ఏడాది కాలానికి 8 మిడ్‌ క్యాప్స్‌! | 8 Mid cap recommendations from Broking houses | Sakshi
Sakshi News home page

ఏడాది కాలానికి 8 మిడ్‌ క్యాప్స్‌!

Published Wed, Jun 10 2020 2:43 PM | Last Updated on Thu, Jun 11 2020 11:59 AM

8 Mid cap recommendations from Broking houses - Sakshi

ప్రభుత్వ చర్యలు, కేంద్ర బ్యాంకుల ప్యాకేజీలు కలగలసి ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో తాజాగా అమెరికన్‌ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇందుకు వీలుగా మార్చి కనిష్టం నుంచి 45 శాతం ఎగసింది. ఈ బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం మార్చి 23న నమోదైన కనిష్టం నుంచి 34 శాతం ర్యాలీ చేశాయి. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 31 శాతం పురోగమించింది. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు విస్తరించడంతో మార్చి నెలలో అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. అయితే పలు దేశాలు భారీ స్థాయిలో లిక్విడిటీని పంప్‌చేయడంతో నెల రోజుల్లోనే మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. మధ్యలో కొంతమేర ఆటుపోట్లు చవిచూసినప్పటికీ గత రెండు వారాలుగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ పరుగు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకింగ్‌ సంస్థలు 8-12 నెలల కాలానికి కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లను సూచిస్తున్నాయి. వివరాలు చూద్దాం..

యూపీఎల్‌ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఇటీవల కొంతమేర నికర రుణ భారాన్ని తగ్గించుకుంది. కంపెనీ పనితీరుపై లాక్‌డవున్‌ ప్రభావం తక్కువే. రూ. 630 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యూపీఎల్‌ షేరు రూ. 426 వద్ద ట్రేడవుతోంది.

సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌
వియత్నాంలో కంపెనీ అతిపెద్ద తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. కోవిడ్‌-19 పెద్దగా ప్రభావం చూపలేదు. కాఫీకి డిమాండ్‌ కొనసాగుతోంది. సప్లై చైన్‌ మెరుగుపడనుంది. ఇకపైనా ప్రొడక్టులకు పటిష్ట డిమాండ్‌ కనిపించనుంది. రూ. 315 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ షేరు రూ. 226 వద్ద ట్రేడవుతోంది.
-ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌

పీఐ ఇండస్ట్రీస్‌
పటిష్ట ఎగ్జిక్యూషన్‌ సామర్థ్యాలను కలిగిన కంపెనీ 1.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. ఆశావహ రుతుపవనాల కారణంగా మార్జిన్లు మెరుగుపడే వీలుంది. అగ్రికెమికల్స్‌తోపాటు ఇతర విభాగాలలోనూ విస్తరిస్తోంది. రూ. 1840 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీఐ ఇండస్ట్రీస్‌ షేరు 1620 వద్ద ట్రేడవుతోంది.

గుజరాత్‌ గ్యాస్‌
గత కొన్నేళ్లలో కొత్తగా 12వరకూ జిల్లాలలో కార్యకలాపాలు విస్తరించింది. రౌండ్‌ 9,10లో భాగంగా 7 కొత్త ప్రాంతాలలో హక్కులను సొంతం చేసుకుంది. తద్వారా మరో 5-7ఏళ్లపాటు సిటీగ్యాస్‌ పంపిణీలో అతిపెద్ద నెట్‌వర్క్‌ కలిగిన కంపెనీగా కొనసాగనుంది. చౌక ఎల్‌ఎన్‌జీ ధరలు, నియంత్రణ సంస్థల మద్దతుతో అమ్మకాల పరిమాణం పెరిగే వీలుంది. రూ. 315 టార్గెట్‌ ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గుజరాత్‌ గ్యాస్‌ షేరు రూ. 292 వద్ద కదులుతోంది.
-సెంట్రమ్‌ బ్రోకింగ్‌

టాటా కన్జూమర్‌
దేశీ వినియోగ రంగ వేగాన్ని అందిపుచ్చుకునే సన్నాహాల్లో ముందుంది. ఇందుకు వీలుగా టాటా కెమికల్స్‌ నుంచి కన్జూమర్‌ బిజినెస్‌ను విడదీసి విలీనం చేసుకుంది. తద్వారా టాటా కన్జూమర్‌గా ఆవిర్భవించింది. పటిష్ట బ్యాలన్స్‌షీట్‌, బ్రాండ్లు, ‍క్యాష్‌ఫ్లో, బలమైన యాజమాన్యం వంటి అంశాలు కంపెనీకి సానుకూలం. రూ. 431 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం టాటా కన్జూమర్‌ షేరు రూ. 384 వద్ద ట్రేడవుతోంది. 

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌
గతేడాది పటిష్ట పనితీరు చూపింది. ముఖ్యమైన డీల్స్‌ను సైతం గెలుచుకుంది. డిజిటల్‌ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందునిలిచే అవకాశముంది. తద్వారా ఈ ఏడాది సైతం మెరుగైన పనితీరు చూపనుంది. రూ. 2060 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ షేరు రూ. 1897 వద్ద కదులుతోంది. 
-మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌

ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌
కెమికల్‌ బిజినెస్‌లో కంపెనీకి పట్టుంది. ప్రధానంగా ఫ్లోరోకెమికల్స్‌ విభాగం అదనపు బలాన్నిస్తోంది. పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యం ద్వారా ఫ్లోరోకెమికల్స్‌ అప్లికేషన్స్‌లో అగ్రభాగాన నిలుస్తోంది. తద్వారా అవకాశాలను ముందుగానే అందిపుచ్చుకుంటోంది. రూ. 4,000 టార్గెట్‌ ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌ఆర్‌ఎఫ్‌ షేరు రూ. 3,660 వద్ద కదులుతోంది. 

ఆస్ట్రల్‌ పాలీటెక్నిక్‌
ఈ ఏడాది తొలి రెండు నెలల్లో(జనవరి, ఫిబ్రవరి) కంపెనీ చూపిన వృద్ధి అంతర్గత పటిష్టతను చూపుతోంది. లాక్‌డవున్‌ తదుపరి పీవీసీ పైపుల పరిశ్రమలో కన్సాలిడేషన్‌కు దారిచూపవచ్చు. భవిష్యత్‌లో పరిశ్రమను మించి వేగవంత వృద్ధిని సాధించే వీలుంది. కంపెనీకున్న సామర్థ్యం రీత్యా మార్కెట్‌ వాటాను మరింత పెంచుకునే అవకాశముంది. రూ. 1100 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆస్ట్రల్‌ పాలీ షేరు 898 వద్ద ట్రేడవుతోంది.
-ఎడిల్‌వీజ్‌ బ్రోకింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement