న్యూఢిల్లీ: అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) భావిస్తోంది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పుచేర్పుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘క్లాసికల్ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్టు కమిటీ చైర్‌పర్సన్ సి.ఇసాక్ తెలిపారు.
‘ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్‌గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఎందుకంటే భారత్ అనే పేరు చాలా పురాతనమైన పేరు. విష్ణుపురాణం వంటి 7 వేల ఏళ్ల నాటి పురాతన గ్రంథాల్లోనే భారత్ పేరును ప్రస్తావించా’ అని ఆయన వివరించారు. అయితే ప్యానల్ సిఫార్సుల అమలుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్ దినేశ్ సక్లానీ స్పష్టం చేశారు.
అనంతరం ఈ మేరకు సంస్థ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొత్త ప్రతిపాదనలను డొమైన్ నిపుణులు తదితరులకు ఎప్పటికప్పుడు తెలియపరిచి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. అందుకే ఈ అంశంపై ఇప్పుడే ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా అది తొందరపాటు చర్య అవుతుంది’ అని అందులో పేర్కొంది.
‘ఇండియా’ కూటమికి భయపడే: విపక్షాలు
కమిటీ సిఫార్సులను విపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ‘చివరికి పాఠ్య పుస్తకాల్లో, సిలబస్‌లో కూడా దేశ చరిత్రను బీజేపీ ఎలా వక్రీకరించాలని చూస్తోందో దీనిని బట్టి మరోసారి రుజువైంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తమ దృష్టిలో ఇండియా, భారత్ పేర్లు రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడం ప్రధాని మోదీని విపరీతంగా భయపెడుతోందనేందుకు ఇది ప్రబల నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది.
ఎన్‌డీఏ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కార్ ఇలా పేర్ల మారి్పడి పరంపర కొనసాగిస్తోందని డీఎంకే ఆరోపించింది. ఆర్‌జేడీ తదితర పార్టీలు కమిటీ సిఫార్సులను తప్పుబట్టాయి. ‘‘విపక్షాలు తమ కూటమి పేరున ‘ఇండియా’ బదులు భారత్‌గా ఇప్పడు మార్చేస్తే మోదీ సర్కార్ వెంటనే దేశం పేరును ‘భారత్’కు బదులు జంబూదీ్వపం అనో మరేదైనా పేరో పెట్టే స్తారా ?’’ అని ఎంపీ మనోజ్ ఝా ఎద్దేవా చేశారు.
జీ20 శిఖరాగ్రంతో మొదలు
భారత్ పేరు తొలుత ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ఆహ్వాన పత్రికల్లో ప్రత్యక్షమవడం విదితమే. రాష్ట్రపతిని అప్పటిదాకా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’గా సంబోధిస్తుండగా కొత్తగా దానికి బదు లు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఆ ఆహ్వాన పత్రికల్లో మోదీ ప్రభుత్వం పేర్కొంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ సీటు ముందు ఉంచిన నేమ్‌ప్లేట్‌పై ఇండియా బదులు భారత్ అనే రాసి ఉండటం తెల్సిందే.
కమిటీ ఏం చెప్పిందంటే...
ఎన్‌సీఈఆర్‌టీ ఉన్నత స్థాయి కమిటీ చైర్‌పర్సన్ ఇసాక్ సంఘ్ పరివార్‌కు సన్నిహితుడు. దాని తాలూకు అతివాద సంస్థ అయిన భారతీయ విచార కేంద్రం ఉపాధ్యక్షునిగా ఆయన పని చేశారు. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్) సభ్యుడు కూడా. ఎన్‌సీఈఆర్‌టీకి కమిటీ చేసిన సిఫార్సులను ఆయన సవివరంగా పేర్కొన్నారు.
అవేమిటంటే...
► బ్రిటిషర్లు భారత చరిత్రను ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ మూడు దశలుగా విభజించారు. వీలైనంత వరకూ భారత్ ఘనతలను, సాధించిన ప్రగతిని, శాస్త్రీయ విజయాలను మరుగునపడేశారు. వాటిని తక్కువ చేసి చూపించారు. అందుకే పాఠశాలల్లో మధ్య యుగ, ఆధునిక భారత చరిత్రతో పాటు క్లాసికల్ పీరియడ్ గురించి ఇకమీదట బోధించాలి.
► ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో హిందూ వైఫల్యాలను మాత్రమే ప్రముఖంగా పేర్కొన్నారు. కానీ మొగలులు తదితర సుల్తాన్లపై హిందూ రాజులు సాధించిన విజయాలను మాత్రం ప్రస్తావించలేదు.
► అందుకే మన చరిత్రలో పలు యుద్ధాల్లో హిందూ రాజులు సాధించిన విజయాలకు పాఠ్య పుస్తకాల్లో మరింతగా చోటు కలి్పంచాలి.
► అన్ని పాఠ్యపుస్తకాల్లోనూ ఇండియన్ నాలెడ్జ్ సిస్టం (ఎన్‌కేఎస్)ను కొత్తగా ప్రవేశపెట్టాలి.
► కమిటీలో ఐసీహెచ్‌ఆర్ చైర్‌పర్సన్ రఘువేంద్ర తన్వర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ వందనా మిశ్రా, వసంత్ షిందే, మమతా యాదవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment