పోలీసు పరువు తీశారు
►అధికార పార్టీ నేతల ఆశ్రయం పొందాల్సిందే..
►లేకుంటే వారానికే బదిలీ!
►ప్రొద్దుటూరులో విచ్చలవిడి పెత్తనం
ప్రొద్దుటూరు : కేవలం తనను ప్రసన్నం చేసుకోలేదనే కోపంతో విధుల్లో చేరిన వారానికే ఏకంగా డీఎస్పీని బదిలీ చేయించారంటే టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఏవిధంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని బట్టి ప్రొద్దుటూరులో శాంతిభద్రతల పరిస్థితి ఏవిధంగా ఉందో కళ్లకు కట్టినట్లు అర్ధమవుతోంది. సాధారణంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు అధికారుల బదిలీలు చేయించడం సహజం. అయితే పోలీసు శాఖకు ఇందులో మినహాయింపు ఉంటుంది. ఏకంగా ప్రస్తుతం డివిజనల్ స్థాయి అధికారినే తనను కలవలేదనే సాకుతో వచ్చిన వెంటనే వెనక్కి పంపడం టీడీపీ పాలనకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
భయపడుతున్న అధికారులు
జిల్లాలో కడప తర్వాత ప్రొద్దుటూరు ప్రధాన కేంద్రం. వ్యాపారవర్గాల ప్రభావం ఎంత ఉందో అంతేస్థాయిలో అసాంఘిక కార్యకలాపాలు కూడా నడుస్తున్నాయి. ప్రొద్దుటూరు ప్రాంతాన్ని చూసి గతంలో చాలామంది అధికారులు ఇక్కడికి బదిలీపై రావాలని కోరుకునే పరిస్థితి ఉండగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అయితే బాబోయ్ మాకొద్దు అనే పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో ఖాళీల భర్తీలో జాప్యం జరుగుతూ వచ్చింది. గత డీఎస్పీ నీలం పూజిత వరకు ఎప్పటికప్పుడు డీఎస్పీలు బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభావం వారిపై పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ వరకు డీఎస్పీగా నీలం పూజిత బాధ్యతలు నిర్వహించారు. పలు సందర్భాల్లో తమ మాట వినలేదని ఆ అధికారిపై కూడా అధికారపార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు.
అప్పట్లో సీఎం తనయుడు లోకేష్‌బాబుపై స్థానిక నేతలు డీఎస్పీని బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆ అధికారి బదిలీ అయి ఆరు నెలలు దాటినా మరో అధికారిని ఇక్కడ ప్రభుత్వం నియమించలేకపోయింది. స్థానిక అధికారపార్టీ నేతల పెత్తనం పెరగడంతోపాటు వారి వర్గ విభేదాలు ఇందుకు ముఖ్యకారణమయ్యాయి. ఇటీవలి కాలంలో ప్రొద్దుటూరు పరిధిలో చోటుచేసుకున్న వరుస హత్యలు, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ఎట్టకేలకు డీఎస్పీగా ఆర్ల శ్రీనివాసులును ఈ నెల 14న నియమించారు. మంచి ప్రాంతమని ఆయన ఎంతో ఆసక్తితో ఇక్కడ విధుల్లో చేరారు.
వారంరోజుల్లోనే తిరుగుముఖం
విధుల్లో చేరి వారంరోజులు కాకమునుపే స్థానిక అధికార పార్టీ నేతలు తమను డీఎస్పీ కలవలేదని స్వయంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాత్రికి రాత్రే ఆదివారం ఆ అధికారికి బదిలీని బహుమానంగా ఇచ్చారు. ఇంతటి కీలకస్థాయి అధికారి పరిస్థితే ఇలావుంటే ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అన్ని స్టేషన్లలో అధికారపార్టీ నేతలు విచ్చలవిడిగా పెత్తనం చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్లలో అధికారపార్టీ అయితే ఓ న్యాయం, ఇతర పార్టీలైతే మరో న్యాయం జరుగుతోంది. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ వినాయకంపై దౌర్జన్యం చేసినా, ఫర్నీచర్ ధ్వంసం చేసినా, రాళ్లు రువ్వినా ఎలాం టి చర్యలు లేవు.
అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారే కానీ, కౌన్సిలర్లు కళ్ల ముందు తిరుగుతున్నా, పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాలు చేసినా అరెస్టు చేయలేకపోయారు. మూడు నెలల తర్వాత వారు తీరిగ్గా అరెస్టు కాకుండా బెయిల్ తెచ్చుకోవడం గమనార్హం. ప్రొద్దుటూరుకు బదిలీపై వస్తున్న అధికారుల వివరాల సమాచారం తెలుసుకునే ముందు వారికి అధికారపార్టీ నాయకుల ఆశీర్వాదం ఉందా లేదా అని ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. వారి ఆశీర్వాదం ఉంటేనే ఇక్కడికి వచ్చి విధులు నిర్వహించే పరిస్థితి ఉంటుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రొద్దుటూరుకు మరో డీఎస్పీని ఎప్పుడు నియమిస్తారో వేచిచూడాల్సి ఉంది.
టీడీపీ నేతలనే డీఎస్పీ సీట్‌లో కూర్చోబెట్టండి
సీఎం ద్వారా జీఓ విడుదల చేయించి ఏకంగా టీడీపీ నేతలనే డీఎస్పీ సీట్‌లో కూర్చోబెడితే సరిపోతుందని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి తెలిపారు. డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు బదిలీ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉంటే టీడీపీ నేతలకు నచ్చడం లేదన్నారు. తమకు సెల్యూట్ చేయాలని, అనుగ్రహం పొందాలని టీడీపీ నేతలు కోరుకోవడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు చరిత్రలో ఎన్నడూ ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొనలేదన్నారు. ఆ ఘనత అధికార పార్టీ నేతలకే దక్కుతుందని విమర్శించారు.