పైరవీలకే ప్రాధాన్యం | District Panchayat Secretaries appointed Recommendation | Sakshi
Sakshi News home page

పైరవీలకే ప్రాధాన్యం

Published Fri, Feb 19 2016 1:07 AM | Last Updated on Thu, Mar 28 2019 5:30 PM

District Panchayat Secretaries appointed Recommendation

 ఏలూరు రూరల్ : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల నియామకం పరాకాష్టకు చేరింది. అనుభవం ప్రాతిపదికన చేపట్టాల్సిన నియామకం కాస్తా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో పూర్తయ్యాయి. సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రికమండేషన్‌తో ఓ కార్యదర్శి నియామకాన్ని అందుకున్నట్టు సమాచారం. ఈనెల 14న ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యదర్శుల కౌన్సెలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుకు పలువురు పోటీ పడ్డారు. తమస్థాయికి తగ్గట్టు స్థానిక ప్రజాప్రతినిధుల రికమండేషన్ తెచ్చుకున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి సత్యనారాయణ అనే వ్యక్తి తీసుకొచ్చిన సిఫార్సులు చూసి తోటి కార్యదర్శులు అవాక్కయ్యారని తెలిసింది. సాక్షాత్తూ హోంమంత్రి రికమండేషన్‌తో వచ్చినట్టు తె లిసి ఈ పోస్టు కోసం పోటీపడిన కార్యదర్శులు తోక ముడిచారు. ఇలా ఎవరికి వారు తమ అధికార బలాన్ని చూపించుకుంటూ పోస్ట్టులను అందుకున్నారు. అధికార, అంగబలం లేని కార్యదర్శులు కాసులతో పని చేసుకుపోతున్నారని తెలిసింది.
 
 జాయినింగ్‌లకు మోకాలడ్డు
 తమ ప్రమేయం లేకుండా బదిలీపై వచ్చి చేరుతున్న కార్యదర్శులకు స్థానిక ఎమ్మెల్యేలు మోకాలడ్డుతున్నారు. తమ అనుమతి లేకుండా విధుల్లో చేరడాన్ని ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు ముందుగానే కార్యదర్శులు తమను కలుసుకోనందున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియామకాన్ని పక్కన పెట్టాలంటూ ఎంపీడీవోలను ఆదేశిస్తున్నారు. దీంతో విధుల్లోకి చేరేందుకు ప్రయత్నించిన పలువురు కాార్యదర్శులు బిక్కమొహం వేస్తున్నారు. దెందులూరు, ఏలూరు నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న పంచాయతీల్లో చేరేందుకు వచ్చిన కార్యదర్శులు చోటా నాయకులతో కలిసి వెళ్లి ఎమ్మెల్యేలను కలుసుకుంటున్నారు.
 
 త్వరలో 30 మంది రాక
 ఈ నెల 14న కార్యదర్శుల కౌన్సెలింగ్ ముగియడంతో భర్తీపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యదర్శులతో పాటు ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు ఉత్తర్వుప్రతులను ఆన్‌లైన్‌లో అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన 30 మంది కార్యదర్శులు కొద్దిరోజుల్లో విధుల్లో చేరే అవకాశం ఉంది. వీరు తమ ప్రాంతాల్లో రిలీవ్ అయిన తర్వాత 15 రోజుల్లోపు బాధ్యతలు స్వీకరించాలి. గురువారం   పలువురు రిపోర్ట్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement