పోలీసులపై టీడీపీ నేతల ఆగడాలు
జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న దౌర్జన్యాలు
పట్టించుకోని ప్రభుత్వం
జిల్లాలోని పోలీసులపై అధికా ర పార్టీ నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెరిగిపోతున్నాయి. దీంతో పోలీసులు బెంబేలెత్తుతున్నారు. వీరితో పడలేక కొందరు ఎస్సైలు, సీఐలు లూప్‌లైన్, వీఆర్(వేకెన్సీరిజర్వ్) లకు వెళ్లడానికి సైతం సిద్ధపడుతున్నారు. టీడీపీ నాయకులకు సలాం చేయడానికే సమ యం మొత్తం సరిపోతోందని వీరు వాపోతున్నారు. వారికి నచ్చకపోతే ధర్నాలు చేసి రచ్చరచ్చ చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి కమిటీ సభ్యుడు వచ్చినా వారికి మర్యాద చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామంటున్నారు.
చిత్తూరు సాక్షి: జిల్లాలో పోలీసులు టీడీపీ అంటే హడలెత్తిపోతున్నారు. అయినదానికీ కానిదానికీ ఈ పార్టీ నాయకులు చేతిలో తాము బాధితులమవుతున్నామని కలవరపడుతున్నారు. అధికార పార్టీలో ఆధిపత్య పోరు కూడా పోలీసులను తమ పని ప్రశాంతంగా చేసుకోనీకుండా చేస్తోంది. ఏ మండలంలో చూసినా రెండు వర్గాలుండటం.. ఆయా వర్గాలు తమ మాటే చెల్లుబాటు కావాలని ఉన్నత స్థాయిలో పైరవీలు చేస్తుండటంతో పోలీసులు టీడీపీ నేతలంటే హడలెత్తుతున్నారు. ఏ వర్గం వారితో చనువుగా ఉంటే ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పని చేయాలంటే స్వామి భక్తి తప్పనిసరని టీడీపీ నాయకులు బహిరంగంగా పోలీసులతో వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది దురుసుగా కూడా ప్రవర్తిస్తున్నారు.
ప్రభుత్వం మౌనం వెనుక...
పోలీసులపై దురుసు ప్రవర్తన ప్రభుత్వానికి తెలిసినా మౌనం దాలుస్తోంది. తమ కార్యకర్తల అడుగులకు మడుగులువత్తాల్సిందేనని ఈ మౌనం వెనుక మర్మం అని తెలుస్తోంది. కార్యకర్తలే తమ బలం అని వారికి పోలీసులతో సహా ఎవరైనా వత్తాసు పలాకాల్సిందేనని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పోలీసులపై పచ్చ రచ్చ తారస్థాయి చేరింది. దీన్ని సహించలేని రక్షకభటులు వీఆర్ లేదా లూప్‌లైన్ పోస్టులుకు వెళ్లడానికి శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇటీవల పాకాల పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడి టీడీపీ నాయకులు ఏకం గా పోలీసులను కర్రలతో చితకబాదారు. ఇంత జరిగినా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు కూడా నమోదు చేయలేదు. పైగా సీఐ చల్లనిదొరను లూప్‌లైన్‌కు పంపిం చారు. ఈ దాడిలో పోలీసులు ప్రాణ భయంతో పరిగులు తీశారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు ఎసై ్స టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించలేదని మండల పరిధిలో చోరీకి గురైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కేసును నమోదు చేయాలనే సాకుతో పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవహారం రెండేళ్ల నాటి మాట. ట్రాన్స్‌ఫార్మర్ల నెపంతో ఎస్సై శ్రీనివాసరావును వీఆర్‌కు పంపించారు.
నిజాయతీ వ్యవహరిస్తున్నాడు, ప్రతిపక్షం నాయకులతో కూడా మంచిగా ఉన్నాడు యదమర్రి ఎస్సై రఘుపతి నాయుడును ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆ మండల టీడీపీ నాయకులు ఎస్బీడీఎస్పీ రామ్‌కుమార్‌పై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. ప్రతిపక్ష కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయడని రామ్‌కుమార్ సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అప్పటినుంచి రఘుపతి నాయుడుకు పై స్థాయి నుంచి ఎలాంటి సమాచారం రాదు. ‘నా పరిస్థితి ఒక గార్డుకంటే అధ్వానంగా తయారైంది’ అని ఆయన వాపోతున్నాడు. ఈ అవమానాలను తట్టుకోలేక ఆయన వీఆర్ వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం.
సీఎం సొంత నియోజకవర్గం రామకుప్పంలో ప్రతిపక్షం కార్యకర్తపై ఓ టీడీపీ నాయకుడు హత్యాయత్నం చేశాడు. ఈ విషయంలో ఎసై ్స పరశురాం టీడపీ నాయకుడిని మందలించాడు. దీంతో ఆ పార్టీ నాయకులు ఆయనపై వ్యక్తిగత దూషనలు చేశారు. కుప్పంలో టీడీపీ నాయకుల మాటనే వినాలి. ఇక్కడ తెలుగుదేశం నాయకులు చెప్పిందే చేయాలి.. లేకపోతే ఉద్యోగం వదులుకొని వెళ్లిపో అని హుకుం జారీ చేశారు.
జిల్లాలోని ప్రతి మండలంలోనూ గల్లీ టీడీపీ కార్యకర్త కూడా ఎసై ్స, సీఐలను బెదిరిస్తున్నారు. ఈ విషయంపై బహిరంగా వ్యాఖ్యానించాలంటేనే వారు భయపడుతున్నారు. దీంతో ఈ ఒత్తిడిని తట్టుకోలేక పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఇంతకుముందు ట్రాన్స్‌ఫర్‌లు జరుగుతున్నాయంటే ఎస్పీ ఆఫీసులో క్యూ కట్టే అధికారులు ఇప్పుడు లూప్‌లైన్‌కు పంపినా భాగ్యమననే భావనలో ఉన్నారు.