస్టులిప్పిస్తామని నమ్మ బలుకుతున్నారు. తాము చెప్పినట్లే జరుగుతుందని భరోసా కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎంపీడీఓ, ఇంజినీరింగ్ స్థాయి పోస్టులకు భారీస్థాయిలో రేటు పలుకుతోంది. రూ.లక్షల్లోనే ముట్టజెప్పేందుకు ఆశావహులు ముందుకొస్తున్నారు. మొత్తానికి బదిలీల నిషేధం ఎత్తివేసిన రోజు నుంచి జెడ్పీ ఉన్నతాధికారులకు సిఫారసులు, ఫోన్‌కాల్స్ తాకిడి ఎక్కువైంది. తాము సూచించిన వ్యక్తులనే తమ మండలాల్లో నియమించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. విశేషమేమిటంటే ఒక మండలం నుంచి రెండేసి, మూడేసి వర్గాలుగా విడిపోయి తమ అనుకూల వ్యక్తుల కోసం జెడ్పీ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.
తీవ్ర పోటీ ఉన్న మండలాలు
ఎంపీడీఓల విషయంలోనైతే విజయనగరం, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, లక్కవరపుకోట, జామి, ఎస్.కోట, గంట్యాడ, కొత్తవలస, వేపాడ, సీతానగరం, రామభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురంలో పోస్టులకు డిమాండ్ బాగా ఉంది. ఇంజినీరింగ్ పోస్టుల విషయంలోనైతే గజపతినగరం, చీపురుపల్లి, గరివిడి, కొత్తవలస, ఎస్‌కోట, డెంకాడ, లక్కవరపుకోట, వేపాడ, సాలూరు, నెల్లిమర్ల, పార్వతీపురం స్థానాలకు విపరీతమైన పోటీ నెలకొంది. అధికార పార్టీ నేతలు ఈ పోటీనే క్యాష్ చేసుకుంటున్నారు. ఆశావహులతో ఒప్పందాలు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు.
బదిలీల వేళ...సిఫారసుల గోల
Published Tue, Aug 5 2014 2:36 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement