recommendation
-
ఆర్థిక నేరగాళ్లకు బేడీలు వేయొద్దు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి బేడీలు వేయరాదని, హత్య, అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన వారితో కలిపి జైలులో ఉంచరాదని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. బేడీలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకోకుండా నిరోధించడానికి, అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది భద్రత కోసమే పరిమితమని వివరించింది. అలాగే, నిందితులను అరెస్టయిన తర్వాత 15 రోజులకు మించి పోలీస్ కస్టడీలో ఉంచరాదన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్)లో నిబంధనపై సవరణలను సూచించింది. -
ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో భారత్
న్యూఢిల్లీ: అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) భావిస్తోంది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పుచేర్పుల కోసం ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘క్లాసికల్ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్టు కమిటీ చైర్పర్సన్ సి.ఇసాక్ తెలిపారు. ‘ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్‌గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఎందుకంటే భారత్ అనే పేరు చాలా పురాతనమైన పేరు. విష్ణుపురాణం వంటి 7 వేల ఏళ్ల నాటి పురాతన గ్రంథాల్లోనే భారత్ పేరును ప్రస్తావించా’ అని ఆయన వివరించారు. అయితే ప్యానల్ సిఫార్సుల అమలుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేశ్ సక్లానీ స్పష్టం చేశారు. అనంతరం ఈ మేరకు సంస్థ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొత్త ప్రతిపాదనలను డొమైన్ నిపుణులు తదితరులకు ఎప్పటికప్పుడు తెలియపరిచి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. అందుకే ఈ అంశంపై ఇప్పుడే ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా అది తొందరపాటు చర్య అవుతుంది’ అని అందులో పేర్కొంది. ‘ఇండియా’ కూటమికి భయపడే: విపక్షాలు కమిటీ సిఫార్సులను విపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ‘చివరికి పాఠ్య పుస్తకాల్లో, సిలబస్‌లో కూడా దేశ చరిత్రను బీజేపీ ఎలా వక్రీకరించాలని చూస్తోందో దీనిని బట్టి మరోసారి రుజువైంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తమ దృష్టిలో ఇండియా, భారత్ పేర్లు రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడం ప్రధాని మోదీని విపరీతంగా భయపెడుతోందనేందుకు ఇది ప్రబల నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. ఎన్డీఏ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కార్ ఇలా పేర్ల మారి్పడి పరంపర కొనసాగిస్తోందని డీఎంకే ఆరోపించింది. ఆర్జేడీ తదితర పార్టీలు కమిటీ సిఫార్సులను తప్పుబట్టాయి. ‘‘విపక్షాలు తమ కూటమి పేరున ‘ఇండియా’ బదులు భారత్‌గా ఇప్పడు మార్చేస్తే మోదీ సర్కార్ వెంటనే దేశం పేరును ‘భారత్’కు బదులు జంబూదీ్వపం అనో మరేదైనా పేరో పెట్టే స్తారా ?’’ అని ఎంపీ మనోజ్ ఝా ఎద్దేవా చేశారు. జీ20 శిఖరాగ్రంతో మొదలు భారత్ పేరు తొలుత ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ఆహ్వాన పత్రికల్లో ప్రత్యక్షమవడం విదితమే. రాష్ట్రపతిని అప్పటిదాకా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’గా సంబోధిస్తుండగా కొత్తగా దానికి బదు లు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఆ ఆహ్వాన పత్రికల్లో మోదీ ప్రభుత్వం పేర్కొంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ సీటు ముందు ఉంచిన నేమ్‌ప్లేట్‌పై ఇండియా బదులు భారత్ అనే రాసి ఉండటం తెల్సిందే. కమిటీ ఏం చెప్పిందంటే... ఎన్సీఈఆర్టీ ఉన్నత స్థాయి కమిటీ చైర్పర్సన్ ఇసాక్ సంఘ్ పరివార్‌కు సన్నిహితుడు. దాని తాలూకు అతివాద సంస్థ అయిన భారతీయ విచార కేంద్రం ఉపాధ్యక్షునిగా ఆయన పని చేశారు. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) సభ్యుడు కూడా. ఎన్సీఈఆర్టీకి కమిటీ చేసిన సిఫార్సులను ఆయన సవివరంగా పేర్కొన్నారు. అవేమిటంటే... ► బ్రిటిషర్లు భారత చరిత్రను ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ మూడు దశలుగా విభజించారు. వీలైనంత వరకూ భారత్ ఘనతలను, సాధించిన ప్రగతిని, శాస్త్రీయ విజయాలను మరుగునపడేశారు. వాటిని తక్కువ చేసి చూపించారు. అందుకే పాఠశాలల్లో మధ్య యుగ, ఆధునిక భారత చరిత్రతో పాటు క్లాసికల్ పీరియడ్ గురించి ఇకమీదట బోధించాలి. ► ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో హిందూ వైఫల్యాలను మాత్రమే ప్రముఖంగా పేర్కొన్నారు. కానీ మొగలులు తదితర సుల్తాన్లపై హిందూ రాజులు సాధించిన విజయాలను మాత్రం ప్రస్తావించలేదు. ► అందుకే మన చరిత్రలో పలు యుద్ధాల్లో హిందూ రాజులు సాధించిన విజయాలకు పాఠ్య పుస్తకాల్లో మరింతగా చోటు కలి్పంచాలి. ► అన్ని పాఠ్యపుస్తకాల్లోనూ ఇండియన్ నాలెడ్జ్ సిస్టం (ఎన్‌కేఎస్)ను కొత్తగా ప్రవేశపెట్టాలి. ► కమిటీలో ఐసీహెచ్ఆర్ చైర్పర్సన్ రఘువేంద్ర తన్వర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ వందనా మిశ్రా, వసంత్ షిందే, మమతా యాదవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్‌తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
కస్టమర్‌కు అనుకూలంగా సేవలు ఉండాలి
ముంబై: బ్యాంకులు కస్టమర్‌కు ప్రాధాన్యం ఇస్తూ, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్బీఐకి ప్యానెల్ సిఫారసు చేసింది. మరణించిన ఖాతాదారు వారసులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతించాలని, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్ తదితర సూచలను ప్యానెల్ చేసిన వాటిల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంకుకు సంబంధించి ఏ శాఖలో అయినా, ఏ నెలలో అయినా సమర్పించేందుకు అనుమతించాలని, దీనివల్ల రద్దీని నివారించొచ్చని పేర్కొంది. ఆర్బీఐ నియంత్రణలోని సంస్థల పరిధిలో వినియోగదారు సేవా ప్రమాణాల సమీక్షపై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. గతేడాది మే నెలలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో అద్యక్షతన ఈ కమిటీని నియమించడం గమనార్హం. సూచనలు.. ఇంటి రుణాన్ని తీర్చివేసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తిరిగి రుణ గ్రహీతకు స్వాధీనం చేసే విషయంలో నిర్ధేశిత గడువు ఉండాలి. గడువులోగా ఇవ్వకపోతే బ్యాంక్/ఎన్బీఎఫ్సీపై జరిమానా విధించాలి. డాక్యుమెంట్లు నష్టపోతే, వాటిని తిరిగి పొందే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు అయ్యే వ్యయాలను బ్యాంకులే పెట్టుకోవాలి. కస్టమర్లకు సంబంధించి రిస్క్ కేటగిరీలను సూచించింది. వేతన జీవులు అయితే వారికి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, వారిని హై రిస్క్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులను తక్కువ రిస్క్ వారిగా కేటాయించొచ్చని సూచించింది. కస్టమర్లతో వ్యవహారాలు నిర్వహించే సిబ్బంది, వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా నిర్ణీత కాలానికోసారి తప్పనిసరి శిక్షణ పొందాలని కూడా పేర్కొంది. -
మీ వారసున్ని సిఫార్సు చేయండి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం జస్టిస్ రమణకు లేఖ రాసింది. ఆయన పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుంది. పదవీ విరమణ చేసే సీజేఐ తన వారసునిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సూచించడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా ఎంపికైతే రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. -
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేతకి నో!
ఆప్ సర్కార్ వర్సెస్ ఎల్జీ మరోసారి తెర మీదకు వచ్చింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఒక ప్రతిపాదనతో పాటు కొవిడ్ ఆంక్షల్ని సవరించాలన్న విజ్ఞప్తిని సైతం ఆయన తోసిపుచ్చారు. కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ తేల్చేశారు. అయితే 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి మాత్రం ఎల్జీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఎల్జీ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారంగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని రీజియన్‌లో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతూ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది. ఇదిలా ఉంటే కర్ణాకటలో ఓపక్క వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయగా.. తమిళనాడులో వీకెండ్లో పూర్తిగా లాక్డౌన్, మిగతా రోజుల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. -
ఏడాది కాలానికి 8 మిడ్ క్యాప్స్!
ప్రభుత్వ చర్యలు, కేంద్ర బ్యాంకుల ప్యాకేజీలు కలగలసి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో తాజాగా అమెరికన్ ఇండెక్స్ నాస్డాక్ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇందుకు వీలుగా మార్చి కనిష్టం నుంచి 45 శాతం ఎగసింది. ఈ బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం మార్చి 23న నమోదైన కనిష్టం నుంచి 34 శాతం ర్యాలీ చేశాయి. దీంతో బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 31 శాతం పురోగమించింది. కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించడంతో మార్చి నెలలో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. అయితే పలు దేశాలు భారీ స్థాయిలో లిక్విడిటీని పంప్చేయడంతో నెల రోజుల్లోనే మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. మధ్యలో కొంతమేర ఆటుపోట్లు చవిచూసినప్పటికీ గత రెండు వారాలుగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ పరుగు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకింగ్ సంస్థలు 8-12 నెలల కాలానికి కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లను సూచిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. యూపీఎల్ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఇటీవల కొంతమేర నికర రుణ భారాన్ని తగ్గించుకుంది. కంపెనీ పనితీరుపై లాక్‌డవున్ ప్రభావం తక్కువే. రూ. 630 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యూపీఎల్ షేరు రూ. 426 వద్ద ట్రేడవుతోంది. సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాంలో కంపెనీ అతిపెద్ద తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. కోవిడ్-19 పెద్దగా ప్రభావం చూపలేదు. కాఫీకి డిమాండ్ కొనసాగుతోంది. సప్లై చైన్ మెరుగుపడనుంది. ఇకపైనా ప్రొడక్టులకు పటిష్ట డిమాండ్ కనిపించనుంది. రూ. 315 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సీసీఎల్ ప్రొడక్ట్స్ షేరు రూ. 226 వద్ద ట్రేడవుతోంది. -ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ పీఐ ఇండస్ట్రీస్ పటిష్ట ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలను కలిగిన కంపెనీ 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. ఆశావహ రుతుపవనాల కారణంగా మార్జిన్లు మెరుగుపడే వీలుంది. అగ్రికెమికల్స్తోపాటు ఇతర విభాగాలలోనూ విస్తరిస్తోంది. రూ. 1840 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీఐ ఇండస్ట్రీస్ షేరు 1620 వద్ద ట్రేడవుతోంది. గుజరాత్ గ్యాస్ గత కొన్నేళ్లలో కొత్తగా 12వరకూ జిల్లాలలో కార్యకలాపాలు విస్తరించింది. రౌండ్ 9,10లో భాగంగా 7 కొత్త ప్రాంతాలలో హక్కులను సొంతం చేసుకుంది. తద్వారా మరో 5-7ఏళ్లపాటు సిటీగ్యాస్ పంపిణీలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన కంపెనీగా కొనసాగనుంది. చౌక ఎల్ఎన్జీ ధరలు, నియంత్రణ సంస్థల మద్దతుతో అమ్మకాల పరిమాణం పెరిగే వీలుంది. రూ. 315 టార్గెట్ ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో గుజరాత్ గ్యాస్ షేరు రూ. 292 వద్ద కదులుతోంది. -సెంట్రమ్ బ్రోకింగ్ టాటా కన్జూమర్ దేశీ వినియోగ రంగ వేగాన్ని అందిపుచ్చుకునే సన్నాహాల్లో ముందుంది. ఇందుకు వీలుగా టాటా కెమికల్స్ నుంచి కన్జూమర్ బిజినెస్‌ను విడదీసి విలీనం చేసుకుంది. తద్వారా టాటా కన్జూమర్గా ఆవిర్భవించింది. పటిష్ట బ్యాలన్స్‌షీట్, బ్రాండ్లు, క్యాష్‌ఫ్లో, బలమైన యాజమాన్యం వంటి అంశాలు కంపెనీకి సానుకూలం. రూ. 431 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం టాటా కన్జూమర్ షేరు రూ. 384 వద్ద ట్రేడవుతోంది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గతేడాది పటిష్ట పనితీరు చూపింది. ముఖ్యమైన డీల్స్‌ను సైతం గెలుచుకుంది. డిజిటల్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందునిలిచే అవకాశముంది. తద్వారా ఈ ఏడాది సైతం మెరుగైన పనితీరు చూపనుంది. రూ. 2060 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేరు రూ. 1897 వద్ద కదులుతోంది. -మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ కెమికల్ బిజినెస్‌లో కంపెనీకి పట్టుంది. ప్రధానంగా ఫ్లోరోకెమికల్స్ విభాగం అదనపు బలాన్నిస్తోంది. పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యం ద్వారా ఫ్లోరోకెమికల్స్ అప్లికేషన్స్‌లో అగ్రభాగాన నిలుస్తోంది. తద్వారా అవకాశాలను ముందుగానే అందిపుచ్చుకుంటోంది. రూ. 4,000 టార్గెట్ ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్ఆర్ఎఫ్ షేరు రూ. 3,660 వద్ద కదులుతోంది. ఆస్ట్రల్ పాలీటెక్నిక్ ఈ ఏడాది తొలి రెండు నెలల్లో(జనవరి, ఫిబ్రవరి) కంపెనీ చూపిన వృద్ధి అంతర్గత పటిష్టతను చూపుతోంది. లాక్‌డవున్ తదుపరి పీవీసీ పైపుల పరిశ్రమలో కన్సాలిడేషన్‌కు దారిచూపవచ్చు. భవిష్యత్‌లో పరిశ్రమను మించి వేగవంత వృద్ధిని సాధించే వీలుంది. కంపెనీకున్న సామర్థ్యం రీత్యా మార్కెట్ వాటాను మరింత పెంచుకునే అవకాశముంది. రూ. 1100 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఆస్ట్రల్ పాలీ షేరు 898 వద్ద ట్రేడవుతోంది. -ఎడిల్వీజ్ బ్రోకింగ్ -
బేర్ గుప్పిట్లో చిక్కని ఏడు షేర్లు!
డౌన్‌ట్రెండ్ మార్కెట్లో బుల్ షేర్లను పసిగట్టడం కాస్త కష్టమే కానీ అసాధ్యం కాదంటున్నారు నిపుణులు. సూచీలు బాటమ్ అవుట్ అవుతున్న దశలో మంచి ప్రదర్శన చూపే షేర్లు తర్వాత మూడేళ్లకాలంలో ర్యాలీని ముందుండి నడిపిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం అలా సూచీల డౌన్‌ట్రెండ్‌లో స్థిర ప్రదర్శన చేస్తున్న ఏడు షేర్లను ఐసీఐసీఐ డైరెక్ట్ గుర్తించి సిఫార్సు చేస్తోంది. వీటిలో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, సింజెన్ ఇంటర్నేషనల్, డా.లాల్పాథ్ల్యాప్స్, నవిన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, ఇండియా సిమెంట్స్ ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఇవి దాదాపు 19- 24 శాతం రాబడినిస్తాయన్నారు. ఎన్ఎస్ఈలో లిస్టయిన 918 స్టాకుల ప్రదర్శనను, సాంకేతికాంశాలను పరిశీలించి ఈ సిఫార్సు చేసినట్లు తెలిపింది. టెక్నికల్ విశ్లేషణలో భాగంగా ధర నిర్మాణ విశ్లేషణ, ఆర్ఎస్ఐ, డౌథియరీ సంకేతాలు తదితరాలను పరిశీలించినట్లు బ్రోకరేజ్ తెలిపింది. దీనికితోడు ఈ కంపెనీల వ్యాపార నమూనా బాగుందని తెలిపింది. -
కోవిడ్-19 : నీతిఆయోగ్ కీలక సూచనలు..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 తీవ్రత వృద్ధులపై అధికంగా ఉంటుందని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని నీతిఆయోగ్ సభ్యులు వీకే పాల్ సూచించారు. కోవిడ్-19 తీవ్రత, మరణాల రేటు వయసు పైబడిన వారిలో అధికంగా ఉంటుందని గణాంకాలు వెల్లడిస్తున్న క్రమంలో ఎట్టిపరిస్ధితుల్లో పెద్దలను మనం కాపాడుకోవాల్సి ఉందని కరోనా వ్యాప్తి కట్టడికి ఏర్పాటైన కమిటీకి నేతృత్వం వహిస్తున్న పాల్ అన్నారు. సీనియర్ సిటిజన్ల బాగోగులపై మనం ఈ సమయంలో ప్రత్యేకంగా దృష్టిసారించాలని, కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వారిని జాగ్రత్తగా చూసుకోవాలని పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రజలు చ్యవన్‌ప్రాశ్, తులసి, దాల్చినచెక్క, మిరియాలను తీసుకోవాలని సూచించారు. కాగా కరోనా వ్యాప్తితో భారత్ ప్రస్తుతం సంక్లిష్ట సవాల్‌ను ఎదుర్కొంటోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. చదవండి : కోవిడ్-19 : అధిక మరణాలు అందుకే.. -
‘అర్జున’కు సిక్కి రెడ్డి పేరు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ‘అర్జున అవార్డు’కు సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిక్కి రెడ్డి పేరును ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ నామినేట్ చేశారు. ఇటీవలే గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న సిక్కి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్య పతకం సాధించింది. -
ప్రధాని సిఫార్సునూ పక్కనపెట్టారు
సాక్షి, కాన్పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ సిఫార్సు చేసినా యూపీలోని కాన్పూర్‌కు చెందిన కార్పెంటర్ సందీప్ సోనీకి రుణం మంజూరు చేయకుండా బ్యాంకర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. సోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రుణం కోసం 2016లో ప్రధాని సాయం కోరారు. భగవద్గీత శ్లోకాలను చెక్కపై సోనీ చెక్కిన తీరును మెచ్చుకున్న మోదీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద అతనికి రుణం మంజూరు చేయాలని అధికారులకు స్వయంగా సిఫార్సు చేశారు. అయితే రుణం కోసం బ్యాంకు అధికారులు తనను తిప్పుకుంటున్నారని ఫిర్యాదు చేస్తూ సోని ప్రస్తుతం ప్రధానికి లేఖ రాశారు. ఏడాది పాటు రుణం కోసం తిప్పుకున్న బ్యాంకు అధికారులు రూ 10 లక్షలతో వ్యాపారం ప్రారంభించాలని చెబుతున్నారని, తాను కోరిన రూ 25 లక్షల రుణం మంజూరు చేయడం లేదని వాపోయారు. రూ 25 లక్షలతో తన ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉండగా కేవలం రూ 10 లక్షలే రుణం ఇవ్వడంతో తన పనులు ఆగిపోయాయని, బ్యాంకులు రోజుకో నిబంధనతో తనను వేధిస్తున్నాయని సోని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుంటే తన ఇబ్బందులు తొలగిపోతాయని సోని ఆశిస్తున్నారు. -
లంచావతారం అయితేనేం!
- నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు - టీడీపీ పాలనలో అవినీతి అధికారులకు అందలం! - అధికారి పార్టీ నేతల సిఫార్సులతో పోకల్ స్థానాల్లో పోస్టింగులు - ఏసీబీ అధికారులకు పట్టుబడినా.. అవినీతి కేసులు ఉన్నా పట్టని వైనం కర్నూలు(అగ్రికల్చర్): మూడేళ్ల క్రితం కర్నూలుకు 40 కిలో మీటర్ల దూరంలోని ఓ మండలానికి ఆయన ఇన్చార్జీ తహసీల్దారుగా ఉన్నారు. అదే మండలానికి చెందిన రైతుకు పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయడానికి లక్షల రూపాయాలు లంచం డిమాండ్ చేశారు. కర్నూలులోని తన నివాసంలో రైతు నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టీడీపీ నేతల అండదండలతో బదిలీల్లో ఆయనకు కీలకమైన శాఖలో ముఖ్యమైన పోస్టును కట్టబెట్టారు. నాలుగేళ్ల క్రితం పోకల్ మండలానికి తహసీల్దార్‌గా ఉండి.. ప్రభుత్వ స్థలాలను పప్పులు పంచినట్లుగా పంపిణీ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం ఆ తహసీల్దార్‌ను అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులపైకి కుక్కలను వదిలిన ఘన చరిత్ర ఆ అధికారిది. రిమాండ్‌లో భాగంగా జైలులో కూడా ఉన్నారు. తర్వాత పెండింగ్ ఎంక్వైరీ కింద తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. లూప్లైన్లో అప్రధాన్య పోస్టుల్లో నియమించాల్సి ఉంది. అయితే టీడీపీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటం, డబ్బులు ముట్టచెప్పడంతో ఒక ముఖ్యమైన మండలానికి తహసీల్దారుగా నియమించారు. ప్రస్తుతం అంతకంటే పోకల్గా గుర్తింపు ఉన్న మండలంలో ఉన్నారు. రాజకీయ అండదండలు ఉండడంతో కర్నూలు మండలానికి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పై రెండు ఉదాహరణలే కాదు..జిల్లాలో ఇలాంటివి ఎన్నో.. తెలుగుదేశం పాలనలో అవినీతి అధికారులకు అందలం వేస్తున్నారని చెప్పేందుకు నిదర్శనాలుగా నిలిచాయి. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా.. టీడీపీ నేతల సిఫార్సులతో సదరు అధికారులను కీలక పోస్టుల్లో నిమిస్తున్నారు. వారు యథావిధిగా అవినీతి కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా.. వారిని కీలకమైన పోస్టుల్లో నియమించరాదనే నిబంధన ఉంది. లూప్లైన్లో అప్రధాన్యపు పోస్టుల్లో నియమించాల్సి ఉంది. ఇటీవల జరుగుతున్న బదిలీల్లో ఈ నిబంధను పక్కపెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలు, పైరవీలు చేస్తే ఏసీబీ కేసుల్లో చిక్కుకున్నా పోకల్ పోస్టులు వస్తాయి. అవినీతి కేసుల్లో చిక్కుకున్న వారు నేడు కీలక పోస్టుల్లో ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఏసీబీ కేసులు ఉన్న వారిని లూప్లైన్లో ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించేవారు. దీనిని పక్కన పెట్టి అధికార పార్టీ నేతలే లంచావతారులను కీలక పోస్టుల్లో నియమించడానికి సహకరిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల అండదండలు లేకపోతే కీలక పోస్టులు దక్కే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. సహకరించినందుకు టీడీపీ నేతలకు కూడా భారీగా నజరానాలు ముడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇవీ ఉదాహరణలు... - నీటిపారుదల శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక యూనిట్లో ముఖ్యమైన పోస్టులో పనిచేస్తున్న ఆయన కర్నూలులో ఖరీదైన కాలనీలో నివాసం ఉండే వారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మూడేళ్ల క్రితం అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఆయన నివాసం, బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. తర్వాత నిబంధనల ప్రకారం ప్రాధాన్యత లేని పోస్టులో నియమించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కీలకమైన పోస్టులో నియమించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. అధికార పార్టీ నేతల సిఫార్సులతో అమరావతిలో కీలకమైన కార్యాలయంలో అతి ముఖ్యమైన పోస్టులో ఇతనిని నియమించారు. - విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఒక ముఖ్యమైన డివిజన్ ఆపరేషన్స్ ఆయన పనిచేస్తున్నారు. పొరుగు జిల్లాలో తొమ్మిదేళ్ల క్రితం ఏడీఈగా పని చేస్తున్నప్పుడు ఒక డాబాకు అక్రమంగా విద్యుత్ వాడుతున్నారని కేసు నమోదు చేశారు. డాబా యజమానిపై పెట్టిన కేసు తొలగించేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. తర్వాత ఈయనను లూప్లైన్లో నియమించాల్సి ఉండగా.. కీలకమైన ఆపరేషన్స్ డీఈగా నియమించారు. ప్రస్తుతం పోకల్ స్థానంలో ఆపరేషన్స్ డీఈగా పనిచేస్తున్నారు. - 2014లో కర్నూలుకు 50 కిలో దూరంలో ఒక డీలరు నుంచి లంచం తీసుకుంటూ ముగ్గురు రెవెన్యూ అధికారులు ఏసీబీకి దొరికి పోయారు. ప్రాధాన్యాత లేని పోస్టులో నియమించాల్సి ఉండగా నంద్యాల డివిజన్లోని ఓ తహసీల్దారు కార్యాలయంలో కీలకమైన పోస్టులో పనిచేస్తున్నారు. కీలక స్థానాల్లో చక్రం తిప్పుతూ.. అవినీతి కేసుల్లో ఉన్న అధికారులు మళ్లీ కీలక పోస్టులు సంపాదించి చక్రం తిప్పుతిన్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రెవెన్యూ, విద్యుత్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, నీటిపారుదల, సర్వే సెటిల్మెంటు, ల్యాండ్ రికార్డ్స్ విభాగాలు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ విభాగాల్లో పనిచేస్తున్న వారే ఎక్కువగా లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు. ఏసీబీ కేసుల్లో చిక్కుకున్న వారికి నిర్ణీత గడువు తర్వాత మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతల అండదండలతో వీరు కీలకమైన స్థానాల్లో చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నేతల చేతుల్లో లాఠీ
ఇన్స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం? – సిఫారసు లేఖ ఉన్న వారికే పోస్టింగులు – 15 మంది సీఐలకు స్థానచలనం కలిగే అవకాశం - ప్రాధాన్యత కలిగిన సర్కిళ్లకు పోటీ - నాయకుల చుట్టూ కొందరి ప్రదక్షిణ – బదిలీల జాబితా వారం రోజుల్లో బయటకు వచ్చే అవకాశం కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీల చర్చ జోరుగా సాగుతోంది. సుమారు 15 మందికి పైగా సీఐలకు ఈ విడత స్థానచలనం తప్పనిసరి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులతో పాటు వారికి సన్నిహితంగా మెలిగే ద్వితీయ శ్రేణి నాయకుల చుట్టూ కొందరు ఇన్స్పెక్టర్లు చక్కర్లు కొడుతున్నారు. జిల్లాలో సర్కిళ్లతో కలిపి ఉన్నవి 19, అప్‌గ్రేడ్ సర్కిళ్లు 14. ఇన్స్పెక్టర్ల సంఖ్య ఇందుకు రెట్టింపు ఉండటంతో పోటీ తీవ్రమయ్యింది. వివిధ ఆరోపణలతో ప్రస్తుతం 12 మంది ఇన్స్పెక్టర్లు వీఆర్‌లో ఉన్నారు. వీరంతా తిరిగి స్టేషన్ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు ఆదేశాల మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణతో చర్చించి బదిలీల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చర్చ జరుగుతోంది. మరో వారం రోజుల్లో బదిలీల జాబితా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రాధాన్యత కలిగిన సర్కిళ్ల కోసం ఇన్స్పెక్టర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. మొదటి నుంచీ తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 డిసెంబర్ మొదటి వారంలో నియోజకవర్గ పరిధిలో 37 మంది సీఐలకు బదిలీలు జరిగాయి. తమ వారికి తగిన స్థానాలు దక్కలేదనే కారణంతో తెలుగు తమ్ముళ్లు అప్పట్లో బ్రేకులు వేయించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో 14 మంది, అక్టోబర్ మొదటి వారంలో 16 మంది ఇన్స్పెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉంది. ఈ బదిలీల్లో కూడా నాయకులు ఇచ్చిన సిఫారసు లేఖల ఆధారంగానే జాబితా సిద్ధమైనట్లు సమాచారం. పోస్టింగులు ఆశిస్తున్న ఇన్స్పెక్టర్లు మరికొంత మంది నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బదిలీల్లో వీఆర్‌లో ఉన్న సుమారు 9 మందికి పోస్టింగులు దక్కిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీఆర్‌లో ఉన్న పలువురు ప్రాధాన్యత కలిగిన సర్కిళ్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల సిఫారసు లేఖల కోసం ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారనే చర్చ సాగుతోంది. రెండేళ్లు పూర్తయిన వారికి బదిలీల్లో ప్రాధాన్యత రెండేళ్ల పాటు ఒకే సర్కిల్లో పనిచేసిన ఇన్స్పెక్టర్లకు బదిలీ తప్పదనే చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత కలిగిన సర్కిళ్ల కోసం ఇన్స్పెక్టర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఏళ్ల తరబడి లూప్‌లైన్ పోస్టుల్లో ఉన్న ఇన్స్పెక్టర్లు కూడా సర్కిళ్లను దక్కించుకునేందుకు అధికారులపై ఒత్తిడి చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం డీసీఆర్బీలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా కర్నూలు వన్‌టౌన్ పోస్టింగ్ వేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం శ్రీశైలంలో పనిచేస్తున్న సీఐ పార్థసారధితో పాటు మరో ఇద్దరు శ్రీశైలం సర్కిల్‌ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. వన్‌టౌన్‌లో పనిచేస్తున్న కృష్ణయ్య కోసిగి సర్కిల్లో పాగా వేసేందుకు ఆ ప్రాంత నాయకుల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. శిరివెళ్లలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి నంద్యాల తాలూకాకు, అక్కడున్న మురళీధర్‌రెడ్డి ఆళ్లగడ్డ సర్కిల్‌కు బదిలీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి టీటీడీ విజిలెన్స్ విభాగానికి నియమితులైనట్లు సమాచారం. నంద్యాల వన్‌టౌన్‌లో పనిచేస్తున్న ప్రతాప్‌రెడ్డి ఏసీబీకి, ఆదోని పీసీఆర్‌లో ఉన్న శ్రీనివాసమూర్తి శ్రీశైలం, కర్నూలు ఎస్బీ–2లో ఉన్న ములకన్న నంద్యాల వన్‌టౌన్‌కు, కర్నూలు తాలూకాలో పనిచేస్తున్న నాగరాజు యాదవ్‌ను నందికొట్కూరుకు అధికార పార్టీ నేతలు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. బదిలీల్లో భాగంగా వారికి ఆయా సర్కిళ్లు దక్కే అవకాశముంది. వీఆర్‌లో ఉన్న చక్రవర్తి కూడా అధికార పార్టీ నేతల ఆశీస్సులతో ప్రాధాన్యత కలిగిన సర్కిల్‌కు నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
చిచ్చురేపిన సిఫారస్ లేఖ
– జామియా మసీదు కార్యవర్గం ఎంపిక వాయిదా –రెండువర్గాల మధ్య విభేదాలు –కారణమైన కోడుమూరు ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు కోడుమూరు: పట్టణంలోని జామియా మసీదు కార్యవర్గం ఎంపికపై అనాలోచితంగా ఎమ్మెల్యే సిఫారస్ లేఖ ఇచ్చి రెండు వర్గాల మధ్య చిచ్చురేపాడు. ముస్లిం మత పెద్దల ఒప్పందంతో కోడుమూరు పట్టణానికి చెందిన జబ్బార్‌హుసేన్ 13ఏళ్ల నుంచి జామియా మసీదుకు ముతవల్లిగా కొనసాగుతున్నాడు. మరోవర్గానికి చెందిన డాక్టర్ షాకీర్అహమ్మద్ జామియా మసీదుకు ముతవల్లిగా కొనసాగేందుకు పోటీకి దిగాడు. జబ్బార్‌హుసేన్ 13ఏళ్లుగా మసీదు అభివృద్ధిని పట్టించుకోలేదు, ఇతరులకు అవకాశమివ్వాలని డాక్టర్ షాకీర్అహమ్మద్ పోటీకి దిగడంతో కార్యవర్గం ఎంపిక సమస్యగా మారింది. ఈ విషయంపై ఎమ్మెల్యే మణిగాందీ జోక్యం చేసుకుని జబ్బార్హుసేన్ను ముతవల్లిగా కొనసాగించాలని 2016మే 19న స్టేట్ వక్ఫ్‌బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు సిఫారస్ లేఖ ఇచ్చారు. దాని ఆధారంగా జబ్బార్హుసేన్ను ముతవల్లిగా కొనసాగించాలని మే 30న అబ్దుల్‌ఖాదీర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మరికొందమంది రాజకీయ నేతలు ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకురావడంతో జబ్బార్‌హుసేన్ స్థానంలో షాకీర్అహమ్మద్ను నియమించాలని మరో లేఖను వక్ఫ్‌బోర్డుకు పంపారు. దీంతో అధికారులు తీవ్ర గందరగోళానికి గురై కార్యవర్గ ఎంపికను నిలుపుదల చేశారు. దీంతో ముస్లింల మధ్య విభేదాలు తలెత్తి కార్యవర్గం ఎంపిక శాంతిభద్రతల సమస్యగా మారింది. ముందస్తు జాగ్రత్తగా సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐ మహేష్‌కుమార్ ఇరువర్గాలను పిలిపించి రాజీ చేసి కార్యవర్గ ఎంపిక సజావుగా జరిగేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసినా పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే అనాలోచితంగా ఇరువర్గాలకు సిఫారస్ లేఖ ఇవ్వడంతోనే ముస్లి ల మధ్య వర్గ విభేదాలు వచ్చాయని కోడుమూరు పట్టణ ముస్లిం ఏక్బాల్ ఆరోపించాడు. ఈనెల 25న కోడుమూరులో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తికి ఎమ్మెల్యే మణిగాంధీపై ఫిర్యాదు చేసేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ఆ రోజు నిరసన తెలియజేసి సమస్యను డిప్యూటీ సీఎం దష్టికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
‘కబాలి’ టిక్కెట్ల కోసం మంత్రుల రికమండేషన్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా చూడడం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టిక్కెట్లు కొనుగోలు కూడా పెద్ద సెన్సేషన్ సృష్టించింది. తమిళనాడులో సినిమా టిక్కెట్ల కోసం ఆయన అభిమానులు మంత్రలు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లెటర్లు తెచ్చుకుంటున్నారు. భారత దేశంలో శుక్రవారం విడుదల కానున్నది. -
పైరవీలకే ప్రాధాన్యం
ఏలూరు రూరల్ : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల నియామకం పరాకాష్టకు చేరింది. అనుభవం ప్రాతిపదికన చేపట్టాల్సిన నియామకం కాస్తా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో పూర్తయ్యాయి. సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రికమండేషన్‌తో ఓ కార్యదర్శి నియామకాన్ని అందుకున్నట్టు సమాచారం. ఈనెల 14న ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యదర్శుల కౌన్సెలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుకు పలువురు పోటీ పడ్డారు. తమస్థాయికి తగ్గట్టు స్థానిక ప్రజాప్రతినిధుల రికమండేషన్ తెచ్చుకున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి సత్యనారాయణ అనే వ్యక్తి తీసుకొచ్చిన సిఫార్సులు చూసి తోటి కార్యదర్శులు అవాక్కయ్యారని తెలిసింది. సాక్షాత్తూ హోంమంత్రి రికమండేషన్‌తో వచ్చినట్టు తె లిసి ఈ పోస్టు కోసం పోటీపడిన కార్యదర్శులు తోక ముడిచారు. ఇలా ఎవరికి వారు తమ అధికార బలాన్ని చూపించుకుంటూ పోస్ట్టులను అందుకున్నారు. అధికార, అంగబలం లేని కార్యదర్శులు కాసులతో పని చేసుకుపోతున్నారని తెలిసింది. జాయినింగ్‌లకు మోకాలడ్డు తమ ప్రమేయం లేకుండా బదిలీపై వచ్చి చేరుతున్న కార్యదర్శులకు స్థానిక ఎమ్మెల్యేలు మోకాలడ్డుతున్నారు. తమ అనుమతి లేకుండా విధుల్లో చేరడాన్ని ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు ముందుగానే కార్యదర్శులు తమను కలుసుకోనందున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియామకాన్ని పక్కన పెట్టాలంటూ ఎంపీడీవోలను ఆదేశిస్తున్నారు. దీంతో విధుల్లోకి చేరేందుకు ప్రయత్నించిన పలువురు కాార్యదర్శులు బిక్కమొహం వేస్తున్నారు. దెందులూరు, ఏలూరు నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న పంచాయతీల్లో చేరేందుకు వచ్చిన కార్యదర్శులు చోటా నాయకులతో కలిసి వెళ్లి ఎమ్మెల్యేలను కలుసుకుంటున్నారు. త్వరలో 30 మంది రాక ఈ నెల 14న కార్యదర్శుల కౌన్సెలింగ్ ముగియడంతో భర్తీపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యదర్శులతో పాటు ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు ఉత్తర్వుప్రతులను ఆన్లైన్లో అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన 30 మంది కార్యదర్శులు కొద్దిరోజుల్లో విధుల్లో చేరే అవకాశం ఉంది. వీరు తమ ప్రాంతాల్లో రిలీవ్ అయిన తర్వాత 15 రోజుల్లోపు బాధ్యతలు స్వీకరించాలి. గురువారం పలువురు రిపోర్ట్ చేశారు. -
లా యూనివర్సిటీలో కోర్సుల రద్దుకు సిఫారసు
న్యూఢిల్లీ: ఢిల్లీ లా యూనివర్సిటీలోని కోర్సులను రద్దు చేయాల్సిందిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ప్యానల్‌కు లీగల్ ఎడ్యుకేషనల్ కమిటీ సిఫారసు చేసింది. రాజస్థాన్ రిటైర్డ్ జడ్జి వి.ఎస్ దేవ్ నే తృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం ఈ మేరకు నివేదికను అందించింది. ‘దేశంలో న్యాయ విద్యకు సంబంధించి ఇదే అత్యున్నత విభాగం. క్యాంపస్ లా సెంటర్ మూసి ఉండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలా ఐతే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుంది. యూనివర్సిటీకి చెడ్డ పేరు వస్తుంది’ అని తనిఖీ సందర్భంగా కమిటీ అభిప్రాయపడింది. విద్యా ప్రమాణాలు పాటించడంలో యూనివర్సిటీ అథారిటీ పూర్తిగా విఫలమైందని కమిటీ తేల్చింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఆగస్టు నాటికి అన్నింటిని సరిదిద్దుకోవాలని సూచించింది. విశ్వవిద్యాలయం తన మూడు సెంటర్లకి అఫిలియేషన్ పొడిగించుకోవటంలో విఫలమైందని, వెంటనే అక్కడి కోర్సులను రద్దు చేయాలని తనిఖీ బృందం సూచించింది. గతంలో ఢిల్లీ హైకోర్టు బీసీఐ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు, వసతులు కల్పించాల్సిందిగా యూనివర్సిటీని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న భ వనాలు సరిపోవటం లేదని వర్సిటీ తెలిపింది. కొత్త వాటిలోకి మారాల్సి ఉందని, తరగతి గదుల కొరత ఉందని ఆ సందర్భంగా యూనివర్సిటీ హైకోర్టుకు తెలిపింది. లీగల్ కమిటీ తమ తనిఖీల ద్వారా వర్సిటీలో పర్మినెంట్ అధ్యాపకుల కొరత ఉందని, డీన్ పనితీరు కూడా సరిగా లేదని వెల్లడైనట్టు పేర్కొంది. -
బదిలీల వేళ...సిఫారసుల గోల
సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లా పరిషత్‌లో అధికారులకు భారీ స్థాయిలో బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పుడున్న వారికి దాదాపు స్థానచలనం కలగనుంది. కాంగ్రెస్ హయాంలో ఉన్న అధికారులందర్నీ మార్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఆ మేరకు జిల్లా పరిషత్‌కు సిఫారసు లేఖలు వెల్లువెత్తుతున్నాయి. ఆశావహులు కూడా అందుకు తగ్గట్టుగా పైరవీలు ప్రారంభించారు. కావల్సినపోస్టింగ్ కోసం ముడుపులు ముట్టజెప్పడానికి సిద్ధమవుతున్నారు. రంగంలోకి నేతలు: బదిలీలపై నిషేధం ఎత్తివేయడమే తరువాయి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. తమకు కావల్సిన వారిని అనుకూలమైన పోస్టుల్లో నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా పరిషత్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వారినే కాకుండా మండల స్థాయిలో ఉన్న ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలు, సూపరింటెండెంట్లను బదిలీ చేసే యోచనలో ఉన్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను కూడా కదపాలని నిర్ణయానికొచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారిలో ఎక్కువ మంది షాడో నేతకు అనుకూలంగా వ్యవహరించారని, ఆయన చెప్పినట్టే నడుచుకున్నారని టీడీపీ నాయకులు అనుమానిస్తున్నారు. దీంతో ఎలాగైనా వారిని కదపాలని భావిస్తున్నారు. జాబితాలు సిద్ధం: ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బదిలీలు చేయవలసిన సిబ్బంది జాబితాలను టీడీపీ నేతలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న జెడ్పీ ఉద్యోగులు, అధికారులు తాము కోరుకున్న పోస్టుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వేర్వేరు మార్గాల ద్వారా టీడీపీ నేతలను ఆశ్రయించి కావలసిన సీటు కోసం పైరవీలు చేసుకుంటున్నారు. కొందరు టీడీపీ నాయకులు కూడా ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు కాసులొచ్చే అవకాశం దొరికిందని ఆనందపడుతున్నారు. రూ.లక్షల్లో రేటు!: కొంతమందైతే బదిలీల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. ఉద్యోగులు, అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. కోరినంత ఇస్తే మంచి పోస్టులిప్పిస్తామని నమ్మ బలుకుతున్నారు. తాము చెప్పినట్లే జరుగుతుందని భరోసా కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎంపీడీఓ, ఇంజినీరింగ్ స్థాయి పోస్టులకు భారీస్థాయిలో రేటు పలుకుతోంది. రూ.లక్షల్లోనే ముట్టజెప్పేందుకు ఆశావహులు ముందుకొస్తున్నారు. మొత్తానికి బదిలీల నిషేధం ఎత్తివేసిన రోజు నుంచి జెడ్పీ ఉన్నతాధికారులకు సిఫారసులు, ఫోన్‌కాల్స్ తాకిడి ఎక్కువైంది. తాము సూచించిన వ్యక్తులనే తమ మండలాల్లో నియమించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. విశేషమేమిటంటే ఒక మండలం నుంచి రెండేసి, మూడేసి వర్గాలుగా విడిపోయి తమ అనుకూల వ్యక్తుల కోసం జెడ్పీ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. తీవ్ర పోటీ ఉన్న మండలాలు ఎంపీడీఓల విషయంలోనైతే విజయనగరం, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, లక్కవరపుకోట, జామి, ఎస్.కోట, గంట్యాడ, కొత్తవలస, వేపాడ, సీతానగరం, రామభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురంలో పోస్టులకు డిమాండ్ బాగా ఉంది. ఇంజినీరింగ్ పోస్టుల విషయంలోనైతే గజపతినగరం, చీపురుపల్లి, గరివిడి, కొత్తవలస, ఎస్‌కోట, డెంకాడ, లక్కవరపుకోట, వేపాడ, సాలూరు, నెల్లిమర్ల, పార్వతీపురం స్థానాలకు విపరీతమైన పోటీ నెలకొంది. అధికార పార్టీ నేతలు ఈ పోటీనే క్యాష్ చేసుకుంటున్నారు. ఆశావహులతో ఒప్పందాలు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు.