సర్కిల్‌ కహానీ! | circle story | Sakshi
Sakshi News home page

సర్కిల్‌ కహానీ!

Published Fri, Sep 23 2016 1:31 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM

సర్కిల్‌ కహానీ! - Sakshi

సర్కిల్‌ కహానీ!

చర్చనీయాంశంగా సీఐల బదిలీలు
– ఫలానా స్టేషన్‌ తనదేనంటూ కొందరి ప్రచారం
– జిల్లా నుంచి రాజధాని స్థాయిలో పైరవీలు
– టీడీపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు
– వారం రోజుల్లో ఉత్తర్వులు?
– లూప్‌లైన్‌లోకి వెళ్లేందుకు ససేమిరా
 
హోంమంత్రి.. చినబాబు.. చిన్నన్న.. సీఐల బదిలీల నేపథ్యంలో ఇప్పుడంతా ఇలాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తమ సామాజిక వర్గం అని ఒకరు.. రాజకీయ అండదండలతో ఇంకొకరు.. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత నమ్ముకొని మరొకరు.. ఎంచుకున్న స్టేషన్‌లో పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫలానా స్టేషన్‌కు తన పేరు సిఫారసు చేస్తానని మాటిచ్చారని ఓ సీఐ చెబుతుంటే.. ఆ సర్కిల్‌కు తనపేరు ఖరారైందనే ప్రచారం మరో సీఐ చేసుకుంటున్నారు. ఇప్పుడే బయటపడటం ఎందుకని.. కొందరి వ్యవహారం లోలోన నడుస్తోంది.
 
కర్నూలు: జిల్లాలోని సీఐల్లో బదిలీ చర్చ జోరుగా సాగుతోంది. సుమారు పది మందికి పైగా సీఐలకు ఈ విడత స్థానచలనం తప్పదనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న నాయకులతో పాటు వారికి సన్నిహితంగా మెలిగే ద్వితీయ శ్రేణి నాయకుల చుట్టూ కొందరు సీఐలు చక్కర్లు కొడుతున్నారు. జిల్లాలో సర్కిళ్లతో కలిపి ఉన్నవి 19.. అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషన్లు 14. సీఐల సంఖ్య ఇంతుకు రెట్టింపు ఉండటంతో పోటీ తీవ్రమైంది. వివిధ ఆరోపణలతో ప్రస్తుతం 14 మంది సీఐలు వీఆర్‌లో ఉన్నారు. వీరంతా తిరిగి స్టేషన్లను దక్కించుకునే ప్రయత్నంలో తలమునకలవుతున్నారు. బదిలీల జాబితా వారం రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
 
లూప్‌లైన్‌లో పని చేయడానికి ససేమిరా..
పోలీసు నిబంధనల ప్రకారం ఎస్‌ఐ నుంచి పదోన్నతి పొందిన సీఐలు రెండేళ్ల పాటు లూప్‌లైన్‌(ఇంటెలిజెన్స్, విజిలెన్స్, సీఐడీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్, రైల్వే, ఏసీబీ, స్పెషల్‌ బ్రాంచ్, డీసీఆర్‌బీ, పోలీసు శిక్షణ కేంద్రం)లో పని చేయాలి. ఇలా పదోన్నతి పొందిన సుమారు 12 మంది సీఐలు సర్కిళ్లలో పని చేస్తున్నారు. అయితే ఎలాంటి రాజకీయ అండదండలు లేని సీఐలు లూప్‌లైన్‌లో ఉండాల్సి వస్తోంది. పనితీరు బాగోలేకపోవడం.. అవినీతి ఆరోపణలు వచ్చాయనే కారణాలతో కొందరు ఇన్‌స్పెక్టర్లను వీఆర్‌కు పంపుతున్నా రాజకీయ పలుకుబడితో మళ్లీ పోస్టింగ్‌లు దక్కించుకోవడం పరిపాటిగా మారింది. పైరవీలు.. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకే పోస్టింగ్‌లు కేటాయిస్తుండటంతో, విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లపై రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
 
పోటీ తీవ్రంగా ఉన్న సర్కిళ్లు
బేతంచెర్ల, ప్యాపిలి, నంద్యాల టూటౌన్, నంద్యాల తాలుకా సర్కిళ్లకు పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం కోడుమూరులో పని చేస్తున్న డేగల ప్రభాకర్‌ కర్నూలు టూటౌన్, వీఆర్‌లో ఉన్న మధుసూదన్‌రావు కర్నూలు ఫోర్త్‌టౌన్, కోసిగిలో పని చేస్తున్న కంబగిరి రాముడు బేతంచెర్ల సర్కిల్‌కు.. ఆళ్లగడ్డకు లక్ష్మయ్య, వీఆర్‌లో ఉన్న రమణ కోసిగికి, 2004 బ్యాచ్‌కు చెందిన శివశంకర్‌ కర్నూలు వన్‌టౌన్‌కు, కర్నూలు పీసీఆర్‌లో ఉన్న విజయకృష్ణ శ్రీశైలంకు, ఆదోని వన్‌టౌన్‌లో ఉన్న రామయ్య నాయుడు నంద్యాల తాలుకాకు.. ఇంటెలిజెన్స్‌ విభాగంలో పని చేస్తున్న శ్రీనివాసరెడ్డి కోవెలకుంట్ల సర్కిల్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతుంది.
 
తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 డిసెంబర్‌ మొదటి వారంలో రేంజ్‌ పరిధిలో 37 మంది సీఐల బదిలీలు జరిగాయి. తమ వారికి తగిన స్థానాలు దక్కలేదనే కారణంతో అప్పట్లో తెలుగు తమ్ముళ్లు బదిలీలకు బ్రేకులు వేయించారు. గతేడాది సెప్టెంబర్‌లో 14 మంది సీఐలు బదిలీ కాగా, అప్పట్లో వీఆర్‌లో ఉన్న పార్థసారథిరెడ్డి, వెంకటరమణకు మాత్రమే పోస్టింగ్‌లు దక్కాయి. ప్రస్తుతం వీఆర్‌లో 14 మంది సీఐలు ఉండటంతో పోటీ తీవ్రమైంది. ఆ బదిలీల్లో కూడా నాయకులు ఇచ్చిన సిఫార్సు లేఖల ఆధారంగానే బదిలీలు జరిగాయి. దీంతో ప్రస్తుతం పోస్టింగ్‌లు ఆశిస్తున్న సీఐలు కూడా నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement